జగన్‌ పేట్రేగిపోతున్నారు

ABN , First Publish Date - 2021-01-22T05:56:29+05:30 IST

టీడీపీ నాయకులను సీఎం జగన్‌ టార్గెట్‌ చేసి అరెస్టులు, దాడులతో పేట్రేగి పోతున్నారని పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ పేట్రేగిపోతున్నారు
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

  1. ఏం తప్పు చేశారని కళాను అరెస్టు చేశారు?
  2. డీజీపీ సవాంగ్‌ వాస్తవాలు తెలుసుకోవాలి
  3. లేకపోతే మూల్యం చెల్లించుకుంటారు
  4. టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు


కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 21: టీడీపీ నాయకులను సీఎం జగన్‌ టార్గెట్‌ చేసి అరెస్టులు, దాడులతో పేట్రేగి పోతున్నారని పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నాయకులతో కలిసి నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఇంటిపై అర్ధరాత్రి 300 మంది దాడి చేసి అరెస్టు చేయడం పనికిమాలిన చర్య అని అన్నారు. ఏ నేరం చేశారని కళా వెంకట్రావును అర్ధరాత్రి అరెస్టు చేస్తారని డీజీపీని సోమిశెట్టి ప్రశ్నించారు. 

ఫ కళా వెంకట్రావు అరెస్టును సోమిశెట్టి తీవ్రంగా ఖండించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీస్‌ శాఖకు బాస్‌ అని, అలాంటి అధికారి కేవలం సీఎం ఆదేశానుసారం నడుచుకుంటూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు. 

రామతీర్థం పర్యటనకు ముందుగా తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యు డు కళా వెంకట్రావు పోలీసుల అనుమతి తీసుకున్నారని అన్నారు. అనుమతి తీసుకోకుండా విజయసాయి రెడ్డి అక్కడ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వచ్చారని ఆరోపించారు. దీంతో మండిపడిన ప్రజలు ఆయనపై తిరగబడి రాళ్లతో వాహనాలపై దాడి చేశారని, ఆ ఘటన కు తమ పార్టీ నాయకులే కారణమని కేసులు పెట్టడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని సోమిశెట్టి అన్నారు. గొడవలన్నింటికీ కారకుడైన విజయసాయిరెడ్డిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని డీజీపీ సోమిశెట్టి ప్రశ్నించారు. 

తమ పార్టీ నేతలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే కేసుల పేరుతో వేధిస్తున్నారని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు పేకాట, లిక్కర్‌, ఇసుక మాఫియాను నిర్వహిస్తుంటే.. వారి పై ఈగ కూడా వాలనీయకుండా పోలీసులు వెన్ను కాస్తున్నారని ఆరోపించారు. కనీసం ఒక్కరిపైనా కేసు నమోదు చేసిన దాఖలాలు లేవని అన్నారు. పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన అధికారిని క్షణాల్లో ఆ స్టేషన్‌ నుంచి బదిలీ చేశారని అన్నారు. వైసీపీ నాయకులు పెళ్లిళ్లు, సభలు, సమావేశాలు నిర్వహించుకుంటే అడ్డురాని కరోనా, టీడీపీ కార్యక్రమాలకు అడ్డు వస్తుందా అని ప్రశ్నించారు. 

కార్యక్రమంలో కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముంతాజ్‌ బేగం, ప్రధాన కార్యదర్శి సుకన్య, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్‌, బీసీ కమిటీ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, నాయకులు హనుమంతరావు చౌదరి, రాజు యాదవ్‌, బజారన్న, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-22T05:56:29+05:30 IST