తెలుగు రాష్ట్రాల రియల్టీ సంస్థల్లో ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2022-01-11T08:36:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దర్జాగా పన్ను ఎగవేస్తున్న మూడు స్థిరాస్తి (రియల్టీ) కంపెనీలకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చెక్‌ పెట్టింది. ఈ నెల 5వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ..

తెలుగు రాష్ట్రాల రియల్టీ సంస్థల్లో ఐటీ సోదాలు

  రూ.800 కోట్ల నల్లధనం గుర్తింపు 

  సీబీడీటీ వెల్లడి

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దర్జాగా పన్ను ఎగవేస్తున్న మూడు స్థిరాస్తి (రియల్టీ) కంపెనీలకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చెక్‌ పెట్టింది. ఈ నెల 5వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఈ మూడు కంపెనీల కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఈ సోదాల్లో రూ.800 కోట్ల నల్లధన లావాదేవీల్ని గుర్తించినట్టు తెలిపింది. అంతేకాకుండా ఈ సోదాల్లో రూ.1.64 కోట్ల నగదు కూడా పట్టుబడినట్లు పేర్కొంది. ఈ మూడు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు.. హైదరాబాద్‌, కర్నూలు, వైజాగ్‌, అనంతపురం, నంద్యాల, బళ్లారి వంటి పలు నగరాలు, పట్టణాల్లో భూ అభివృద్ధి, నిర్మాణ రంగంలో ఉన్నట్టు సీబీడీటీ తెలిపింది. ఈ దాడుల్లో భాగంగా కర్నూలు, అనంతపురం, కడప, నంద్యాలతో సహా పలు పట్టణాల్లో వీటికి చెందిన 24 కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 5 నుంచి నాలుగు రోజుల పాటు విస్తృత సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. సోదాల్లో భాగంగా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. నవ్య డెవలపర్స్‌, రాగమయూరి ఇన్‌ఫ్రా, స్కంధానీ ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఈ సోదాలు జరిగినట్టు సమాచారం. 


ఎగవేత ఇలా ..

పన్ను ఎగవేసేందుకు ఈ కంపెనీలు అనుసరిస్తున్న అక్రమాలూ ఈ సోదాల్లో బయట పడ్డాయి. ఒక  కంపెనీ అయితే ఇందుకోసం ఏకంగా ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ కంటే అధిక ధరకు అమ్మిన నిధులు లెక్కల్లోకి రాకుండా జాగ్రత్త పడ్డాయి. లెక్కల్లోకి రాని ఈ నిధులను భూముల కొనుగోళ్లు, ఇతర ఖర్చులకు ఉపయోగించినట్టు సోదాల్లో బయట పడింది.


క్రిప్టో కేటుగాళ్ల

ఆస్తులు జప్తు : ఈడీ

క్రిప్టో కరెన్సీల పేరుతో అమాయకుల్ని మోసగిస్తున్న కేటుగాళ్లపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి పెట్టింది. ఈ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా కల్లబొల్లి కబుర్లతో మదుపరుల నుంచి రూ.1,200 కోట్ల డిపాజిట్లు సేకరించిన నిషాద్‌ కే అనే కేటుగాడికి చెందిన రూ.36.72 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది. కేరళకు చెందిన ఈ ఘరానా మోసగాడు, మరికొందరితో కలిసి కేరళలోని మల్లపురం, కన్నూరు ప్రాంతాల్లోని మదుపరుల నుంచి ఈ డిపాజిట్లు సమీకరించినట్టు ఆరోపణ. ఇలా సేకరించిన నిధులతో వీరు సొంత ఆస్తులు సమకూర్చుకుంటూ విలాసవంతమైన హోటళ్లు, రిసార్ట్‌ల్లో జల్సా చేసినట్టు ఈడీ పేర్కొంది. క్రిప్టోల పేరుతో జరిగిన మోసాలపై ఈడీ దృష్టి పెట్టడం ఇదే మొదటిసారి. 

Updated Date - 2022-01-11T08:36:50+05:30 IST