ఈ కుర్రాడి చేతిపై టాటూ.. నెట్టింట హాట్ టాపిక్.. ఇంతకీ ఆ టాటూ‌ను స్కాన్ చేస్తే ఏం కనిపిస్తోందంటే..

ABN , First Publish Date - 2021-08-28T23:37:16+05:30 IST

మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా జనాలను భయం గుప్పిట్లో నెట్టేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ కుర్రాడి చేతిపై టాటూ.. నెట్టింట హాట్ టాపిక్.. ఇంతకీ ఆ టాటూ‌ను స్కాన్ చేస్తే ఏం కనిపిస్తోందంటే..

ఇంటర్నెట్ డెస్క్: మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా జనాలను భయం గుప్పిట్లో నెట్టేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ విషయమై కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసినట్లే.. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, స్పోర్ట్స్, ఇతర ఈవెంట్లకు వెళ్లేవారు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకెళ్లడం తప్పనిసరి చేశాయి. ఈ జాబితాలో ఇటలీ కూడా ఉంది. ఈ నెల 6 నుంచి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, క్రీడా ప్రాంగణాలకు వెళ్లేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి చేసింది. దీంతో ఎల్లప్పుడూ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తమతోపాటు ఉంచుకోవడం అక్కడి ప్రజలకు తప్పనిసరైంది. ఇది చాలా మందిని చిరాకును తెప్పిస్తోంది. 


ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ విషయంలో అందరిలా ఉంటే ఏం లాభం.. కూసింత వెరైటీగా ఉంటేనే కదా మనకు గుర్తింపు అనుకున్నాడో ఏమో గానీ ఇటలీలోని ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రెగ్గియో కాలబ్రియాకు చెందిన ఆండ్రియా కొలొనెట్టా అనే యువకుడు కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ విషయంలో కాస్తా డిఫరెంట్‌గానే ఆలోచించాడని చెప్పాలి. ఇటీవలే రెండు డోసుల టీకా తీసుకున్న ఆండ్రియాకు క్యూఆర్‌ కోడ్ రూపంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ అయింది. ఇక బయట షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లినప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కనుక మనోడు కూసింత వెరైటీగా ఆలోచించాడు. 


తనకు జారీ అయిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తాలుకూ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసే విధంగా చేతిపై టాటూగా వేయించుకున్నాడు. ఈ క్లిష్టమైన క్యూఆర్‌ కోడ్ టాటూను వేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని ఆండ్రియా తెలిపాడు. ప్రస్తుతం అతను ఎక్కడికెళ్లిన ఈ టాటూను స్కాన్ చేస్తే చాలు వ్యాక్సినేషన్ వివరాలు వచ్చేస్తున్నాయి. దాంతో ఆండ్రియాకు ఈజీగా ఎంట్రీ దొరికిపోతోంది. అంతేగాక ఇది టీకా ప్రాముఖ్యతను కూడా ఇది తెలియజేయజేస్తోందని చెబుతున్నాడు. ఇప్పటికీ ఇంకా వ్యాక్సిన్ల పట్ల అపోహలు ఉన్నవారు ఇది చూసిన తర్వాతనైనా మారుతారని ఆండ్రియా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆండ్రియా చేసిన ఈ పని నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. నెటిజన్లు ఆండ్రియాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.     

Updated Date - 2021-08-28T23:37:16+05:30 IST