14 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీకి ఒప్పందాలు

ABN , First Publish Date - 2022-05-25T09:01:23+05:30 IST

గ్రీన్‌ ఎనర్జీ రంగంలో 14వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

14 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీకి ఒప్పందాలు

రూ.65వేల కోట్ల పెట్టుబడి, 18వేల మందికి ఉద్యోగాలు

దావోస్‌లో మూడోరోజూ పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ


అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ ఎనర్జీ రంగంలో 14వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.65వేల కోట్ల పెట్టుబడి, 18వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. దావో్‌సలో మూడోరోజు(మంగళవారం) సీఎం జగన్‌రెడ్డి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఆరువేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వంతో అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.


ఇందులో 2వేల మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు ఉంటాయి. ప్రస్తుతం కాకినాడ సెజ్‌లో సదుపాయాలను వినియోగించుకుని ఈ ప్రాజెక్టులను అరబిందో చేపట్టనుంది. రూ.28వేల కోట్ల పెట్టుబడితో 8వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, అరబిందో డైరెక్టర్‌ పి.శరత్‌చంద్రారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మరో 8వేల మెగావాట్ల కర్బన రహిత విద్యుత్‌ ఉత్పత్తికి గ్రీన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో వెయ్యి మెగావాట్ల పంప్ట్‌ స్టోరేజి ప్రాజెక్టు, ఐదువేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 2వేల మెగావాట్ల విండ్‌ ప్రాజెక్టు ఉన్నాయి. దీనికి రూ.37వేల కోట్ల పెట్టుబడి పెడతారు. దాదాపు 10వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మరోవైపు ఏస్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ సంస్థ మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ సాయంతో పారిశ్రామిక తయారీ జోన్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. గ్రీన్‌ ఎనర్జీ సాయంతో ఈ సెజ్‌లో పారిశ్రామిక ఉత్పత్తి చేస్తారు. సీఎం జగన్‌రెడ్డితో ఆదిత్య మిట్టల్‌ కూడా సమావేశమయ్యారు. ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పల్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఈవోగా ఉన్న ఆయన విశాఖలో ఇప్పటికే ఉన్న తమ పెల్లెట్‌ తయారీ ప్లాంటును రూ.వెయ్యికోట్లతో విస్తరించేందుకు ఒప్పందం కుదు ర్చుకున్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక వేదిక ‘కాంగ్రెస్‌ సెంటర్‌’లో బహ్రెయిన్‌ ఆర్థికమంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఎగుమతులు, విద్యారంగం పెట్టుబడులపై చర్చించారు. సెకోయ క్యాపిటల్‌ ఎండీ రంజన్‌ ఆనందన్‌తో స్టార్టప్‌ ఎకో సిస్టం అభివృద్ధిపై చర్చించారు. ష్నైడర్‌ ఎలక్ర్టిక్‌ సంస్థ ఉపాధ్యక్షుడు లుక్‌ రెమంట్‌తో సీఎం భేటీ అయ్యారు. దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చేవిధంగా ఏపీని ఉత్పత్తి కేంద్రంగా చేసుకోవడంపై చర్చించారు. ఏపీ పెవిలియన్‌లో జుబిలియంట్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు కాళీదాస్‌ హరిభర్తియాతో సీఎం జరిపిన భేటీలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై చర్చించారు. హైడ్రోజన్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుపై రెన్యూ పవర్‌ వ్యవస్థాపకుడు సుమంత్‌ సిన్హాతో; టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాలపై ఐబీఎం చైర్మన్‌ అరవింద్‌ కృష్ణతో సీఎం చర్చించారు. 

Updated Date - 2022-05-25T09:01:23+05:30 IST