కురిసింది వాన!

ABN , First Publish Date - 2021-04-20T04:33:44+05:30 IST

జిల్లావ్యాప్తంగా సోమవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.

కురిసింది వాన!
విజయనగరం కోట జంక్షన్‌లో నిలిచిన వర్షపు నీరు

జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

ఈదురుగాలులకు నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు 

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

దెబ్బతిన్న పంటలు

ఎండ వేడి నుంచి ఊరట చెందిన జిల్లావాసులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ బాడంగి/ సాలూరు రూరల్‌/ గంట్యాడ, ఏప్రిల్‌ 19 : జిల్లావ్యాప్తంగా సోమవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మధ్యా హ్నం వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రానికి  వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులకు తోడు ఉరు ములు, మెరుపుల శబ్దాలకు జిల్లావాసులు భయాందోళన చెందారు. పార్వతీపురం, జియ్యమ్మవలస, కురుపాం, కొమరాడ, మక్కువ, రామభద్రపురం, పాచిపెంట, బాడంగి, భోగాపురం, గంట్యాడ, ఎస్‌.కోట, నెల్లిమర్ల, పూసపాటిరేగ, చీపురుపల్లిలో భారీగా వర్షం పడింది. గజపతినగరం, బొండపల్లి, డెంకాడ,  మెంటాడ, గరివిడి మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. సాలూరు మండలం మామిడి పల్లిలో సోమవారం రాత్రి వడగాళ్ల వాన కురిసింది. సాలూరు పట్టణం, రూరల్‌లో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో రాత్రి 9 గంటల వరకూ వాన పడింది. విజయనగరంలో పాత మునిసిపల్‌ కార్యాలయం రోడ్డు, గాజులరేగ, తోటపాలెం, ఐస్‌ ఫ్యాక్టరీ రోడ్డు, రింగురోడ్డు, కలెక్టరేట్‌ తదితర లోతట్టు పాంత్రాల్లో వర్షపునీరు నిలిచింది.  మొత్తంగా ఈ వర్షంతో ప్రజలు ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందినప్పటికీ విద్యుత్‌ కోతలతో ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా వరుసగా రెండు రోజుల నుంచి కురిసిన అకాల వర్షాలకు  వేలాది ఎకరాల్లో మామిడి, బొప్పాయి సపోటా పంటతో పాటు గులాబి, కనకంబరాలు, సన్నజాజులు, మల్లె పూలసాగు, నువ్వులు, జొన్నకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.  ఇదిలా ఉండగా  చెరకు, గోగు నాట్లు వేసుకునేందుకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని బాడంగి ప్రాంత రైతులు తెలిపారు. చెరువుల్లో నీరు చేరనుందని, తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదని వారు చెబుతున్నారు.

Updated Date - 2021-04-20T04:33:44+05:30 IST