Advertisement

ఆంధ్రుడా మేలుకో!

Feb 3 2020 @ 17:51PM

దావోస్‌ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌ పాల్గొని పెట్టుబడిదారులతో సమావేశమై సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. పెట్టుబడుల ఆకర్షణకు దావోస్‌లో ఆయన చేసిన కృషిని వివరిస్తూ పత్రికలలో పలు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు వెళ్లిన బృందంలోని సభ్యులు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దావోస్‌ సదస్సులో పాల్గొన్న పలువురు ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఎందుకు జరుగుతోంది? అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని ఎందుకు దెబ్బతీసుకుంటున్నారు?’’ వంటి ప్రశ్నలు పదే పదే అడిగారట. దీన్నిబట్టి అంతర్జాతీయ వేదికలపై కూడా ఆంధ్రప్రదేశ్‌ పరువు పోయిందని భావించాల్సి ఉంటుంది. అయినా మూడు రాజధానుల నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో ప్రశంసిస్తున్నారని జగన్‌ అండ్‌ కో ఆత్మవంచన చేసుకుంటోంది.

 జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన సమయాన్నంతా ప్రత్యర్థులపై పగ–ప్రతీకారాలను తీర్చుకోవడానికే వినియోగిస్తున్నారు. అందుకే రద్దుల ముఖ్యమంత్రిగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతీకారేచ్ఛకు తాజాగా శాసనమండలి బలి అవుతోంది. రాజధానుల వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారన్న కోపంతో ఉన్నపళంగా శాసనమండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. శాసనమండలి అవసరం నిజంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు గానీ, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఎంచుకున్న కారణం, సమయం మాత్రం ఆక్షేపణీయంగా ఉన్నాయి అని చెప్పక తప్పదు. 

 

‘‘అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే ఎలా? రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలిగా?’’.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయన మందీమార్బలం చేస్తున్న వాదన ఇది! ఈ వాదన నిజమేనని నమ్మాలంటే అభివృద్ధికి నిర్వచనం ఏమిటో వాళ్లు ముందుగా వివరించాలి. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలలో పెట్టడం ద్వారా అభివృద్ధి జరిగిపోతుందని చెప్పడం ప్రజలను వంచించడమే అవుతుంది.

 

మూడు రాజధానుల నిర్ణయంపై ఇంటా–బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ జగన్‌ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై తాజాగా ఎదురు దాడులు మొదలెట్టారు. ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే ప్రైవేట్‌ పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో జగన్మోహన్‌రెడ్డి ఈ దిశగా ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేశారు.

 

ఈ పరిణామంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలలో ఆంధ్రప్రదేశ్‌ చర్చనీయాంశం అయ్యింది. దావోస్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ ఆర్థిక సదస్సు జరుగుతూ ఉంటుంది. గతంలో చంద్రబాబు ఈ సదస్సులో స్వయంగా పాల్గొని ప్రైవేట్‌ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఒకరిద్దరు సాదాసీదా అధికారులు మాత్రమే పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌ పాల్గొని పెట్టుబడిదారులతో సమావేశమై సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. పెట్టుబడుల ఆకర్షణకు దావోస్‌లో ఆయన చేసిన కృషిని వివరిస్తూ పత్రికలలో పలు వార్తలు వచ్చాయి.

 

ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు వెళ్లిన బృందంలోని సభ్యులు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దావోస్‌ సదస్సులో పాల్గొన్న పలువురు ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఎందుకు జరుగుతోంది? అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని ఎందుకు దెబ్బతీసుకుంటున్నారు?’’ వంటి ప్రశ్నలు పదే పదే అడిగారట. దీన్నిబట్టి అంతర్జాతీయ వేదికలపై కూడా ఆంధ్రప్రదేశ్‌ పరువు పోయిందని భావించాల్సి ఉంటుంది. అయినా మూడు రాజధానుల నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో ప్రశంసిస్తున్నారని జగన్‌ అండ్‌ కో ఆత్మవంచన చేసుకుంటోంది. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి జరుగుతుంటే ముందుగా భూముల ధరలు పెరుగుతాయి. క్రయ విక్రయాలు జోరుగా సాగడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఈ పరిస్థితి రివర్స్‌లో వెళుతోంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోవడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పడిపోయాయి. హైదరాబాద్‌లో 30 ఏళ్లుగా ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఒక మిత్రుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత స్వరాష్ట్రమైన ఏపీలో స్థిరపడాలనుకున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనించిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని హైదరాబాద్‌లోనే స్థిరపడాలనుకుంటున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో తమకున్న భూమిలో రెండెకరాలను ఆయన అమ్ముదామనుకున్నారు. ఎనిమిది నెలల క్రితం వరకు ఎకరం 60 లక్షల రూపాయల ధర పలికిన తమ భూమిని ఇప్పుడు 30 లక్షల రూపాయలకు కూడా కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

