మీ గడీ ముందు ‘గంట’ పెడితే బాగుండేది

ABN , First Publish Date - 2020-07-07T07:27:37+05:30 IST

తన ఇంటి పత్రికలో ప్రజల కోసం ‘గంట’ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన గడీ ముందు కూడా ‘గంట’ పెడితే బాగుండేదని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రగతిభవన్‌ను ఆధునిక గడీగా మార్చారని, వందిమాగధుల

మీ గడీ ముందు ‘గంట’ పెడితే బాగుండేది

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తన ఇంటి పత్రికలో ప్రజల కోసం ‘గంట’ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన గడీ ముందు కూడా ‘గంట’ పెడితే బాగుండేదని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రగతిభవన్‌ను ఆధునిక గడీగా మార్చారని, వందిమాగధుల వాయిద్యాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం రెక్కల్ని, తోకల్ని, ఈకల్ని కూడా కేసీఆర్‌ పీకేశారని, గొర్రెల తలల్ని బలిచ్చి మొండెంపై ఎక్కి తిరగడం కేసీఆర్‌కు అలవాటే అని మండిపడ్డారు. స్పీకర్‌ సమక్షంలో జరిగే బీఏసీ సమావేశంలో తప్ప, ప్రతిపక్షనేతల ముఖం ఆయన చూడరని విమర్శించారు. కేసీఆర్‌ ఆధునిక ఆక్రమిత మనస్తత్వాన్ని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారని స్పష్టం చేశారు. ఫైళ్లు నిజానికి సచివాలయంలో ఉండాలి కానీ సీఎం ఎక్కడ ఉంటే అవి అక్కడకు వెళ్లడం సరికొత్త రాజ్యాంగమే అవుతుందని లక్ష్మణ్‌ విమర్శించారు. ‘‘మీరేమో కరోనా వచ్చిన సిబ్బందిని వదలిపెట్టి కొత్త సిబ్బందితో ఫాంహౌజ్‌లో ఉన్నారు. లాక్‌డౌన్‌ ప్రచారాన్ని నమ్మి ప్రజలు హైదరాబాద్‌ వదలిపెట్టి ఊళ్లకు వెళ్లిపోయారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయుంచినట్లుగా మీ వైఖరి ఉంది. ప్రజలకు ముఖ్యమంత్రి 24 గంటలూ అందుబాటులో ఉండాలి. కానీ, ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే దర్శనం ఇవ్వడం మీ ప్రత్యేకత’’ అని లక్ష్మణ్‌ ఆ లేఖలో ధ్వజమెత్తారు.

Updated Date - 2020-07-07T07:27:37+05:30 IST