ప్రాజెక్టులకు జలకళ

ABN , First Publish Date - 2021-07-26T08:13:02+05:30 IST

ఎగువన భారీ వర్షాలకు లక్షల క్యూసెక్కుల్లో వరద వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు కళకళలాడుతున్నాయి.

ప్రాజెక్టులకు జలకళ

  • తెలుగు రాష్ట్రాలకు నీటి కొరత లేనట్లే!
  • ఎస్‌ఎస్ఆర్‌సీ నుంచి విద్యుదుత్పత్తికి కేఆర్‌ఎంబీ అనుమతి కోరిన ఆంధ్ర


గువన భారీ వర్షాలకు లక్షల క్యూసెక్కుల్లో వరద వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు కళకళలాడుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టిలో 129.72 టీఎంసీల గరిష్ఠ నిల్వకుగాను ప్రస్తుతం 74.129 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 23,435 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. 3,50,408 క్యూసెక్కులను దిగువకు వదిలి పెడుతున్నారు. నారాయణపూర్‌ సామర్థ్యం 37.64 టీఎంసీలకు గాను 25.76 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు 3,14,574 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంటే, దిగువకు 3,33,827 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. తుంగభద్ర జలాశయం కూడా రెండు రోజుల్లో పూర్తిగా నిండనుంది. శ్రీశైలం డ్యాం సగానికిపైగా నిండింది.  నాగార్జున సాగర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలకుగాను ప్రస్తుతం 183.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 


ఇందులోకి 29,214 క్యూసెక్కులు వస్తుంటే .. 3,192 క్యూసెక్కులను వదులుతున్నారు. పులిచింతల సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 43.84 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోనికి 18,535 క్యూసెక్కులు వస్తుంటే.. 20,791 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ద్వారా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలం కుడి కాలువపై నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదివారం కేఆర్‌ఎంబీని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఇక కృష్ణా డెల్టా సిస్టమ్‌లో ప్రధానమైన ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ సామర్థ్యం 3.07 టీఎంసీలకు గాను పూర్తిస్థాయిలో నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీకి 1,14,569 క్యూసెక్కులు వస్తుండగా.. 99,776 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2021-07-26T08:13:02+05:30 IST