ఇంధన భద్రతకు ఉక్రెయిన్ ముప్పు

Published: Tue, 15 Mar 2022 04:05:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon

దేశీయంగా ఇంధన భద్రత సమకూర్చుకోవడం ఇప్పట్లో అసాధ్యం కనుక మనం విధిగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవలసి ఉంది. ఇందుకు మనం బొగ్గు, చమురు, యురేనియం దిగుమతుల తగ్గించుకోవాలి. అలాగే తయారీ రంగం కంటే సేవల రంగానికి అధిక ప్రాధాన్యమివ్వాలి. తక్కువ ఇంధన వినియోగంతో భారీ స్థూల దేశీయోత్పత్తిని సాధించడం సేవల రంగంతోనే సాధ్యమవుతుంది.


ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం 80 డాలర్లుగా ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర రాబోయే కొద్ది నెలల్లో 150 డాలర్లకు ఖాయంగా పెరిగే అవకాశముంది. పర్యవసానంగా మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 నుంచి రూ.130కి పెరగడం అనివార్యం. 

క్రూడాయిల్ దిగుమతులకు మనం భారీ మొత్తాల్లో విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం మన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకై బొగ్గు, చమురు, యురేనియం దిగుమతులపై ఆధారపడుతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో అభద్రతా పరిస్థితుల మూలంగా క్రూడాయిల్ సరఫరాలు మనకు సకాలంలో సక్రమంగా అందని పక్షంలో మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి తీవ్ర అంతరాయమేర్పడుతుంది.


అసలు సమస్యేమిటంటే దేశీయంగా ఇంధన ఉత్పత్తిని ఇతోధికంగా పెంచుకునేందుకు అవకాశాలు పెద్దగా లేవు. మన బొగ్గు నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. యురేనియం నిక్షేపాలు మనకు చాలా స్వల్పస్థాయిలో మాత్రమే ఉన్నాయి. జల విద్యుదుత్పత్తి పర్యావరణ భద్రతకు తీవ్ర ఆటంకంగా పరిణమించింది. ఇక మిగిలింది సౌర శక్తి. దీని విషయంలో మన పురోగతి ఆశాజనకంగా లేదు. ఈ పరిస్థితి మారేందుకు హీనపక్షం రెండు దశాబ్దాలు పట్టినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ఈ కారణాల రీత్యా దేశీయంగా ఇంధన భద్రత సమకూర్చుకోవడం ఇప్పట్లో అసాధ్యమే. మరి మార్గాంతరమేమిటి? మనం విధిగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవలసి ఉంది. ఇందుకు మనం బొగ్గు, చమురు, యురేనియం దిగుమతులను తగ్గించుకోవలసి ఉంటుంది. వీనివల్ల చెల్లింపుల భారం కొంతమేరకు తగ్గుతుంది. అయినా ఇంధన భద్రతను సమకూర్చుకునేందుకు మనం విధిగా కొన్ని చర్యలు చేపట్టవలసి ఉంది. అవేమిటో చూద్దాం.


ప్రపంచ జనాభాలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న మొదటి పది శాతం మంది ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం ఇంధనంలో యాభై శాతాన్ని వినియోగించుకుంటున్నారని సైన్స్ జర్నల్ ‘నేచర్’ వెల్లడించింది. ఉదాహరణకు ఈ సంపన్నులు తమ ఉతికిన బట్టలను ఆరబెట్టుకునేందుకు డ్రైయింగ్ మెషీన్లను ఉపయోగించుకోవడం పరిపాటి. నిజానికి ఎటువంటి ఇంధన వినియోగం లేకుండా ఉతికిన బట్టలను ఎండలో ఆరేసుకుంటే సరిపోతుంది. తత్ఫలితంగా ఉన్నత వర్గాల వారి ఇంధన వినియోగ పరిమాణం భారీగా తగ్గగలదు. ఆర్థికంగా ఉన్నత వర్గాల వారు తమ ప్రయాణాలకు వ్యక్తిగత వాహనాలను అధికంగా ఉపయోగించుకుంటున్నారని అదే సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక సాధికారిక అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ సంపన్నులు తమ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలంటే విద్యుత్ చార్జీలు, ఇంధన చమురు ధరను ఇతోధికంగా పెంచి తీరాలి పెరిగిన వ్యయ భారాల వల్ల సంపన్న వర్గాల వారు తమ వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని అనివార్యంగా తగ్గించి తీరుతారు.


