ఐటీ.. అసలు నిజం!

ABN , First Publish Date - 2020-02-16T06:14:08+05:30 IST

‘నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది’ అని అంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆదాయపు పన్ను శాఖ సోదాల నేపథ్యంలో వైసీపీ–టీడీపీ నాయకుల మధ్య శుక్రవారంనాడు సాగిన మాటల యుద్ధం...

ఐటీ.. అసలు నిజం!

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి జగన్‌ కలుసుకోవడంపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తనను కలిసిన వారు అడిగే అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేనప్పుడే ‘‘అమిత్‌షాను కలవండి..’’ అని ప్రధాని మోదీ సూచిస్తారని బీజేపీ నాయకులు చెబుతుంటారు. అయితే తమ ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలను కలవడంపై ఎన్ని ప్రచారాలు జరిగినా, ఏమి జరగబోతున్నదన్నది వారం రోజుల్లో మీరే చూస్తారుగా అని మంత్రి బొత్స నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏలో చేరే విషయమై వైసీపీ నాయకులు ఇస్తున్న సంకేతాలు నిజమయ్యే పక్షంలో శాసనమండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల కలయికపై స్పష్టత వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు.

అవినీతి కేసులతో జగన్మోహన్‌రెడ్డి, అవినీతి ఆరోపణలతో చంద్రబాబు గబ్బు పట్టిపోతే, ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. నిజానికి ఈ ఇరువురు నాయకులపై అవినీతి మరక అంటించడం వల్ల వారిద్దరికీ కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకులు ఉండరన్న అభిప్రాయానికి వచ్చిన ప్రజలు జగన్మోహన్‌రెడ్డిపైన రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారన్న అభిప్రాయానికి వచ్చారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనపై అవినీతికి సంబంధించిన కేసులు ప్రత్యక్షంగా నమోదు కాలేదు. జగన్మోహన్‌రెడ్డిపైన మాత్రమే కేసులు ఉన్నాయి. ఈ కారణంగా తమ నాయకుడితో పాటు చంద్రబాబును ఒకే గాటన కట్టడానికై వైసీపీ నాయకులు తాజా ఐటీ సోదాలను వాడుకుంటున్నారు.


‘నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది’ అని అంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆదాయపు పన్ను శాఖ సోదాల నేపథ్యంలో వైసీపీ–టీడీపీ నాయకుల మధ్య శుక్రవారంనాడు సాగిన మాటల యుద్ధం ఈ సామెతను గుర్తు చేస్తున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ శాఖ ప్రత్యేక బృందాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు రోజుల పాటు సోదాలు నిర్వహించాయి. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను దారి మళ్లించినట్టు నిర్ధారణ అయ్యిందనీ, సోదాలలో భాగంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌ నివాసంలో కూడా తనిఖీలు చేశామనీ ఆ తర్వాత ఐటీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు పేరును ఆ ప్రకటనలో నేరుగా ప్రస్తావించకుండా ఒక ప్రముఖ వ్యక్తి అని పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది.

ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబువేననీ, ఆ డబ్బంతా శ్రీనివాస్‌ ఇంట్లోనే దొరికిందనీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత మీడియాలో ప్రచురించడం, దానిపై మంత్రులు, వైసీపీ నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. అంతటితో ఆగకుండా కేంద్ర పెద్దల ఆదేశాలతోనే ఐటీ దాడులు జరిగాయనీ, చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని కూడా ప్రచారం చేశారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీగా వైసీపీ అలాంటి ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టలేం. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడానికి ఐటీ శాఖ అధికారులను సంప్రదించగా.. విస్మయం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. శ్రీనివాస్‌ నివాస గృహంతో పాటు పలు ఇన్‌ఫ్రా కంపెనీలలో జరిపిన సోదాలకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేదని స్పష్టం అయ్యింది. వ్యాపార పరమైన ద్వేషాలు, అసూయతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ సోదాలు జరిగినట్టు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి.