 

భీమవరం చరిత్రలో మొదటిసారిగా ఇప్పుడు భూముల ధరలు పడిపోయాయి. దీన్నిబట్టి అమరావతి ప్రాంతంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోయిందన్న మాట! ఈ పరిణామానికి జగన్‌ అండ్‌ కో గానీ, వారిని గుడ్డిగా సమర్థిస్తున్నవారు గానీ ఏమి సమాధానం చెబుతారో వినాలని ఉంది. అమరావతిలో భూసమీకరణ కింద సేకరించిన భూములతో చంద్రబాబు ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనుకుందనీ, అది తమకు నచ్చలేదనీ జగన్‌ అండ్‌ కో చెబుతోంది. ఇది తప్పనుకుంటే మరి ఇప్పుడు విశాఖపట్టణంలో జగన్‌ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆరు వేల ఎకరాల భూమిని భూసమీకరణ కింద సేకరిస్తున్నారు. ఇందులో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమితోపాటు అసైన్డ్‌ భూములు అధికంగా ఉన్నాయి.

 

ప్రభుత్వం లేఅవుట్లు అభివృద్ధి చేస్తే తమ భూముల ధరలు పెరుగుతాయని అక్కడి రైతులు ఆనందిస్తున్నారు. అమరావతి రైతులు కూడా ఇష్టంగానో, అయిష్టంగానో తమ భూముల ధరలు కూడా పెరుగుతాయనే ప్రభుత్వానికి అప్పగించారు. విశాఖపట్టణంలో చేస్తున్నది తప్పు కానప్పుడు.. అమరావతిలో చేసింది ఎలా తప్పు అవుతుంది? పేదల ఇళ్ల నిర్మాణం వల్ల భూముల ధరలు పెరుగుతాయని విశాఖ రైతులు నమ్ముతున్నప్పుడు అమరావతి నిర్మాణం జరిగితే తమ భూముల ధరలు పెరుగుతాయని అక్కడి రైతులు ఆశించడంలో తప్పు ఏముంది? అయినా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న రైతులపై జగన్‌ సేవకులు తమ రాతల్లో కూడా తూలనాడుతున్నారు.

 

దావోస్‌లో ఆంధ్రప్రదేశ్‌ గురించి ఎగతాళిగా మాట్లాడుతున్న విషయాన్ని ఏపీకి చెందిన ఒక అధికారి వద్ద ప్రస్తావించగా.. ‘‘దావోస్‌ దాకా ఎందుకు.. ప్రభుత్వ పనులపై ఢిల్లీ వెళితే కేంద్ర ప్రభుత్వంలోని జూనియర్‌ అధికారులు కూడా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. జరుగుతున్న అనర్థం కళ్లెదుట కనిపిస్తున్నా.. ‘‘జగన్మోహన్‌రెడ్డి వంటి డైనమిక్‌ లీడర్లను చూడలేదు’’ అని ప్రశంసించేవారు కూడా ఉండటం విశేషం! ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొత్తలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన పక్కనే కూర్చొని కనిపించిన ప్రధాన సలహాదారుడు అజేయ కల్లం రెడ్డి ఇప్పుడు కనిపించడం లేదు.

