బకాయిలకు ఎసరు!

ABN , First Publish Date - 2022-05-12T09:21:13+05:30 IST

వేతన సవరణపైనేకాదు.. ఎరియర్స్‌ చెల్లింపుపైనా ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు మొండిచేయి చూపింది. 11వ వేతన సవరణ సంఘ (పీఆర్‌సీ)

బకాయిలకు ఎసరు!

ఉద్యోగ విరమణ సమయంలోనే చెల్లింపు

11వ పీఆర్‌సీ ఎరియర్స్‌పై తేల్చేసిన జగన్‌ ప్రభుత్వం

కరువు ఇప్పుడైతే.. భత్యం పాతికేళ్లకు ఇస్తారా?

ఉద్యోగుల ఫైర్‌.. లక్ష-లక్షన్నర వరకు నష్టమని ఆందోళన

డీఏ ఎరియర్స్‌పైనా మడత పేచీ.. పీఆర్‌సీ బకాయుల్లోనే 

కలిపి ఉంటాయని ప్రభుత్వం లెక్కలు.. నమ్మడమెలా:  ఉద్యోగులు

స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్ల మంజూరు.. మట్టి ఖర్చుల కింద 25 వేలు

పీఆర్‌సీ అమలు సమయం ఐదేళ్లకు తగ్గింపు.. జీవోలు విడుదల

ఎరియర్స్‌పై సంఘాల ఆగ్రహం.. స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీలో నిలదీత’’


అమరావతి, మే 11 (ఆంధ్రజ్యోతి): వేతన సవరణపైనేకాదు.. ఎరియర్స్‌ చెల్లింపుపైనా ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు మొండిచేయి చూపింది. 11వ వేతన సవరణ సంఘ (పీఆర్‌సీ) బకాయిలను.. వారి పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. ప్రస్తుత పీఆర్‌సీ ఎరియర్స్‌ను ఎప్పుడో 20-25 ఏళ్లకు చెల్లిస్తామనడంపై మండిపడుతున్నారు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో.. దాని విధానం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఎరియర్స్‌ను పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామనడం.. మోసం చేయడమేనని స్పష్టం చేస్తున్నారు. తమ ఆర్థిక భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఉద్యోగి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోతారని అంటున్నారు. జగన్‌ ప్రభుత్వం ఇచ్చింది పేరుకే ఐదేళ్ల పీఆర్‌సీ. అందులో 42 నెలలు ఉద్యోగికి రావాల్సిన పీఆర్‌సీ ప్రయోజనాలు కోల్పోతున్నారు. దీనిపై బుధవారమిక్కడ అమరావతి సచివాలయంలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులను ఉద్యోగ సంఘాల నేతలు నిలదీశారు. ఈ భేటీకి ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించలేదు. లక్షలాది మంది ఉపాధ్యాయులకు ప్రతినిధులుగా ఉన్న ఆ సంఘాల నేతలు లేకుండా పీఆర్‌సీ అనుబంధ అంశాలు, జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. జీవోలు కూడా విడుదల చేసేశారు.


జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్లో ఎంతో కాలం నుంచి సభ్యతం ఉన్న ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో బుధవారం ఉదయం.. సర్వీస్‌ అసోసియేషన్లతో సమావేశమంటూ అధికారులు మరో ఆహ్వానం తయారు చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా.. దానికి సవరణ చేస్తూ సర్వీస్‌ అసోసియేషన్లతో భేటీ అని మార్చడంపై ఉపాధ్యాయులు విరుచుకుపడుతున్నారు. 11వ పీఆర్‌సీకి సంబంధించిన జీవోలను విడుదల చేసినట్లు ఈ సమావేశంలో అధికారులు స్లైడులు వేసి చూపించారు. ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల నేతలు నిలదీస్తారేమోనన్న అనుమానంతోనే వారిని ఆహ్వానించలేదని చర్చ జరుగుతోంది. 


డీఏ ఎరియర్స్‌పై స్పష్టత కరువు

11వ పీఆర్‌సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం పలు జీవోలిచ్చింది. ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతి(ఐఆర్‌)ని వారి డీఏ బకాయిల నుంచి రికవరీ చేయబోమని స్పష్టం చేసింది. జనవరిలో ఇచ్చిన జీవో నంబరు 1లో 2019 జూలై నుంచి 2021 డిసెంబరు 31 వరకు ఉద్యోగులు అందుకున్న ఐఆర్‌ను.. డీఏ బకాయిల నుంచి రికవరీ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఐఆర్‌ రికవరీని నిలిపివేస్తున్నట్లు తాజా జీవోలో పేర్కొంది.


అయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్‌సీ ఎరియర్స్‌ను మాత్రం రిటైర్మెంట్‌ సమయంలో ఇస్తామని తెలిపింది.  ఉద్యోగులకు రావలసిన 5 డీఏల బకాయిల గురించి, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో తాజా జీవోలో ప్రస్తావించలేదు. పీఆర్‌సీ బకాయిలు లెక్కించినప్పుడే 2020 ఏప్రిల్‌ 1 నుంచి డీఏ ఎరియర్స్‌ కూడా కలిపి లెక్కించామని జీవో నంబర్‌ 1లో తెలిపింది. అంటే రిటైర్మెంట్‌ సమయంలో ఇచ్చే పీఆర్‌సీ బకాయుయిల్లోనే డీఏ బకాయిలు కూడా ఉంటాయనేది దాని వాదన. జగన్‌ అధికారంలోకి వచ్చాక 2018 జూలై 1, 2019 జనవరి 1 డీఏ ఎరియర్లను మంజూరు చేస్తూ అట్టహాసంగా ఉత్తర్వులిచ్చారు. ఉద్యోగులకు ఆ రెండు డీఏల బకాయిల రూపంలో రూ.8 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. ఏ ఏడాదికా ఏడాది బిల్లులను ఆర్థిక సంవత్సరం చివరి రోజు వెనక్కి తిప్పిపంపుతున్నారు. ఆ డీఏలకే దిక్కులేదని.. ఇప్పుడు ఐదు డీఏలను పీఆర్‌సీ ఎరియర్స్‌లో కలిపి లెక్కించారంటే ఎలా నమ్మాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరువు ఇప్పుడైతే.. భత్యం ఎప్పటికో చెల్లిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున రూపాయి విలువ పదేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటుందని గ్యారెంటీ లేదని.. కాలం గడిచే కొద్దీ విలువ పడిపోవచ్చు కాబట్టి తమ డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు మళ్లించి.. జీపీఎ్‌ఫపై అమలవుతున్న విధంగా 8.5 శాతం వడ్డీ ఇస్తేనే తమకు ప్రయోజకరంగా ఉంటుందని చెబుతున్నారు.


ఉదాహరణకు ఒక ఉద్యోగికి ప్రస్తుత గణాంకాల ప్రకారం డీఏ ఎరియర్స్‌ లక్ష రూపాయలు రావాలనుకుంటే.. ఆ ఉద్యోగికి మరో 20 ఏళ్లు సర్వీసు ఉందనుకుంటే.. 20 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగికి అందేది రూ.లక్షే.. కానీ 20 ఏళ్లలో ఆ లక్ష విలువ ఎంతకు తగ్గుతుంది..  దాని వల్ల ఉద్యోగి ఎంత నష్టపోతాడనే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. పైగా పీఆర్‌సీ బకాయిల్లోనే డీఏ ఎరియర్స్‌ కూడా ఉన్నాయనడానికి ప్రభుత్వం ఎలాంటి ఆధారం చూపడం లేదని.. ఒక్కో ఉద్యోగికి పీఆర్‌సీ ఎరియర్లు ఎంత రావాలో రాతపూర్వకంగా ఇస్తే అందులో డీఏ బకాయిలు కలిసి ఉన్నాయో లేవో అర్థమవుతుందని అంటున్నారు.


  • ఉద్యోగులకు ప్రతి ఏడాది ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వం స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఉద్యోగి తన స్కేల్‌లో గరిష్ఠ  వేతన పరిమితికి చేరుకున్న తర్వాత ఎలాంటి ఇంక్రిమెంట్లూ అందవు. కానీ పీఆర్‌సీ సిఫారసుల ప్రకారం స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్ల పేరుతో ఆ ఉద్యోగికి మరో ఐదేళ్లపాటు ఇంక్రిమెంట్లు అందించనుంది.
  • పీఆర్‌సీ అమలు సమయాన్ని పదేళ్ల నుంచి మళ్లీ ఐదేళ్లకు తగ్గిస్తూ ఇంకో జీవో జారీచేసింది. సర్వీస్‌ పెన్షనర్‌ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌ మరణించిన సందర్భాల్లో మట్టి ఖర్చుల కోసం రూ.25,000 వేలు ఇవ్వాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి మరణిస్తే కూడా మట్టి ఖర్చుల కింద రూ.25,000 ఇవ్వాలని మరో జీవో ఇచ్చింది.
  • 11వ పీఆర్‌సీ-2022కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సీటీల్లోని బోధనేతర సిబ్బందికి వర్తిస్తాయని ఇంకో జీవోలో పేర్కొంది. డీఏ, ఇంకా ఇతర అలవెన్సులను యూనివర్సిటీలు, సొసైటీలు, కార్పొరేషన్లు ప్రభుత్వంతో సమానంగా చెల్లిస్తేనే ఈ 11వ పీఆర్‌సీ స్కేళ్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. పీఆర్‌సీ అమల్లోకి వస్తుందన్న నేపథ్యంలో ఉద్యోగులకు ఐఆర్‌ లేదా అడ్వాన్సులు ఇచ్చి ఉంటే అది ఇప్పుడు ఇస్తున్న పీఆర్‌సీ చెల్లింపుల కంటే ఎక్కువ ఉంటే వాటిని భవిష్యత్‌లో వారికి చెల్లించే మొత్తం నుంచి సర్దుబాటు చేయాలని జీవోలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి బడ్జెట్‌లో కేటాయింపులు, సబ్సిడీలు ఉండవని, ఖర్చంతా ఆ సంస్థలే సొంత వనరుల నుంచి భరించాలని స్పష్టం చేశారు.
  • పెన్షనర్లకు సంబంధించి కూడా డీఆర్‌ బకాయిల్లో ఐఆర్‌ రికవరీ ఉండదని స్పష్టం చేశారు. వీరికి రావలసిన డీఆర్‌ బకాయిలను 2023 జనవరి 1వ తేదీ నుంచి మూడు నెలలకొకసారి నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు.
  • ఉద్యోగుల ట్రావెలింగ్‌ అలవెన్సుకు సంబంధించి ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది. దీని ప్రకారం గ్రేడ్‌ -1 పరిధి(వేతనం రూ.76,730 నుంచి రూ.1,62,780 పైన)లోకి వచ్చే ఉద్యోగులకు రాష్ట్రంలో టూర్లకు రూ.600 డెయిలీ అలవెన్సు, రాష్ట్ర వెలుపల టూర్లకు రూ.800 అలవెన్సు ఇస్తారు. గ్రేడ్‌-2 పరిధిలోకి (వేతనం రూ.70,850-రూ.1,58,880 వరకు) వచ్చే ఉద్యోగులకు రాష్ట్రంలో టూర్లకు డెయిలీ అలవెన్సు రూ.400, రాష్ట్రం వెలుపల టూర్లకు రూ.600 అలవెన్సుగా ఇస్తారు. మిగతా ఉద్యోగులను గ్రేడ్‌ -3పరిధిలో ఉంచారు. వీరికి రాష్ట్రంలో డెయిలీ అలవెన్సు రూ.300, రాష్ట్రం వెలుపల రూ.400 అలవెన్సుగా నిర్ణయించారు. ఇంకా ఉద్యోగులను బట్టి ప్రభుత్వం రకారకాల అలవెన్సులను నిర్ణయించి 16 పేజీల జీవో ఇచ్చింది.


