POCSO Act court : లైంగిక దాడి బాధితురాలు చదువులో వెనుకబడుతుందని భావించరాదు

ABN , First Publish Date - 2022-10-06T22:08:04+05:30 IST

లైంగిక దాడి బాధితురాలు చదువులో వెనుకబడుతుందని

POCSO Act court : లైంగిక దాడి బాధితురాలు చదువులో వెనుకబడుతుందని భావించరాదు

ముంబై : లైంగిక దాడి బాధితురాలు చదువులో వెనుకబడుతుందని, పరీక్షల్లో ఆమెకు మంచి మార్కులు రావని భావించకూడదని లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (POCSO Act) ప్రకారం ఏర్పాటైన కోర్టు చెప్పింది. మైనర్ కుమార్తెను దాదాపు ఏడేళ్ళపాటు లైంగికంగా అత్యాచారం చేసిన తండ్రికి పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. స్పెషల్ జడ్జి జయశ్రీ ఆర్ పులటే సెప్టెంబరు 29న ఈ తీర్పు చెప్పారు. 


ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, నిందితుడు సౌదీ అరేబియాలో ఓ నౌకలో పని చేసేవారు. రెండు నెలలకోసారి ముంబైలోని తన కుటుంబ సభ్యులను సందర్శించేవారు. 2014లో ఆయన భార్య ఓ విషయాన్ని గమనించారు. తమ కుమార్తె ఆయనకు దూరంగా ఉంటోందని, ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ తన గదిలోనే ఉండిపోతోందని గమనించారు. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలని తమ కుమార్తెను ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ, ‘‘నాన్న నన్ను ఏడేళ్ళ నుంచి లైంగికంగా వేధిస్తున్నారు’’ అని చెప్పింది. 


ఆ బాలిక పదేళ్ళ వయసు నుంచి తన తండ్రి వేధింపులను భరిస్తోందని అప్పుడు తెలిసింది. వెంటనే నిందితుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బాలిక తండ్రి దోషి అని తీర్పు చెప్పింది. ఈ ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆ తండ్రి చేసిన వాదనను తోసిపుచ్చింది. ఏం జరుగుతున్నదీ మొదట్లో బాధితురాలికి అర్థం కాలేదని తెలిపింది. లైంగిక వేధింపులు ప్రారంభమయ్యేనాటికి ఆమె పసితనంలో ఉన్నట్లు పేర్కొంది. 


తొమ్మిదో తరగతిలో సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్‌కు హాజరైనపుడు తాను ఎదుర్కొంటున్నది లైంగిక వేధింపులని ఆ బాలిక తెలుసుకుందని పేర్కొంది. తన తండ్రి జైలుకు వెళితే తమ కుటుంబానికి ఆర్థిక సహకారం ఉండదనే ఆందోళన ఆమెకు ఉండటం సహజమేనని తెలిపింది. 


బాధితురాలిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినపుడు, తాను తన తండ్రి ఇంట్లో ఉన్నపుడు కూడా పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్లేదాన్నని చెప్పింది. తనకు తొమ్మిదో తరగతిలో సగటున 70 శాతం మార్కులు వచ్చినట్లు తెలిపింది. తన తండ్రి తనకు, తన తోబుట్టువులకు క్రమం తప్పకుండా కొత్త బట్టలు, ఆటబొమ్మలు తీసుకొచ్చేవారని చెప్పింది. 


దీనిపై డిఫెన్స్ న్యాయవాది స్పందిస్తూ, లైంగిక దాడి ఆరోపణలకు, దీనికి పొంతన లేదని వాదించారు. కోర్టు స్పందిస్తూ, లైంగిక వేధింపుల బాధితులంతా ఒకే విధంగా ప్రతిస్పందించరని చెప్పింది. లైంగిక వేధింపుల బాధితులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేరని భావించకూడదని చెప్పింది. ఆమె క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతుండటం, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఆమె ఆరోపణలను నమ్మలేనివిగా చేయబోవని తెలిపింది. అదేవిధంగా నిందితుడు తన పిల్లలకు బట్టలు, ఆటబొమ్మలు పట్టుకెళ్ళడం సాధారణ విషయమేనని, ఈ విధంగా సాధారణంగా ప్రవర్తిస్తున్నారంటే, ఆయన ఎటువంటి నేరం చేయరని భావం కాదని చెప్పింది.


Updated Date - 2022-10-06T22:08:04+05:30 IST