 

సమీక్షా సమావేశాలలో చివరి వరుసలో కూర్చుంటున్నారట! బహుశా ఆయనకు తత్వం బోధపడి ఉంటుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అంతఃపురంలో తచ్చాడుతుండే ఒకాయనను.. ‘‘ఏపీలో ఎలా ఉంది?’’ అని హైదరాబాద్‌లో ఉండే ఒక పెద్దమనిషి ప్రశ్నించగా.. ‘‘ఏమి జరుగుతున్నదో ఇంట్లో ఉండే మాకే అర్థంకావడం లేదు’’ అని నిర్వేదం వ్యక్తంచేశారట. ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా కనీసం ఆలోచన కూడా చేయని జగన్‌ అండ్‌ కో 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా అనిపించడం లేదా ఇప్పుడు? జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన సమయాన్నంతా ప్రత్యర్థులపై పగ–ప్రతీకారాలను తీర్చుకోవడానికే వినియోగిస్తున్నారు.

 

అందుకే రద్దుల ముఖ్యమంత్రిగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతీకారేచ్ఛకు తాజాగా శాసనమండలి బలి అవుతోంది. రాజధానుల వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారన్న కోపంతో ఉన్నపళంగా శాసనమండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. శాసనమండలి అవసరం నిజంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు గానీ, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఎంచుకున్న కారణం, సమయం మాత్రం ఆక్షేపణీయంగా ఉన్నాయి అని చెప్పక తప్పదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా శాసనసభ సమావేశాలనే బహిష్కరించిన జగన్మోహన్‌రెడ్డి.. ఇంతకంటే ఉన్నతంగా ఆలోచిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.

 

తల దించుకోవలసిందే!

ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. దీన్నే అభివృద్ధి అని ప్రజలను నమ్మమంటోంది. ప్రభుత్వ ఆదాయం సరిపోక అప్పులు కూడా చేస్తూ నవరత్నాలు అమలుచేస్తున్న జగన్మోహన్‌రెడ్డి బలమైన ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకుంటున్నానని నమ్ముతున్నారు గానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. గడిచిన ఎనిమిది మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 60 వేల కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. ఇందులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా ఉన్నారు. మహాభారత కాలంలో ధర్మరాజు దానధర్మాలు అధికంగా చేశారు. తనకంటే దానకర్ణులు, దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు ఎవరూ ఉండరని ఆయన అభిప్రాయపడుతుండేవారు.

 

ఇది ఆయనను అహంకారిగా మార్చే ప్రమాదముందని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుని మహాబల చక్రవర్తి పాలించే రాజ్యానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇంటికి వెళ్లి మంచినీళ్లు కావాలని కోరగా.. వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది ఆ ఇంటి ఇల్లాలు. నీళ్లు తాగిన తర్వాత ఆ బంగారు గ్లాసును ఆమె బయటకు విసిరేసింది. ధర్మరాజు ఆశ్చర్యపోయి ‘‘బంగారాన్ని దాచుకోవాలి గానీ, వీధిలో పడేస్తే ఎలా?’’ అని ప్రశ్నించగా.. ‘‘మా రాజ్యంలో ఒకసారి వాడిన వస్తువును మళ్లీ వాడం’’ అని బదులిచ్చి ఆమె లోనికి వెళ్లిపోయింది. తర్వాత ఇరువురూ అక్కడి నుంచి బయలుదేరి మహాబల రాజును కలిశారు.

 

ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తిగా ధర్మరాజును కృష్ణుడు పరిచయం చేశాడు. అయినా ఆయన ధర్మరాజు ముఖం కూడా చూడకుండా.. ‘‘కృష్ణా! మీరు చెప్పింది సరే గానీ.. మా రాజ్యంలో ప్రజలందరికీ చేతి నిండా పని ఉంది. మా ప్రజలకు కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇక్కడ భిక్షం స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల దానధర్మాలకు ఈ రాజ్యంలో తావులేదు’’ అని మహాబల రాజు వివరించాడు. ‘‘ధర్మరాజు రాజ్యంలో పేదలు ఎక్కువగా ఉన్నారేమో.. అందుకే దానధర్మాలపై ఆశ పడుతున్నట్టు ఉంది. అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ధర్మరాజు ముఖం చూడటానికి సిగ్గుపడుతున్నాను’’ అంటూ ఆయన ముగించాడు. దీంతో ధర్మరాజు తలదించుకున్నాడు.

 

ఉచితాల పేరుతో ప్రజలను సోమరులుగా తయారుచేయకూడదన్న నీతి ఇందులో ఉందన్న విషయం జగన్మోహన్‌రెడ్డి వంటివాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారో? ప్రజలను ఉచితాలకు అలవాటు చేసిన దేశం, రాష్ట్రం ఎప్పటికైనా తలదించుకోవలసిందే! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇలా లేదంటారా?

