డిమాండ్ల సాధన కోసం జేఏసీ నిరసన

ABN , First Publish Date - 2021-12-08T05:50:37+05:30 IST

ఉమ్మడి జేఏసీ ఐక్యవేదిక పిలుపు మేరకు బనగానపల్లె మండలంలోని అన్ని కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నతపాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు.

డిమాండ్ల సాధన కోసం జేఏసీ నిరసన
బనగానపల్లెలో నిరసన వ్యక్తం చేస్తున్న జేఏసీ నాయకులు

బనగానపల్లె, డిసెంబరు 7: ఉమ్మడి జేఏసీ ఐక్యవేదిక పిలుపు మేరకు బనగానపల్లె మండలంలోని అన్ని కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నతపాఠశాలల్లో  ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. మంగళవారం ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి, ఎన్‌జీవో బనగానపల్లె అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అల్తాఫ్‌ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.  బాలుర ఉన్నత పాఠశాల, తహసీల్దారు కార్యాలయం, ప్రభుత్వ ఉన్నతపాఠశాల,  కస్తూర్బా పాఠశాలలో, కైప ఉన్నతపాఠశాల, తెలుగుపేట ప్రాథమిక పాఠశాల, ఇల్లూరు కొత్తపేట పాఠశాలల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.  



కొలిమిగుండ్ల: పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయులు ఏపీ ఐక్య జేఏసీ పిలుపు మేరకు  మంగళవారం కొలిమిగుండ్లలో నిరసన తెలిపారు. కొలిమిగుండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్టీయూ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీనివాసులు, వైవీఎస్‌ నారాయణరెడ్డి, సుంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  


కోవెలకుంట్ల: ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నియోజకవర్గ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మునిస్వామి కోరారు.  మంగళవారం రాష్ట్ర ఉద్యోగుల సంఘం జేఏసీ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  పట్టణంలోని తహీసీల్దారు కార్యాలయం వద్ద రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.   


 సంజామల:  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కె ఖాజాహుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో  ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న 71 సమస్యలపై దశల వారీగా పోరాటం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగకుమార్‌, ఈవోపీఆర్డీ రాధికారెడ్డి, వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పద్మజ, మౌనిక, బాబు, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  


బండి ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ  11వ పీఆర్సీ విడుదల చేయాలని ఆసుపత్రి సూపర్‌ వైజర్‌ జయరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం రాష్ట్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ మంజూరులో తీవ్ర జాప్యం చేస్తోందని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీనివాసులు, యశోధర, వెంకటశివన్న, కృష్ణమోహన్‌, స్వరూప పాల్గొన్నారు.



Updated Date - 2021-12-08T05:50:37+05:30 IST