లీటరుపై రూ.10 దాకా తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-07T08:19:14+05:30 IST

వంట నూనెల ధరల మంట మరికొంత చల్లారనుంది. నూనెల ధరలను లీటరుపై 10 రూపాయల దాకా తగ్గించాలని కేంద్రప్రభుత్వం వంట నూనెల కంపెనీలను ఆదేశించింది.

లీటరుపై రూ.10 దాకా తగ్గించాలి

లీటరుపై రూ.10 దాకా తగ్గించాలని నూనెల కంపెనీలకు కేంద్రం ఆదేశం


వంట నూనెలపై కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం

ఒకే బ్రాండ్‌ నూనెకు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రేట్లపై ఆగ్రహం 

అంతటా ధరలు ఒకేలా ఉండాలని సూచన

తగ్గించిన మేరకు ఎంఆర్‌పీలో మార్పులు చేయాలి


న్యూఢిల్లీ, జూలై 6: వంట నూనెల ధరల మంట మరికొంత చల్లారనుంది. నూనెల ధరలను లీటరుపై 10 రూపాయల దాకా తగ్గించాలని కేంద్రప్రభుత్వం వంట నూనెల కంపెనీలను ఆదేశించింది. వారం రోజుల్లోగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరింది. తగ్గించిన మేరకు ఎంఆర్‌పీలో మార్పులు చేయాలని సూచించింది. అంతర్జాతీయంగా నూనెల ధర తగ్గడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సుధాన్షు పాండే బుధవారం నూనెల తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 


 గడిచిన వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా నూనెల ధరలు 10ు తగ్గిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు వినియోగదారులపై భారాన్ని తగ్గించాలని కంపెనీలను ఆదేశించారు. భారత్‌ వంట నూనెల అవసరాల్లో 60శాతం దిగుమతులపైనే ఆధారడుతున్నది. అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో నాలుగైదు నెలలుగా వంట నూనెల ధరలు మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగాయి. ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుతున్నాయి. ఇందుకు అనుగుణంగా పోయిన నెలలో నూనెలపై కంపెనీలు రూ.10-15 దాకా తగ్గించాయి. మరోవైపు, ఒకే బ్రాండ్‌ నూనెకు దేశంలో వేర్వేరు చోట్ల వేర్వేరు ధరలు ఉండటంపై సుధాన్షు పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు కూడా ఎంఆర్‌పీలోనే భాగమైనప్పుడు ధరల్లో తేడా ఎందుకుంటుందని కంపెనీలను ప్రశ్నించారు. అంతటా ఒకే ధరను అమలు చేయాలని ఆదేశించారు. కొన్ని కంపెనీలు ప్యాకెట్లపై ముద్రిస్తున్న బరువుకు, వాస్తవ బరువుకు తేడా ఉంటోందని సుధాన్షు పాండే తెలిపారు.

Updated Date - 2022-07-07T08:19:14+05:30 IST