సోదాలు జరిగిన కంపెనీల టర్నోవర్‌ అంతా కలిపి కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఉండదనీ, సబ్‌ కాంట్రాక్టర్ల టర్నోవర్‌ను కూడా కలుపుకొని రెండు వేల కోట్ల రూపాయలు లెక్క చెబుతున్నారనీ ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక శ్రీనివాస్‌ ఇంట్లో రెండున్నర లక్షల రూపాయల నగదు మాత్రమే లభించిందనీ, నిబంధనల ప్రకారం ఎవరైనా మూడు లక్షల వరకు నగదు ఉంచుకోవచ్చుననీ, ఆ కారణంగా శ్రీనివాస్‌ ఇంట్లో లభించిన నగదును కూడా తిరిగి ఇచ్చివేయడం జరిగిందనీ ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ఆయన ఇంట్లో లభించిన పత్రాలు, ఇతరత్రా సమాచారం ఆధారంగా చంద్రబాబుపై కేసు పెట్టలేమని ఆ వర్గాలు వివరించాయి. లోకేశ్‌ మిత్రుడు కిలారు రాజేశ్‌ ఇంట్లో ఆ మాత్రం నగదు కూడా లభించలేదని స్పష్టం చేస్తున్నాయి. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి లక్ష్యంగా చేసిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరిగాయనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే ప్రతిమా శ్రీనివాస్‌ కంపెనీలో కూడా సోదాలు జరిగాయనీ ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రతిమా శ్రీనివాస్‌ విషయానికి వస్తే.. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని తెలిసింది.

అయితే అన్నదమ్ముల మధ్య నగదు లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు మాత్రం లభించలేదు. తెలుగుదేశం నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి కంపెనీలో మాత్రం పన్ను చెల్లించకుండా నగదు మార్పిడి జరిగినట్టు కొన్ని ఆధారాలు లభించాయని అధికారవర్గాలు తెలిపాయి. ఢిల్లీ నుంచి విడుదల అయిన ప్రకటనలో పేర్కొన్నట్టు రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని రుజువు చేయడానికి తగిన పత్రాలు కూడా లభించలేదని స్పష్టంచేస్తున్నారు. వాస్తవం ఇది కాగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరికించడం కోసం బీజేపీ పెద్దల అనుమతితోనే ఈ సోదాలు జరిగినట్టు తొలుత ప్రచారం చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు దొరికాయని శుక్రవారం నుంచి ప్రచారం మొదలెట్టారు. దీంతో ఉలిక్కిపడిన తెలుగుదేశం నాయకులు అదంతా అవాస్తవం అని అంటూనే.. జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసుల చిట్టాను ఉటంకించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు బురద జల్లుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఇదే కావాలి. అవినీతి కేసులతో జగన్మోహన్‌రెడ్డి, అవినీతి ఆరోపణలతో చంద్రబాబు గబ్బుపట్టిపోతే, ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. నిజానికి ఈ ఇరువురు నాయకులపై అవినీతి మరక అంటించడం వల్ల వారిద్దరికీ కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. జగన్మోహన్‌రెడ్డిపై అవినీతి కేసులు విచారణలో ఉన్న విషయం తెలిసి కూడా ప్రజలు ఆయనకు అధికారం అప్పగించారు. గత ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ప్రచారం జరగడంతో చంద్రబాబును ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు.

ఆయనపై కొత్తగా అవినీతి ఆరోపణలు చేసినా రాజకీయంగా కలిగే నష్టం ఏమీ ఉండదని గత అనుభవాలు చెబుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నవారిపై కేసులు పెట్టడం వల్ల వారికి సానుభూతి లభించడాన్ని మనం చూశాం. జగన్మోహన్‌రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకులు ఉండరన్న అభిప్రాయానికి వచ్చిన ప్రజలు జగన్మోహన్‌రెడ్డిపైన రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారన్న అభిప్రాయానికి వచ్చారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనపై అవినీతికి సంబంధించిన కేసులు ప్రత్యక్షంగా నమోదు కాలేదు. జగన్మోహన్‌రెడ్డిపైన మాత్రమే కేసులు ఉన్నాయి. ఈ కారణంగా తమ నాయకుడితోపాటు చంద్రబాబును ఒకే గాటన కట్టడానికై వైసీపీ నాయకులు తాజా ఐటీ సోదాలను వాడుకుంటున్నారు. ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు’గా ఐటీ శాఖ ప్రకటించిన రెండు వేల కోట్ల రూపాయలు శ్రీనివాస్‌ ఇంట్లోనే లభించాయని ప్రచారం చేశారు. రాజకీయ నాయకుల అవినీతిని నిరూపించడం అంత తేలిక కాదు. మన దేశంలో నగదు రూపంలో తీసుకునే లంచాలను లేదా రాజకీయ విరాళాలను రుజువు చేయలేని పరిస్థితి ఉంది. బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చడానికి ప్రయత్నించిన సందర్భాలలోనే దొరికిపోతుంటారు.

