కరోనా వ్యాక్సిన్లలో ఏది మంచిది..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

ABN , First Publish Date - 2021-06-17T22:19:03+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉంది

కరోనా వ్యాక్సిన్లలో ఏది మంచిది..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉంది. దాదాపు అన్ని దేశాలూ కరోనా వల్ల ప్రభావితమయ్యాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాదిన్నర పైనే అయినప్పటికీ దీనికి ఇంకా పూర్తి స్థాయి మందు అందుబాటులోకి రాలేదు. దీనిని అరికట్టాలంటే ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒకటే అస్త్రంగా కనబడుతోంది. దీంతో వివిధ దేశాలు తమ పౌరులకు వ్యాక్సిన్లు అందిస్తున్నాయి. మన దేశంలో కూడా ఈ ఏడాది జనవరిలోనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది.


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవాగ్జిన్,  ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్‌ను ప్రపంచంలోని చాలా దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఉంది. కోవాగ్జిన్‌ను ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ఇది వివిధ రకాల వైరస్ మ్యుటేషన్లతో పోరాడగలదని పలు పరిశోధనల్లో తేలింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు కూడా భారత్‌తో పాటు మరో 60కి పైగా దేశాల్లో ఆమోదం లభించింది. ఈ మూడు వ్యాక్సిన్లలో ఏది సమర్థంగా వైరస్‌ను అరికడుతోంది? ఏది ఉత్తమమైనది? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..


 ఏ వ్యాక్సిన్ మంచిది?

ఈ మూడే కాదు.. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ ఉత్తమమైనది అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభం కాదు. ఎవరైనా చెప్పినా అది పూర్తి సమగ్రం కాదు. ఒక వ్యాక్సిన్ సామర్థ్యాన్ని చెప్పాలంటే దాని క్లినికల్ ట్రయల్స్ బట్టే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఫైజర్ వ్యాక్సిన్ 95 శాతం సమర్థతతో పనిచేస్తోంది. కోవిషీల్డ్ 60-90 శాతం ప్రభావవంతంగా ఉంటోంది.


ఈ క్లినికల్ ట్రయల్స్‌ను బట్టి కూడా వ్యాక్సిన్ పనితీరును పూర్తి స్థాయిలో అంచనా వేయలేం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు శరీర తత్వాలు గల వ్యక్తులు మీద చేశారు. వ్యాక్సిన్ల పనితీరు మీద అక్కడి వాతావరణం, సమాజంలోని వ్యక్తులు ఆరోగ్యం మీద తీసుకునే శ్రద్ధ, వయసు, మానసిక స్థితి, అలవాట్లు.. ఇలా ఎన్నో ప్రభావం చూపుతాయి. కాబట్టి ఒక వ్యాక్సిన్‌తో మరో వ్యాక్సిన్‌ను పోల్చడం సరికాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 


భారత్ వ్యాక్సిన్ల సంగతేంటి? 


భారత్‌లో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌ను ఇన్ యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంలో అభివృద్ధి చేశారు. చనిపోయిన వైరస్‌ను ఈ టీకా ద్వారా శరీరంలోకి పంపుతారు. తద్వారా శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఇక, కోవిషీల్డ్ ఒక వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. చింపాంజీల్లో కనిపించే అడెనోవైరస్ `ChAD0x1`ను ఉపయోగించి దీన్ని అభివృద్ధి చేశారు. దీని సహాయంతో కరోనా వైరస్‌లో కనిపించే స్పైక్ ప్రోటీన్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని శరీరంలోకి పంపిన తరువాత రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. స్పుత్నిక్-వి కూడా వైరల్ వెక్టర్ టీకానే. అయితే దీన్ని రెండు వైరస్‌లతో అభివృద్ధి చేశారు. ఈ మూడూ డబుల్ డోస్ వ్యాక్సిన్లు. పరిశోధకులు సూచించిన కాల వ్యవధిలో రెండు డోస్‌లనూ తీసుకోవాలి. 


ఈ మూడు వ్యాక్సిన్లూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన అన్ని ప్రమాణాలనూ అందుకున్నాయి. వీటికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తి డేటా రావాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి కోవాగ్జిన్ 78 శాతం ప్రభావశీలతతో పనిచేస్తోంది. కోవిషీల్డ్ సామర్థ్యం సామర్థ్యం 70 శాతంగా నిరూపితమైంది. డోసుల మధ్య కాల వ్యవధి పెరిగితే ఈ వ్యాక్సిన్ పనితీరు ఇంకా మెరుగవుతోందని చెబుతున్నారు. ఇక స్పుత్నిక్-వి 90 శాతం ప్రభావశీలంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలింది. అయితే  వీటి పనితీరుపై నిరంతరం అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. mRNA సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఫైజర్, మోడెర్నా టీకాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి. ఇవి ఇంకా భారత్‌లో అందుబాటులోకి రాలేదు.


యాంటీ బాడీలు ఎన్ని రోజులు ఉంటాయి? 

ఈ విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 9-12 నెలల వరకు యాంటీ బాడీలు శరీరంలో ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత తీసుకోవాల్సిన బూస్టర్ డోసు గురించి పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత శరీరంలో యాంటీ బాడీలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయి. కరోనా వైరస్ సోకినా దాని తీవ్రతను తగ్గిస్తాయి.


ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్లూ మంచివేనని, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-06-17T22:19:03+05:30 IST