ప్రధానిని జగన్‌ ఎన్నో అడిగారట!

ABN , First Publish Date - 2022-07-05T08:15:09+05:30 IST

ప్రధానిని జగన్‌ ఎన్నో అడిగారట!

ప్రధానిని జగన్‌ ఎన్నో అడిగారట!

వీడ్కోలు సమయంలో వినతి పత్రం!!

అందులో చివరి వరుసలో ప్రత్యేక హోదా

మిగతావన్నీ ఢిల్లీ వెళ్లినప్పుడు ఇచ్చే వినతులే!


అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల సందర్భంలో ఇచ్చిన తరహాలోనే విభజన హామీలన్నిటినీ పరిష్కరించాలంటూ వినతిపత్రం ఇచ్చారు! సోమవారం రాష్ట్ర పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌ బయల్దేరిన మోదీకి సీఎం పుష్పగుచ్ఛం అందించి.. శాలువా కప్పిన ఫొటోలను సమాచార, పౌర సంబంధాల శాఖ విడుదల చేసింది. ఆ సందర్భంగా వినతి పత్రం అందజేశారని వెల్లడించింది. రీసోర్స్‌ గ్యాప్‌ గ్రాంటుగా రూ.34,125.50 కోట్లు ఇవ్వాలని.. తెలంగాణ డిస్కమ్‌ల నుంచి ఏపీ జెన్కోకు రావలసిన  రూ.6,627.28 కోట్లను ఇప్పించాలని.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు.


జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతుబద్ధత లేదని.. తీవ్ర నష్టం జరుగుతోందని.. మేలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని.. కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం అందించాలని.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్సులు మంజూరు చేయాలని.. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని అందులో కోరినట్లు తెలిపింది. ఆఖరున ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-05T08:15:09+05:30 IST