జగన్మోహన్‌రెడ్డి విషయంలో జరిగింది ఇదే! రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మేళ్లు పొందినవారు ప్రతిఫలంగా జగన్మోహన్‌రెడ్డికి చెందిన మీడియా సంస్థలలో వైట్‌ రూపంలో పెట్టుబడులు పెట్టారు. ఈ కారణంగానే ఆయనపై సీబీఐ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేయగలిగారు. జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబు దొందూ–దొందే అని ప్రజలను నమ్మించడానికై వైసీపీ నాయకులు ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఐటీ శాఖ విచారణ పూర్తి అయ్యేనాటికి ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతాన్ని ప్రజలు మరిచిపోతారు. అప్పుడు వాస్తవం బయటకు వచ్చినా ప్రజలకు పట్టదు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రస్తుత వివాదం కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరపడం కొత్తేమీ కాదు. తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలపై గతంలో కూడా సోదాలు నిర్వహించారు. ఎంతో కొంత పన్ను రాబట్టారు. ఇప్పుడు సోదాలు జరిపిన వారి జాబితాలో చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌, లోకేశ్‌ సన్నిహితుడు రాజేశ్‌ కూడా ఉండటంతోనే రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజానికి శ్రీనివాస్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయి అధికారి మాత్రమే! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫైళ్లు కూడా చూసేవారు కాదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలను సమన్వయం చేసేవారు. ముఖ్యమంత్రి వద్ద అపాయింట్‌మెంట్లను పర్యవేక్షించేవారు. అంతటి చిరుద్యోగి నివాసంలో ఐటీ శాఖ రోజుల తరబడి సోదాలు నిర్వహించడం సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తంమీద వ్యాపార ప్రత్యర్థులు చేసిన ఫిర్యాదు ఆధారంగా జరిగిన ఐటీ సోదాలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగడానికి కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉప్పు–నిప్పుగా ఉన్నాయి. రాజకీయ వైరుధ్యాలు వ్యక్తిగత శత్రుత్వంగా రూపాంతరం చెందాయి. ఈ గట్టున ఉంటావా? ఆ గట్టున ఉంటావా? తేల్చుకో అన్నట్టు జగన్మోహన్‌రెడ్డి పాలన సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికై దండోపాయం ప్రయోగించడం నిత్యకృత్యం అవుతోంది. ఈ క్రమంలో అధికారులు కూడా బాధితులుగా మిగిలిపోతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు వద్ద పనిచేసిన అధికారులు ఇప్పటి ప్రభుత్వానికి టార్గెట్‌గా మారారు.

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఈ కోవలోకే వస్తుంది. పదుల సంఖ్యలో అధికారులకు పోస్టింగులు ఇవ్వకపోవడమే కాకుండా జీతాలు కూడా చెల్లించడం లేదు. ఇదొక విపరిణామం! రాజధాని తరలింపు వంటి అంశాలతోపాటు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకోకపోతుందా? అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు గానీ, కేంద్రంలో అటువంటి కదలిక కనిపించడం లేదు. రాజధాని తరలింపు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభిస్తుందని ఇటీవలే తనను కలిసిన ‘ది హిందూ’ పత్రిక చైర్మన్‌ ఎన్‌.రామ్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న తన నిర్ణయానికి మున్ముందు ప్రజల మద్దతు లభిస్తుందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారట!