ఒకేసారి చెల్లించిన చంద్రబాబు

పదో పీఆర్‌సీ 10 నెలల ఎరియర్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగుల ఫ్రావిడెండ్‌ ఖాతాల్లో జమ చేసింది. దీంతో ప్రతి ఉద్యోగీ ఒకేసారి కేడర్‌ను బట్టి రూ లక్ష నుంచి లక్షన్నర వరకు ప్రయోజనం  పొందారు. సీపీఎస్‌ ఉద్యోగులకైతే నగదు రూపంలో చెల్లించారు. ఒక్కో సీపీఎస్‌ ఉద్యోగికి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎరియర్స్‌ చెల్లింపులు జరిగాయి.


పరీక్ష పాసైన ఉద్యోగులకే ప్రొబేషన్‌

జూన్‌ నాటికి ఏపీపీఎస్సీ నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్తులైన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకే ప్రొబేషన్‌ ఇస్తామని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. దీంతో పరీక్షలు ఉత్తీర్ణులు కాలేని వారికి ప్రొబేషన్‌ ప్రకటించడంపై సందిగ్ధత నెలకొంది. పరీక్ష పాసైన వారికే కాకుండా అందరినీ ఒకేసారి రెగ్యులరైౖజ్‌ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి.


ఎరియర్స్‌పై ఉద్యోగ సంఘాల ఆందోళన

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఎరియర్స్‌ విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ‘పీఆర్‌సీ ఎరియర్స్‌ను పదవీ విరమణ సమయంలో ఇస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. జీవోల్లో డీఏ ఎరియర్స్‌పైనా స్పష్టత లేదు. దీనిపై సీఎంతో మాట్లాడిన తర్వాతే స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగ సంఘాలు పెట్టిన 71 డిమాండ్లపై మరోసారి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు’ అని బండి తెలిపారు. పీఆర్‌సీపై ఇప్పటికైనా ప్రభుత్వం జీవోలు జారీ చేయడం సంతోషదాయకమని బొప్పరాజు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు స్కేల్‌ తగ్గింపు అనేది అవాస్తవమన్నారు. 56 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తామని ఆర్థికశాఖ అధికారులు చెప్పారని తెలిపారు. 62 ఏళ్లకు పదవీవిరమణకు సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు సూర్యనారాయణ చెప్పారు.


పీఆర్‌సీ ఎరియర్స్‌ను పదవీ విరమణ సమయంలో ఇస్తామనడంపై అసంతృప్తి వ్యక్తం చేశామన్నారు. జీవోల్లో పీఆర్‌సీ ఎరియర్స్‌ విడుదలపై జీవోల్లో స్పష్టత లేదని వెంకట్రామిరెడ్డి చెప్పారు. దశలవారీగా కాకుండా ఉద్యోగ విరమణ సమయంలో ఇస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించామన్ననరు. 21 నెలల ఎరియర్స్‌ను గత పీఆర్‌సీ సంప్రదాయాల ప్రకారం ఉద్యోగి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో జమ చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు డిమాండ్‌ చేశారు.

Read more