
ఎన్నారై డెస్క్: హిజాబ్ ధరించిన మహిళను లోనికి అనుమతించని భారతీయ రెస్టారెంట్‌ను బాహ్రెయిన్ అధికారులు మూసివేశారన్న వార్త భారత్‌లో కాస్తంత కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. లాంటర్న్స్ అనే రెస్టారెంట్లో ఈ ఘటన వెలుగు చూసింది. రెస్టారెంట్‌లోని ఓ మేనేజర్ ఆమెను హిజాబ్ ధరించి లోనికి రావద్దని చెప్పారనేది ఈ వార్తలో ఓ ముఖ్యాంశం. అయితే.. ఆ మేనేజర్‌ను వెంటనే విధుల్లోంచి తొలగించట్టు లాంటర్న్స్ వెంటనే ఓ ప్రకటన విడుదల చేయడమేకాకుండా.. వివక్షాపూరిత విధానాలకు తాము వ్యతిరేకమంటూ స్పష్టంగా పేర్కొంది. కానీ.. ఆ మేనేజర్ ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. బాధితురాలిని అడ్డుకున్న వ్యక్తి భారత సంతతి వ్యక్తి అనే వాదన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించిన మరో కోణం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలితో పాటూ లాంటర్న్స్కు వెళ్లిన ఆమె స్నేహితురాలు మరియమ్ నాజీ ఈ విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. ట్విటర్ వేదికగా అసలు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘‘ఈ విషయంలో ఇన్ని వదంతులు వ్యాపించడం చూస్తే నాకు బాధ కలిగింది. వాస్తవానికి ఆ మేనేజర్ ఇండియన్ కాదు. అతడు బ్రిటీష్ వ్యక్తి. బ్రిటన్లు ఎవరో.. భారతీయులు ఎవరో నేను గుర్తుపట్టగలను. కాబట్టి.. వదంతులను కట్టిపెట్టండి. అయితే.. ఆ రోజు జరిగిన ఘటన నన్ను బాగా మనస్తాపానికి గురించేసింది. వెంటనే రెస్టారెంట్ యజమానితో మేము మాట్లాడాము. ఆయన మేము చెప్పేదంతా జాగ్రత్తగా విన్నారు. ఆ తరువాత.. జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పారు. దీంతో.. ఈ విషయాన్ని ఇక ఇక్కడితో వదిలిపెట్టేద్దామనుకున్నాను. అసలు జరిగింది ఇది. ఇప్పుడు మీకు నిజమేదో తెలిసింది కాబట్టి.. ఇక రూమర్స్‌ను నమ్మకండి’’ అంటూ మరియమ్ నాజీ ట్వీట్ చేశారు.