90 రోజుల పాటు సూర్యుడు ఉదయించని గ్రామం.. చిమ్మచీకట్లో మగ్గిపోకుండా గ్రామస్తుల వెరైటీ ప్లాన్‌కు అంతా ఫిదా..

ABN , First Publish Date - 2021-08-27T02:31:47+05:30 IST

సూర్యోదయం కావట్లేదని కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకున్న గ్రామస్థులు

90 రోజుల పాటు సూర్యుడు ఉదయించని గ్రామం..  చిమ్మచీకట్లో మగ్గిపోకుండా గ్రామస్తుల వెరైటీ ప్లాన్‌కు అంతా ఫిదా..

ఇంటర్నెట్ డెస్క్: అది ఇటలీలోని ఓ చిన్న గ్రామం. పేరు.. విగనెల్లా!  నవంబర్ వచ్చిందంటే చాలు ఆ గ్రామం ‘అంధకారం’లో కూరుకుపోతుంది. మళ్లీ ఫిబ్రవరి  వరకూ అదే పరిస్థితి. ఎత్తైన కొండల మధ్యలో ఉన్న లోయలో ఎక్కడో కూరుకుపోయినట్టు ఉంటుందా గ్రామం. దాంతో.. ఆ గ్రామప్రజలు ప్రతిఏటా ఓ మూడు నెలల పాటు సూర్యోదయాన్ని చూడలేరు. అంతేకాదు.. చుట్టూతా కొండలు ఉండటంతో సూర్యకిరణాలు కూడా వారిని తాకవు. దీంతో..అక్కడ మూడు నెలల పాటు అంధకారమే రాజ్యమేలుతుంది. 


లైట్లు వేసుకోవచ్చు కదా.. ఇబ్బంది ఏముందీ అంటారా.. మీరు అన్నది కరెక్టే. అయితే...మామూలు లైట్ల వెలుతురు తొలగించలేని అంధకారం ఇది. సూర్యరశ్మికి దూరమైన ప్రజలు మాత్రమే ఎదుర్కొనే ప్రత్యేక స్థితి. వారిని నిస్తేజం ఆవరిస్తుంటుంది. సూర్యరశ్మి లేక ప్రజల్లో సెరటోనిన్ అనే హార్మోన్ లోపించి.. వారు ఇలా నీరసం, నిస్ఫృహలకు లోనవుతారనేది నిపుణులు అభిప్రాయం. ఈ నిరుత్సాహకర వాతావరణం నేరాల పెరుగుదలకు కూడా కారణమైందట.   


అయితే.. ఇదంతా 2008కి ముందు విగనెల్లా వాసులు ఎదుర్కొన్న పరిస్థితి. ఆ తరువాత అక్కడ పరిస్థితుల్లో సమూలంగా మార్పు వచ్చింది. కారణం.. గ్రామస్తులు ఆ సంవత్సరం ఓ కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకోవడమే. అది కూడా జస్ట్ 10 వేల యూరోల(దాదాపు 8.7 లక్షల రూపాయలు) ఖర్చుతో ఈ కొత్త సూర్యుడిని తెచ్చి పెట్టారు. అదేలా అంటారా..? ఏం లేదు.. 8 మీటర్లు పొడవు.. 4 మీటర్లు వెడల్పుతో బాగా మందంగా ఉండే ఓ స్టీల్ తెరను తీసుకొచ్చి.. కొండలపై ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశంలో అమర్చారు. 


దీంతో..సూర్యోదయం కాకపోయినా..సూర్యుడి ప్రతిబింబం ఆ గ్రామంపై కాంతిని ప్రసరింపజేయడం ప్రారంభించింది. అలా.. మరోసారి వారిపై కాంతి కిరణాలు పడి..మునుపటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.  ఈ క్రమంలో విగనెల్లా.. సొంతంగా సూర్యుడిని ఏర్పాటు చేసుకున్న గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇదే స్ఫూర్తితో నార్వేలోని జుకాన్ అనే గ్రామం కూడా 2013లో ఇలా కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకుని చీకట్లను జయించింది. 

Updated Date - 2021-08-27T02:31:47+05:30 IST