Advertisement

నాటి ఇటలీ, నేటి భారత్

Sep 12 2020 @ 00:38AM

ఇటలీలో తమ పాలన శాశ్వతమని బెనిటో ముస్సోలినీ, ఆయన ఫాసిస్టు అనుయాయులు విశ్వసించారు. నరేంద్రమోదీ, బీజేపీ వారూ అదే విధంగా భావిస్తున్నారు. శాశ్వత పాలన స్వప్నాలు ఫలించబోవు. అయితే ప్రస్తుత పాలకులు అధికారంలో కొనసాగినంతవరకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నైతికంగా జాతి భారీ మూల్యం చెల్లించవలసి రావడం ఖాయం. ముస్సోలినీ, ఆయన పార్టీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. మోదీ, ఆయన పార్టీ పాలనతో వాటిల్లుతున్న వినాశనం నుంచి కోలుకునేందుకు భారత్‌కు అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చు.


జీవితచరిత్రలు చదవడం నా వ్యాపకాలలో ఒకటి. ఈ వ్యాస రచనకు ఉపక్రమించే ముందే కెనడియన్ స్కాలర్ ఫెబియో ఫెర్నాండొ రిజీ రాసిన బెనజెత్తో క్రోచె-–ఇటలీ ఫాసిజం (Benedetto Croce and Italian Fascism)ని చదవడం ముగించాను. క్రొచె గొప్ప ఇటాలియన్ దార్శనికుడు. ఆయన జీవించిన కాలం (1866–-1952) విశాల కథను చెప్పేందుకు ఆనాటి విషయాలను విపులంగా మహాదార్శనికుని జీవితాన్ని ప్రతిభావంతంగా ఉపయోగించుకున్న ఉద్గ్రంథమది.


రిజీ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు 1920ల్లో ఇటలీ, 2020ల్లో భారత్ మధ్య అసాధారణ సదృశాలను కనుగొన్నాను. 1925 డిసెంబర్లో ఇటాలియన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. పత్రికా స్వాతంత్ర్యాన్ని అది కఠినంగా అణచివేసింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన కొద్దినెలల్లోనే ప్రధాన పత్రికలు ఒక్కొక్కటీ ఫాసిస్టు నియంత్రణలోకి వచ్చాయి. ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లను భరించలేక కొంతమంది ప్రచురణకర్తలు అనివార్యంగా తమ పత్రికలను విక్రయించుకున్నారు. ఉదారవాద ఎడిటర్లు అందరూ వైదొలిగారు. వారి స్థానంలో, ఫాసిస్టు పాలకులకు అనుకూలంగా ఉండేవారు నియమితులయ్యారు. 1925లోనే పాలక ఫాసిస్టు పార్టీ, దాని అధినేత బెనిటో ముస్సోలినీ భావజాలాన్ని క్రోచె ఇలా అభివర్ణించాడు: ‘అధికార ప్రాబల్యానికి సాగిల పడుతూ, వాగాడంబరాన్ని ప్రదర్శించడం; చట్టబద్ధ పాలన పట్ల బాహాటంగా గౌరవాన్ని ప్రకటిస్తూనే చట్టాలను పూర్తిగా ఉల్లంఘించడం; అత్యంత నవీన భావనల గురించి మాట్లాడుతూ దుర్గంధపూరితమైన పాత చెత్తను తలకెత్తుకోవడం; సువ్యవస్థిత సంస్కృతిని ఏవగించుకుంటూ ఒక కొత్త సంస్కృతిని నిర్మించేందుకు ఫలించని ప్రయత్నాలు చేయడం -ఈ వైరుధ్యాల సమ్మిశ్రమం ఫాసిస్టు సిద్ధాంతం, ఆచరణలో స్పష్టంగా కన్పిస్తాయి’. ఈ విషయంలో 1920ల నాటి ఇటాలియన్ రాజ్య వ్యవస్థకు, భారత్‌లో ప్రస్తుత మోదీ పాలనకు మధ్య పోలికలు స్పష్టంగా చూడవచ్చు. భారత రాజ్యాంగం గురించి అత్యంత గౌరవంతో మాట్లాడుతూనే ఆ సంవిధాన స్ఫూర్తి, సారాన్ని ఉల్లంఘించడం; పురాతన భారతీయ వివేకమే నేటికీ ఆదర్శనీయమూ, అనుసరణీయమూ అని ఘోషిస్తూ ఆధునిక విజ్ఞాన శాస్త్ర స్ఫూర్తిని తిరస్కరించడం; ప్రాచీన సంస్కృతిని ప్రశంసిస్తూ ఆచరణలో పూర్తిగా అనాగరిక పోకడలు పోవడమూ నేడు మనం చూడడం లేదూ?