జగన్‌.. వన్‌సైడ్‌ లవ్‌!?

ఇక జగన్మోహన్‌రెడ్డిపై చార్జిషీట్లు దాఖలు చేసి ఏడేళ్లు దాటినా ఇప్పటికీ విచారణ ప్రారంభం కాకపోవడం పట్ల సీబీఐ అధికారులు తాజాగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో నిర్వేదం వ్యక్తంచేశారు. నేరస్థులపై విచారణ ఏళ్ల తరబడి సాగుతూ ఉంటే వారిలో భయం ఎందుకు ఉంటుంది? అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడేవారికి తక్షణ శిక్షలు విధించడానికై దిశ చట్టం తీసుకువచ్చినట్టు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇదే జగన్మోహన్‌రెడ్డి తనపై దాఖలైన అవినీతి కేసులలో విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటూనే ఉన్నారు.

జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులు తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించినవని సీబీఐ పదేపదే కోర్టుల దృష్టికి తీసుకువస్తున్నా విచారణ ముందుకు సాగకపోవడానికి జగన్‌ అండ్‌ కో అనుసరిస్తున్న ఎత్తుగడలే కారణం. నిజానికి ఈ కేసులలో విచారణ త్వరితగతిన పూర్తయి నిర్దోషిగా బయటపడితే జగన్‌ అండ్‌ కోకే మంచిది. అయితే ఆచరణలో అలా జరగకుండా కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలికి ముడిపెట్టినట్టుగా జగన్‌ అండ్‌ కో వ్యవహరిస్తోంది. రాజమహేంద్రవరంలో జగన్‌ అన్నట్టుగా అవినీతి కేసులలో కూడా విచారణ ఇలా ఏళ్ల తరబడి సాగుతుంటే ఆర్థిక నేరస్థులకు భయం ఉండదు కదా? అయితే తనపై నమోదైన కేసులలో ఏదో ఒక రోజు శిక్షపడే ప్రమాదం ఉందన్న భయం ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డికి పట్టుకున్నట్టు ఉంది. ఈ కారణంగానే కేంద్రంలో బీజేపీతో.. అంటే ఎన్‌డీఏలో భాగస్వామి కావాలన్న ఆలోచనను వైసీపీ నాయకులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం’ అంటూ ఎన్‌డీఏలో చేరికపై మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం పరోక్ష సంకేతాలు పంపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా జగన్మోహన్‌రెడ్డి సిద్ధమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

జగన్మోహన్‌రెడ్డి అనుమతి లేకుండా ఆయన ఆ ముక్క చెప్పలేరు. మంత్రులు ఏమి మాట్లాడాలో జగన్‌ నివాసం నుంచే నిర్దేశిస్తుంటారు కనుక ఎన్‌డీఏలో చేరాలన్న నిర్ణయానికి జగన్‌ వచ్చారన్న ప్రచారానికి ఊతం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరుతుందనీ, విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి అవుతారనీ కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. బొత్స వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా తనపై విచారణ జరుగుతున్న కేసులలో నిర్దోషిగా బయటపడాలన్న ఆలోచనతో జగన్మోహన్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికలలో వైసీపీకి అండగా నిలిచిన ముస్లింలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. సీఏఏ విషయంలో ఏపీలో కూడా ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారు.

ఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముస్లింలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ ఎన్‌డీఏలో చేరితే ముస్లింలు దూరమవుతారు. అయితే అవినీతి కేసులలో జగన్‌కు శిక్ష పడితే ఎదురయ్యే నష్టంతో పోల్చితే.. ముస్లింలు దూరమవడం వల్ల కలిగే నష్టం స్వల్పమేనని వైసీపీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. జగన్‌కు శిక్ష పడితే ఆయన రాజకీయ జీవితమే కాకుండా.. పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందని ఆయన విశ్లేషించారు. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేనందున ఎన్‌డీఏలో చేరడం వల్ల ఇప్పటికిప్పుడు కలిగే నష్టం ఏమీ ఉండదనీ, కేంద్రంతో డీల్‌ కుదిరితే జగన్‌ నిర్దోషిగా బయటపడతారనీ, తమకు అంతకంటే కావలసింది ఏముందనీ ఒక సీనియర్‌ మంత్రి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రతిపాదనపై బీజేపీ నాయకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ను చేర్చుకోవడం వల్ల ఆయనకే ఎక్కువ లాభమనీ, తమ పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదనీ బీజేపీ ప్రముఖుడొకరు విశ్లేషించారు.

