పురోగతి లేని ఐటీ

ABN , First Publish Date - 2022-06-25T08:17:08+05:30 IST

పురోగతి లేని ఐటీ

పురోగతి లేని ఐటీ

చెప్పింది చెయ్యదు.. అడిగింది ఇవ్వదు

ఐటీపై నిర్లక్ష్యం.. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం తీరు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతామని మూడేళ్లుగా ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు చెప్పింది ఏదీ సరిగ్గా చేయలేదు. పోనీ ఐటీ పరిశ్రమ అడిగింది ఇచ్చిం దా?.. అంటే అదీ లేదు. తెలంగాణతో పోటీ పడు తూ ప్రకటనలు చేయడం అలవాటు చేసుకుంది తప్ప వారు అనుసరించే విధానాలను మాత్రం పరిశీలించడం లేదు. అక్కడ గత ఏడేళ్లుగా ఐటీ శాఖను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం.. ఈ మూడేళ్లలోనే నలుగురు సెక్రటరీలను మార్చి ప్రస్తుతం ఐదో అధికారి కి పగ్గాలు అప్పగించారు. మొదట సెక్రటరీగా పనిచేసిన అనూ్‌పసింగ్‌ బీపీవోల అభివృద్ధికి యత్నించారు. ఆ తర్వాత కోన శశిధర్‌ కొన్నాళ్లు, భానుప్రకాశ్‌ బహు కొద్దికాలం, ఆపై జయలక్ష్మి కొంతకాలం సారథ్యం వహించారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సౌరభ్‌ గౌర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను ఎంతకాలం ఉంచుతారో చూడాలి. ఐటీ రంగం మిగిలిన శాఖల్లాగా వెంటనే ఆకళింపు చేసుకునే వ్యవస్థ కాదు. ఏమైనా ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నప్పుడు వాటిని అధ్యయనం చేసి ముందుకువెళ్లాలి. అవన్నీ పరిశీలించి అమలు చేయాలనుకునేలోపు అధికారులను మార్చేస్తున్నారు.  సీఎం జగన్‌ చెబుతున్న రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కోర్సులు బోధించడానికి టీడీపీ హయాం లో తిరుపతిలోనే ‘ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ(ఐఐడీటీ)’ని ఏర్పాటు చేశారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటివి అక్కడ ఉన్నాయి. అవి బాగా హై ఎండ్‌ కోర్సులు. అవి చదివిన వారికి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తక్కువ. ఇప్పటికే ఒక ఇనిస్టిట్యూట్‌ ఉన్నందున కొత్తగా మరొకటి అవసరం లేదని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  


దిక్కు లేని స్కిల్‌ యూనివర్సిటీ

విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్సి టీ తక్షణమే ఏర్పాటు చేయాలని, ఏడాదికి రెండు వేల మందికి డిప్లమో, డిగ్రీలలో శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్‌ రెండేళ్ల క్రితమే ఆదేశించారు. ఆ యూనివర్సిటీలో హై ఎండ్‌ కోర్సులైన ఆర్టిఫిషియ ల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌ వంటివి పెట్టాలని సూచించారు. కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. సీఎం జగన్‌ చెప్పిన స్కిల్‌ యూనివర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయడానికి అధికారులు స్థలాన్ని ఎంపిక చేశారు. మరి విశాఖను ఏం చేస్తారని ప్రశ్నిస్తే... ఇక్కడ జిల్లాలో ఎవరి వద్దా సమాచారం లేదు. స్కిల్‌ యూనివర్సిటీని తిరుపతికి తరలించి, విశాఖపట్నంలో ‘ఎమర్జింగ్‌ టెక్నాలజీ రిసెర్చి యూనివర్సిటీ’ పెట్టాలని ప్రతిపాదనలు మార్చారని విశ్వసనీయ సమాచారం. 

Updated Date - 2022-06-25T08:17:08+05:30 IST