ముస్సోలినీ ఫాసిస్టు పాలనను భరించలేక నవీన భావుకులూ, స్వతంత్ర ఆలోచనాశీలురైన ఇటాలియన్ మేధావులు దేశాంతరం వెళ్ళిపోగా బెనెజెత్తో క్రోచె మాత్రం తన మాతృభూమిలోనే ఉండిపోయారు. ఫాసిజంకు వ్యతిరేకంగా మేధో, నైతిక పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఆయన జీవితచరిత్రకారుడు ఇలా రాశాడు: ‘ముస్సోలినీ పట్ల వ్యక్తిపూజను పెంపొందించేందుకు, ప్రభుత్వాన్ని ధిక్కరించకుండా అణకువతో మెలగడాన్ని నేర్పేందుకు, కొత్త తరాలు డూస్ (నాయకుడు) అధినేతను ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆరాధించేందుకు, ప్రశ్నలు అడగకుండా విశ్వసించి, ఆజ్ఞలు పాటించి, పోరాడేందుకు అనుగుణంగా ఇటాలియన్లను సమాయత్తం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం సమాచార, ప్రసార మాధ్యమాలను, విద్యావ్యవస్థను సంపూర్ణంగా ఉపయోగించుకుంది. ఇందుకు విరుద్ధంగా క్రోచె ఉదారవాద భావాలను ప్రచారం చేశారు. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ప్రబోధించారు. మానవ హుందాను రక్షించారు. మనిషి స్వతహాగా స్వేచ్ఛాశీలి అని పదేపదే చెప్పారు. వైయక్తిక నిర్ణయాలకు ప్రాధాన్యమివ్వాలని, వ్యక్తిగత బాధ్యతలను విస్మరించకూడదని క్రోచె విజ్ఞప్తి చేశారు. 


రిజీ స్ఫూర్తిదాయక క్రోచె జీవిత చరిత్ర తరువాత డేవిడ్ గిల్మౌర్ రాసిన ‘The Pursuit of Italy’ని చదివాను. ఇది ఇటలీ సమగ్ర చరిత్ర. నాలుగు వందల పేజీల ఈ పుస్తకంలో ముస్సోలినీ పాలనపై ముప్పై పేజీల అధ్యాయం ఉన్నది. ఇటలీలో గతంలో సంభవించిన భీతావహ పరిణామాలనే నేను ఇప్పుడు భారత్‌లో స్వయంగా చూస్తున్నాను. ‘1930ల్లో ముస్సోలినీ పాలనాశైలి మహా ఆడంబరపూర్వకంగా పరిణమించింది. సైనిక కవాతులు గతంలో కంటే అధికమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఫాసిస్టు యూనిఫార్మ్‌లో కన్పించసాగారు. సెన్సార్ నిబంధనలు మహా కఠినతరమయ్యాయి. ప్రజలను పీడించడం మరింతగా పెరిగింది. డూస్ ప్రసంగాలు ఒక నిత్య వ్యవహారమైపోయింది. బాల్కనీలో నిలబడి ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రాచీన రోమ్ సామ్రాజ్య వైభవాన్ని ఇటలీకి మళ్ళీ సంతరింపజేస్తానని ముస్సోలినీ ఉద్ఘాటించినప్పుడల్లా ప్రజలు ‘డూస్, డూస్, డూస్’ అని కేరింతలు కొట్టేవారు. ఫాసిస్ట్ సెల్యూట్ చేసేవారని గిల్మౌర్ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన గురించి కూడా ఇలాగే చెప్పవచ్చు. ముఖ్యంగా 2019లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ఎక్కడ ప్రసంగిస్తున్నా ఆయన ప్రతిమాటకు సభికులు ‘‘మోదీ, మోదీ, మోదీ’’ అని పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేయడం పరిపాటి అయిపోయింది.


ఇటాలియన్ నియంత అంతగా ప్రజాదరణ ఎలా పొందగలిగాడు? గిల్మౌర్ ఇలా సమాధానమిచ్చారు: ‘ముస్సోలినీ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఇటాలియన్ల ఆకాంక్షలు, భయాలకు ఒక ప్రతీక అయ్యాడు. అంతర్జాతీయ సమాజంలో తమ దేశానికి లభించాల్సిన స్థానం లభించలేదని ఇటాలియన్లు విశ్వసించారు. ఇరుగు పొరుగు యూరోపియన్ దేశాలే ఇందుకు కారణమని వారు భావించారు తమ సొంత ఉదారవాద రాజకీయవేత్తలతో పాటు యుద్ధకాలపు మిత్రదేశాలు ఇటలీని ఘోరంగా వంచించాయని ఇటాలియన్లు గట్టిగా భావించారు. తమను ఈ అవమానకర పరిస్థితుల నుంచి రక్షించి పూర్వపు గౌరవప్రతిష్ఠలను ముస్సోలినీ మళ్ళీ సమకూర్చగలరని వారు నమ్మారు’ నరేంద్ర మోదీ కూడా ఇదే విధంగా భారత ప్రజల విశ్వాసాన్ని పొందారు. పురాతన కాలంలో భారత్‌లోనూ, విశాల ప్రపంచంలోనూ హిందువులు అన్ని విధాల అగ్రగాములుగా ఉండేవారని, ముస్లిం, బ్రిటిష్ దురాక్రమణదారుల వల్ల వారు ఆ వైభవాన్ని కోల్పోయారని నరేంద్ర మోదీ వాదించారు. స్వాతంత్ర్యానంతరం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం తమ అవినీతి, కుహనా లౌకికవాదంతో భారత్‌ను, హిందువులను వంచించారని ఆయన చెప్పే మాటలను చాలామంది విశ్వసిస్తున్నారు. 