పలు అవినీతి కేసులలో ఏ–2గా ఉన్న విజయసాయిరెడ్డిని మంత్రిమండలిలో చేర్చుకుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్‌డీఏలో చేరే ప్రతిపాదన జగన్మోహన్‌రెడ్డి నుంచే వచ్చిందనీ, ప్రస్తుతానికి అది వన్‌సైడ్‌ లవ్‌ మాత్రమేననీ, తమ పార్టీ అగ్రనాయకత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ బీజేపీకి చెందిన మరో ముఖ్యుడు చెప్పారు. జగన్‌ను చేర్చుకోవడం వల్ల ఎదురయ్యే లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే తమ పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. జగన్‌తో చేతులు కలపడం వల్ల తక్షణం లాభపడేది ఆయనేననీ, తమ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చుననీ బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలలో జగన్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందనీ, ఈ పరిస్థితులలో ఆయనతో జత కడితే తాము నష్టపోతామని కూడా వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు బలహీనపడకుండా వైసీపీతో జత కడితే పవన్‌ కల్యాణ్‌ కూడా దూరమయ్యే ప్రమాదముందని వారు అంచనా వేస్తున్నారు.

అయితే రాజ్యసభలో వైసీపీ సహకారం అవసరం కనుక బీజేపీ పెద్దలు జగన్‌ అండ్‌ కోను ప్రస్తుతానికి ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కేంద్రంతో సత్సంబంధాలు అవసరం వైసీపీకి ఎక్కువగా ఉన్నందున రాజ్యసభలో మద్దతివ్వక తప్పని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి జగన్‌ కలుసుకోవడంపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తనను కలిసిన వారు అడిగే అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేనప్పుడే ‘‘అమిత్‌షాను కలవండి..’’ అని ప్రధాని మోదీ సూచిస్తారని బీజేపీ నాయకులు చెబుతుంటారు. అయితే తమ ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలను కలవడంపై ఎన్ని ప్రచారాలు జరిగినా, ఏమి జరగబోతున్నదన్నది వారం రోజుల్లో మీరే చూస్తారుగా అని మంత్రి బొత్స నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏలో చేరే విషయమై వైసీపీ నాయకులు ఇస్తున్న సంకేతాలు నిజమయ్యే పక్షంలో శాసనమండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల కలయికపై స్పష్టత వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. రాజధాని వికేంద్రీకరణతోపాటు సీఏఏ, ప్రత్యేక హోదా వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి.

బొత్స చెబుతున్న మాటలు నిజమయ్యే పక్షంలో రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు పయనించబోయేది మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుంది. అయితే ఇవేమీ ప్రజలకు ఉపయోగపడేవి మాత్రం కాదు. ప్రధానమంత్రితో జగన్‌ ఎంతసేపు సమావేశమయ్యారు, ఏమేమి కోరారు అన్నది ప్రజలకు అప్రస్తుతం. కేంద్రం నుంచి ఏమి సాధించారన్నదే ప్రజలకు ముఖ్యం. అంతవరకు ప్రధాని మోదీని జగన్‌ ఎన్ని పర్యాయాలు కలిసినా, ఎంత సమయం గడిపినా ప్రజలు పట్టించుకోరు. గతంలో చంద్రబాబు కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. చివరకు రాష్ట్రానికి సాధించింది ఏమీ లేకపోవడంతో ప్రజలు ఆయన పార్టీని ఓడించారు!


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి


ఆర్కే

Updated Date - 2020-02-16T06:14:08+05:30 IST