వజ్రోత్సవాలకు వేళాయె

ABN , First Publish Date - 2022-08-08T06:07:46+05:30 IST

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశభక్తిని చాటుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరిట (ఇంటింటా జాతీయ జెండా) కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది.

వజ్రోత్సవాలకు వేళాయె

- స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా వేడుకలు  

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు 

- 13 నుంచి 15వరకు హర్‌ ఘర్‌ తిరంగా

-  నేటి నుంచి 22 వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం

 -  ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు  అవుతున్న సందర్భంగా దేశభక్తిని చాటుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.  ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పేరిట (ఇంటింటా జాతీయ జెండా) కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం జెండా నిబంధనల్లోనూ మార్పులు చేసింది. పాలిస్టర్‌ వస్త్రం, మరమగ్గాల ద్వారా తయారైన జెండాను ఎగుర వేయవద్దన్న నిబంధనలను తొలగించింది. చేనేత మగ్గాలు, కాటన్‌, ఖాదీ, ఉన్ని, పాలిస్టర్‌కు సంబంధించిన త్రివర్ణ పతాకాలు ఎగురవేయవచ్చని ఫ్లాగ్‌ కోడ్‌ 2002ను సవరించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరిట వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది.  మహనీయుల త్యాగాలు, పోరాటాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా 15 రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 15కు ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు  వివిధ కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. 15 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో  ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. సోమవారం ప్రారంభ సమారోహంతో వేడుకలు మొదలవనున్నాయి. ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 9న ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ, 10న వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఫ్రీడమ్‌ పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహణ, 12న వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలు, 13న విద్యార్థులు, యువకులు, మహిళలు వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు, 14న సాయంత్రం సాంస్కృతిక సారధి కళాకారులతో సాంస్కృతిక జానపద కార్యక్రమాలు, 15న స్వాతంత్య్ర  వేడుకలు, ఇంటింటా జెండా ఆవిష్కరణలు, 16న ఏకకాలంలో ఎక్కడిక్కడ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్‌ క్రీడలు, 19న ఆస్పత్రులు, అనాఽథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లలో పండ్లు, స్వీట్ల పంపిణీ, 20న దేశభక్తి జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు, 21న స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు, 22న ఘనంగా వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ముగించనున్నారు వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేసేందుకు ప్రచారం కల్పిస్తున్నారు. 

జిల్లా ప్రజల మదిలో ఉద్యమ జ్ఞాపకాలు... 

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, అమృత్‌ మహోత్సవాల  నేపథ్యంలో జిల్లా ప్రజల్లో ఉద్యమ జ్ఞాపకాలు కదలాడుతున్నాయి.  సిరిసిల్లలో నిర్వహించిన ఆంధ్ర మహాసభ, మహిళ సభలు స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చాయి.  1935 సంవత్సరం సిరిసిల్లలో భీమకవి నగరంగా మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన  నాలుగో ఆంధ్రమహాసభ నిర్వహించారు.   మహాసభ నిర్వహణలో సిరిసిల్ల తాలూకలోని గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి ముఖ్య భూమికను పోషించారు.   వేములవాడ భీమకవి నగరంగా నిర్వహించిన మహాసభకు వివిధ ప్రాంతాలనుంచి ఎంతో మంది పాల్గొన్నారు.  ఇదే ప్రాంగణంలో 4వ ఆంధ్రా మహిళ సభ కూడా నిర్వహించారు. దీనికి మాడపాటి హన్మంతరావు సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారు.  ఈ మహాసభల స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొత్త మలుపు తిరిగాయి.  ప్రజల దైనందిన సమస్యలతో పాటు చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం చేనేత కార్మిక సంఘం ఏర్పడింది. కార్మిక సంఘం తెలంగాణ తృతీయ మహాసభను సిరిసిల్లలో జరుపుకున్నారు.    

ఖాదీ ఉద్యమం.. 

గ్రామ స్వరాజ్య స్థాపన కోసం చెరఖ గ్రామ పరిశ్రల పునరుద్ధ్దరణ కోసం మహాత్మాగాంధీ పిలుపు నిచ్చారు. దేశవ్యాప్తంగా 20లక్షల రాట్నాలను నడిపించాలని పిలుపునిస్తూ 1920లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ సమావేశంలో తీర్మానించారు. మహాత్మాగాంధీ నేత పని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సిరిసిల్ల, మెట్‌పల్లి ముఖ్యభూమిక పోషించాయి. సిరిసిల్లలో చేనేత మగ్గాలు ఊపందుకున్నాయి. 1946లో నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటం ఉదృతంగా సాగింది. ఖాదీ కార్యకర్తలపై నిర్భందాలు విధించారు. స్వాతంత్ర పోరాటంలో ఉన్న ఉద్యమ కారులపై నిర్భందాలు ఉండడంతో చెరఖ సంఘాల్లో తల దాచుకునే వారు. 

వందేమాతరం... క్విట్‌ ఇండియా 

స్వాతంత్య్ర పోరాటం కోసం ప్రజలు ఆలపించడానికి జాతీయ గీతంగా వందేమాతరం ఉండేది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముస్లిం విద్యార్థుల ఫిర్యాదు మేరకు నిజాం ప్రభుత్వం వందేమాతర గీతాన్ని నిషేదించింది. వందేమాతర ఉద్యమం ఔరంగబాద్‌లో ప్రారంభమైంది.  క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా జిల్లాకు చెందిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, సీహెచ్‌ రాజేశ్వర్‌రావు  క్విట్‌ స్కూల్‌, క్విట్‌ కాలేజీల ఉద్యమాన్ని ప్రారంభించారు. రాజేశ్వర్‌రావు చెన్నమనేని 1939లో 7వ తరగతి చదువుతుండగానే వందేమాతరం ఉద్యమంపై ఆకర్షితులయ్యారు. సీహెచ్‌ హన్మంతరావు కూడా విద్యార్థి సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. కోనరావుపేటకు చెందిన సీహెచ్‌ రాజలింగం బాల్యంలోనే రజకార్ల క్యాంపుపై తివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 

నెత్తుటి గడ్డ... మానాల...

స్వాంతంత్య్ర ఉద్యమ స్పూర్తిని చాటుతూనే ముందుకు సాగిన పోరాటాలకు సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం మానాల అనాడు ప్రధాన కేంద్రంగా మారింది.  నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరు నుంచి  మావోయిస్టుల దళాలకు ఆశ్రయం ఇచ్చి ఉద్యమ స్ఫూర్తిని నిలిపిన మానాల ఇప్పటికి ప్రజల జ్ఞాపకాల మధ్యే ఉంది. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దులో మానాల గిరిజన ప్రాంతం ఇప్పటికి మానని గాయాలు సల్పుతూనే ఉన్నాయి.  ప్రస్థుతం నిజామాబాద్‌ జిల్లా నుంచి సిరిసిల్ల జిల్లా పరిధిలోకి మారినా మానాల ఎంతో మంది వీరులను తీర్చి దిద్దిన ప్రాంతంగా చరిత్రలో నిలిచిపోయింది.    


Updated Date - 2022-08-08T06:07:46+05:30 IST