అశ్విన్‌ను పక్కన పెడితే నేనేమీ ఆశ్చర్యపోను: ఇంగ్లండ్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-08T01:19:21+05:30 IST

దక్షిణాఫ్రికాతో త్వరలో తలపడే భారత టెస్టు జట్టులో టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ చోటు దక్కకుంటే తానేమీ ఆశ్చర్యపోనంటూ

అశ్విన్‌ను పక్కన పెడితే నేనేమీ ఆశ్చర్యపోను: ఇంగ్లండ్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో త్వరలో తలపడే భారత టెస్టు జట్టులో టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌‌కు చోటు దక్కకుంటే తానేమీ ఆశ్చర్యపోనంటూ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా అందుకున్నాడు.


అయినప్పటికీ దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ అశ్విన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలను మాత్రం తీసుకునే సాహసం చేస్తుందన్నాడు.


అశ్విన్‌ను ఎందుకు పక్కనపెడతారో కూడా హార్మిసన్ చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌తో ఈ ఏడాది జరిగిన టెస్టు సిరీస్‌లో తలపడిన భారత తుది జట్టులో చోటు దక్కలేదని అన్నాడు. ఆ సిరీస్‌లో భారత్ నలుగురు పేసర్లతోపాటు ఒకే ఒక్క స్పిన్నర్ రవీంద్ర జడేజాతో బరిలోకి దిగిందని పేర్కొన్నాడు.


ఇలా ఎందుకు? అన్న దాని వెనక లాజిక్‌తోపాటు కోహ్లీ ఆలోచన కూడా ఉంటుందని వివరించాడు. ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో అశ్విన్ ఆడబోడని ఈ భూమిపై ఎవరూ ఊహించి ఉండరని,  కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పాడు. 


Updated Date - 2021-12-08T01:19:21+05:30 IST