ఇటలీ చరిత్ర గురించిన రిజీ, గిల్మౌర్ పుస్తకాలను చదువుతున్నప్పుడు ఇరవయ్యో శతాబ్దిలో ఆ యూరోపియన్ దేశంలో సంభవించిన కొన్ని పరిణామాలు ఇప్పుడు మన దేశంలోనూ చోటు చేసుకొంటున్న వైనం నన్ను తీవ్ర నైరాశ్యానికి గురి చేసింది. అయితే కొన్ని ఆశావహ సానుకూలతలు ఉండడం నాకు ఎంతో ఊరట కలిగించింది. ముస్సోలినీ ఇటలీలో వలే కాకుండా మోదీ భారత్‌లో పాలకపక్షం ఇతర రాజకీయ పార్టీల నుంచి తీవ్ర రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రధాన ప్రతిపక్షం కేంద్రంలో చాలా దుర్బలంగా ఉన్నమాట నిజం. అయితే అదే పార్టీ ఇప్పటికీ ఐదారు ప్రధాన రాష్ట్రాలలో చాలా దృఢంగా ఉంది. మీడియాను లొంగదీసుకున్నారు గానీ పూర్తిగా అణచివేయలేక పోయారు. ముస్సోలినీ ఇటలీలో ఫాసిస్టుల ప్రభుత్వాన్ని క్రోచె మాత్రమే అన్ని విధాల వ్యతిరేకించారు. మోదీ భారత్‌లో పాలకపక్షాన్ని నిలదీస్తున్న రచయితలు, మేధావులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య సంస్థాపన సూత్రాలు, ఆదర్శాలను సమర్థిస్తూ వారు బహిరంగంగా, సాహసోపేతంగా మాట్లాడుతున్నారు.


ముస్సోలినీ తన పాలనను ఎలా పటిష్ఠం చేసుకున్నదీ అభివర్ణించిన తర్వాత గిల్మౌర్ ఆయన వైఫల్యాల్నీ ఎత్తి చూపాడు. ‘ఇటాలియన్లు ఆశించిన విధంగా సిరిసంపదలు సమకూర్చడంలో ముస్సోలినీ పాలన విఫలమవడంతో ఫాసిజం బలహీనపడింది. తమకు మంచి పాలన అందిస్తున్నట్లు ఇటాలియన్లను భ్రమింపచేయడంలో ముస్సోలినీ సఫలమయ్యాడు. అయితే ఫాసిస్టు ప్రభుత్వం తమకు శ్రేయోదాయక జీవితాన్ని సమకూర్చిందని ఇటాలియన్లు భావించేలా చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఇటాలియన్లకు ఉద్యోగాలు సమకూర్చడంలో, జాతి సంపదను ఇతోధికం చేయడంలోనూ ఆయన విఫలమయ్యాడని గిల్మౌర్ రాశాడు. మోదీ సైతం ఆర్థికరంగంలో దేశ ప్రజలకు చెప్పుకోదగిన మేలు చేయలేకపోయారు. అవివేక విధానాలతో దేశ ఆర్థికవ్యవస్థకు ఎంతో నష్టాన్ని కలిగించారు. ఇటలీలో తమ పాలన శాశ్వతమని బెనిటో ముస్సోలినీ, ఆయన ఫాసిస్టు అనుయాయులు విశ్వసించారు. నరేంద్ర మోదీ, బీజేపీ వారు కూడా అదేవిధంగా భావిస్తున్నారు. శాశ్వతపాలన స్వప్నాలు ఫలించబోవు. అయితే ప్రస్తుత పాలకులు అధికారంలో కొనసాగినంతవరకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నైతికంగా జాతి భారీ మూల్యం చెల్లించవలసి రావడం ఖాయం. ముస్సోలినీ, ఆయన పార్టీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. మోదీ, ఆయన పార్టీ పాలనతో వాటిల్లుతున్న వినాశనం నుంచి కోలుకునేందుకు భారత్‌కు అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చు.

 

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Follow Us on:
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.