 

ప్రశాంత్‌ కిశోర్‌.. పశ్చాత్తాపం!

అంతెందుకు.. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘గత ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవాల్సింది కాదు. కానీ నేను నా వ్యూహంతో ఎన్నికల వాతావరణాన్ని జగన్‌కు అనుకూలంగా మలిచాను’’ అని ఆయన పలువురి వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతోపాటు చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేష భావాన్ని వ్యాపింపజేయడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నారు.

 

‘‘జగన్మోహన్‌రెడ్డి పాలన ఇలా ఉంటుందని అనుకోలేదు. నేను చంద్రబాబుకే కాదు,ఆంధ్రప్రదేశ్‌కు కూడా అన్యాయం చేశాను’’ అని ఆయన ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారట. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిపై అవినీతిపరుడు, మూర్ఖుడు, మొండివాడు, అసమర్థుడు వంటి విమర్శలు ఉండేవి గానీ, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి తరహాలో ‘తుగ్లక్‌’ అనే బిరుదును మాత్రం ఎవరూ సొంతం చేసుకోలేదు. మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ మళ్లీ పుట్టాడు అని జాతీయ మీడియాలో జగన్మోహన్‌రెడ్డిని అభివర్ణిస్తున్నారు. పురాణాల్లో ప్రతినాయకుడి పాత్రలన్నీ దేవుడిచ్చిన వరాలతో విర్రవీగుతూ చివరకు దైవాన్నే ఎదిరించే సాహసానికి పూనుకునేవని మనం చదువుకున్నాం.

 

ఇప్పుడు ఆధునిక భారతంలో జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రజలిచ్చిన అధికారంతో ఆ ప్రజలకే కీడు చేయబూనుకుంటున్నారు. పేద ప్రజలకు మేళ్లు చేస్తున్నామని చెబుతూ రాష్ట్రాన్ని కోలుకోకుండా చేస్తున్నారు. అధికారంలోకి రావడానికై ఎన్నికల సందర్భంగా తాయిలాలను ప్రకటించకూడదని తాజా ఆర్థిక సర్వే సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు పెట్టుబడులకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తూ, మరోవైపు అడ్డూ అదుపూ లేని తాయిలాలకు తెర తీశారు. దీంతో ఏపీలో నెలకొన్న పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికై తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. హైదరాబాద్‌ మహా నగరం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తోంది.

 

ఇంకొకవైపు జీఎన్‌ రావు కమిటీ సిఫారసుల పుణ్యమా అని తనంతట తానుగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి కూడా దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. దూరదృష్టి లేని పాలకుల వల్ల ఎంత అనర్థం జరుగుతుందో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే జరుగుతోంది. దీనికితోడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కేసుల భయం వెంటాడుతోంది. ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావలసి ఉన్న ఆయన.. తనకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. పదవిలో ఉండగా అనేక మంది ముఖ్యమంత్రులు కేసులకు హాజరయ్యారు, అవుతున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు పి.వి.నరసింహారావు ఒక కేసులో సాక్షిగా కోర్టుకు హాజరుకావలసి వచ్చింది.

 

మాజీ ప్రధానిగా కోర్టులకు తిరగవలసి వచ్చింది. ఇక సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా ఆయన నైజానికి నిదర్శనమనే చెప్పాలి. వివేకా ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి కూడా జగన్‌ ప్రభుత్వంపై నమ్మకం లేదని హైకోర్టుకు తెలిపారు. వ్యక్తులు, సంస్థల పట్ల జగన్‌కు ఉండే కక్ష ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఐ.ఆర్‌.ఎస్‌. అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం! 2014లో తాను అధికారంలోకి రాకుండా ఓడించిన ప్రజలపై కూడా జగన్మోహన్‌రెడ్డిలో అంతర్లీనంగా కోపం ఉందేమో తెలియదు గానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి చూస్తుంటే కావొచ్చును అన్న అభిప్రాయం కలుగుతోంది. కాబట్టి ఆంధ్రుడా మేలుకో! ఇప్పటికైనా మేలుకో!! 

ఆర్కే

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.