అంత ఖర్చు చేస్తే కూడా... వారి సంపద కరిగిపోవడానికి 84 ఏళ్లు...

ABN , First Publish Date - 2022-01-18T23:32:41+05:30 IST

కరోనా నేపధ్యంలో నిరుడు 84 శాతం మంది హౌస్‌హోల్డ్స్ ఆదాయం తగ్గింది. కానీ... అదే సమయంలో కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగింది.

అంత ఖర్చు చేస్తే కూడా... వారి సంపద కరిగిపోవడానికి 84 ఏళ్లు...

భారత్‌లో ఏడాదిలో రెండితలు పెరిగిన బిలియనీర్లు...

దేశంలోని పిల్లలందరికీ పాతికేళ్ళపాటు ఉచిత విద్య...

లండన్ : కరోనా నేపధ్యంలో నిరుడు 84 శాతం మంది హౌస్‌హోల్డ్స్ ఆదాయం తగ్గింది.  కానీ... అదే సమయంలో కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని పేదరిక నిర్మూలన కోసం పని చేస్తున్న  ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో 2020 తో పోలిస్తే 2021 లో బిలియనీర్ల సంపద రెండింతలు పెరిగిందని, కుబేరుల సంఖ్య కూడా ఏడాది క్రితంతో పోలిస్తే 39 శాతం పెరిగిందని తేల్చింది. ఈ ఏడాది ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ తన నివేదికను నిన్న(సోమవారం)  విడుదల చేసింది. కరోనా కారణంగా జీవనాధారం దెబ్బతిని దేశంలోని 84 శాతం కుటుంబాల ఆధాయం తగ్గిందని, కాగా బిలియనీర్ల సంఖ్య మాత్రం  102 నుండి 142కు పెరిగిందని వెల్లడించింది. దేశ సంపదలో 45 శాతం మేరకు... తొలి పదిమంది ధనవంతుల వద్దే ఉందని, అట్టడుగున ఉన్న 50 శాతం మంది వద్ద ఆరు శాతం సంపద మాత్రమే ఉందని తేల్చింది. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఇక... దేశంలోని కుబేరుల జాబితాలో మొదటి వంద స్థానాల్లో ఉన్న వ్యక్తుల సంపద 2021 లో రూ. 57.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక... దేశంలోని తొలి పదిమంది ధనవంతుల సంపదతో దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక, ఉన్నతస్థాయి విద్యను పాతికేళ్లపాటు ఉచితంగా అందించవచ్చు. అత్యంత ధనవంతులైన మొదటి 98 మంది సంపద, అట్టడుగు 40 శాతంతో ఉన్న 55.5 కోట్లమంది పేద ప్రజల సంపదతో సమానమని లెక్కగట్టింది. 


తొలి 10 మంది సంపదతో... తొలి పదిమంది ధనవంతులు ప్రతిరోజు రూ. పది లక్షలు ఖర్చు చేసినపక్షంలో... వారి సంపద మొత్తం కరిగిపోవడానికి 84 ఏళ్లు పడుతుందని ఆక్స్‌ఫామ్ తెలిపింది. దేశంలోని బిలియనీర్లు, మల్టీ మిలియనీర్లపై ఒక శాతం వెల్త్ ట్యాక్స్ విధించినపక్షమంలో... ప్రతి సంవత్సరం 78.3 బిలియన్ డాలర్లు జమ అవుతాయి. ఈ డబ్బుతో... దేశంలో ఏ ఒక్కరు కూడా... వైద్యం కోసం తమ జేబు నుండి ఖర్చు చేయవలసిన అవసరం రాదు. అంతేకాకుండా 30.5 బిలియన్ డాలర్ల మిగులు ఉంటుంది. మొదటి 98 కుబేరుల సంపదపై నాలుగు శాతం పన్ను విధించినపక్షంలో వచ్చే డబ్బుతో అంగన్‌వాడీ సేవలు, పోషణ్ అభియాన్, కిశోర బాలికల కోసం తెచ్చిన పథకాలు కలిగిన మిషన్ పోషణ్ 2.0 పథకాన్ని ఏకంగా దశాబ్దకాలంపాటు నడపొచ్చు. 

Updated Date - 2022-01-18T23:32:41+05:30 IST