ఇది ప్రభుత్వమా.. ప్రైవేటు కంపెనీయా?

ABN , First Publish Date - 2022-07-01T04:44:09+05:30 IST

రాష్ట్రంలో అధికారంలో ఉండేది వైసీపీ ప్రభుత్వమా! లేక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీయా! అనేది అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

ఇది ప్రభుత్వమా.. ప్రైవేటు కంపెనీయా?
గౌరవసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శ

ముత్తుకూరు, జూన్‌ 30 : రాష్ట్రంలో అధికారంలో ఉండేది వైసీపీ ప్రభుత్వమా! లేక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీయా! అనేది అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుత్తపాడు, జంగాలకండ్రిగ గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యాన గురువారం జరిగిన బాదుడేబాదుడు కార్యక్రమాల అనంతరం జంగాలకండ్రిగలో నిర్వహించిన గౌరవసభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతా మనడం సరికాదన్నారు. మీటర్లు రైతుల మెడలకు ఉరితాళ్లుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరు నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పు తెస్తే తప్ప రోజుగడవని దారుణ  ఆర్థిక పరిస్థితికి ప్రభుత్వం చేరుకోవడం సీఎం జగన్‌ పుణ్యమేనన్నారు. చివరకు పేదలు తాగే మద్యంపై కూడా అప్పు తెచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధించి అక్రమ కేసులు పెట్టడమే పనిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉందన్నారు.  అనంతరం స్థానిక టీడీపీ నాయకుడు పేట మహేష్‌ ఆధ్వర్యంలో యువకులు సోమిరెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ముత్తుకూరు, టీపీగూడూరు, వెంకటాచలం మండ లాల టీడీపీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, సన్నారెడ్డి సురేష్‌రెడ్డి, గుమ్మడి రాజా యాదవ్‌, తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యాదవ్‌, నాయకులు శ్రీధర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, నరసారెడ్డి, విష్ణువర్దన్‌రావు, దండు శ్రీనివాసులు, ఆలి ముత్తు, ఏడుకొండలు, శివానందం, శ్యాంరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T04:44:09+05:30 IST