లీటర్ చమురుపై రూ.100 ‘ఇంధన భద్రతా పన్ను’ను విధించామనుకోండి. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.200కి పెరుగుతుంది. సంపన్న వర్గాల వారిపై ఆర్థిక భారం పెరుగుతుంది. అప్పుడు వారు తమ వ్యక్తిగత వాహనాలను తక్కువగా వినియోగించుకుంటారు. చమురు విక్రయాలపై విధించిన భారీ పన్నుతో సమకూరిన ఆదాయాన్ని బస్సులు, మెట్రోలతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థను ఇతోధికంగా మెరుగుపరచేందుకు ఉపయోగించుకోవచ్చు.

నిజానికి ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించడమే చాలా సౌకర్యవంతంగా ఉంటుందనేది నా వ్యక్తిగత అనుభవం. సమయం వృధా కాకపోవడంతో పాటు వార్తాపత్రికలు మొదలైనవి చదువుకోవడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత వాహనాలలో ప్రయాణించడంలో ఇవి సాధ్యం కాకపోగా శారీరక అలసటకు గురవవలసివస్తుంది. సరే, పెట్రోల్ ధరల పెరుగుదల పేదలపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. అయితే సమగ్రగా అభివృద్ధిపరచిన ప్రజా రవాణా వ్యవస్థతో పేదలపై ఆ ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడం సాధ్యమవుతుంది.


చమురుపై విధించినట్టుగానే విద్యుత్ వినియోగంపై కూడా ‘ఇంధన భద్రతా పన్ను’ను విధించి తీరాలి. 300 కంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకోవడం జరిగితే ప్రతి అదనపు యూనిట్ విద్యుత్‌పై రూ.20 ఇంధన భద్రతా పన్నును విధించి తీరాలి. విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. యూనిట్‌కు రూ.25 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఇలా పెరిగిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సంపన్న వర్గాలకు చెందిన వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవడాన్ని తప్పక ప్రారంభిస్తారు. పర్యవసానంగా మనకు ఇంధన భద్రత సమకూరుతుంది.


ఇంధన భద్రతను సమకూర్చుకునేందుకు ఆర్థికాభివృద్ధి వ్యూహాల ప్రాధాన్యాలను మార్చుకోవలసి ఉంది. ఇప్పుడు మనం తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ పథకాన్ని అమలుపరుస్తున్నాం. దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలను ఇతోధికం చేయడానికి బదులుగా దేశం నుంచి సేవలను అందించేందుకు మనం అధిక ప్రాధాన్యమివ్వాలి. ప్రభుత్వం తన దృష్టిని ‘మేక్ ఇన్ ఇండియా’పై కాకుండా ‘సెర్వ్‌డ్ ఫ్రమ్ ఇండియా’పై కేంద్రీకరించాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే తయారీ రంగం కంటే సేవల రంగం అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యమివ్వాలి. సాఫ్ట్‌వేర్, సినిమాలు, అనువాదాలు ఇత్యాది సేవల రంగాలలో వినియోగించుకునే విద్యుత్ కంటే వస్తూత్పత్తి రంగంలో వినియోగించుకునే విద్యుత్ పదిరెట్లు అధికంగా ఉంటుంది. సేవల రంగం ఆధారిత ఆర్థికాభివృద్ధి వ్యూహాలను రూపొందించుకుని అమలుపరిస్తే స్వల్ప పరిమాణంలో ఇంధనాన్ని వినియోగించుకోవడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిని భారీగా పెంచుకోవడం సుసాధ్యమవుతుంది. జీడీపీ వృద్ధిరేట్లు పెరిగినప్పుడు ఉద్యోగాల సృష్టి జరిగి సమగ్ర ఆర్థికాభివృద్ధికి సానుకూలతలు నెలకొంటాయి. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం లాంటి ఉపద్రవాలతో వాటిల్లే విషమ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఇంధన భద్రత విషయంలో మనం సదా సర్వసన్నధంగా ఉండాలి.


(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం 

రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.