చెవిలో పూలు

ABN , First Publish Date - 2022-08-16T09:53:30+05:30 IST

మాట్లాడేందుకు వేదిక ఉంది! వినేందుకు జనం ఉన్నారు. కొంతమందైనా నమ్మకపోతారా అనే నమ్మకం ఎటూ ఉంది

చెవిలో పూలు

  • ‘ఆజాదీ’లోనూ జగన్‌ అబద్ధాలు.. 
  • పంద్రాగస్టు ప్రసంగంలో గొప్పలు
  • కొత్త జిల్లాలు, సచివాలయాలపై ఆర్భాటం
  • కానీ, మౌలిక వసతులు కల్పించకుండా నరకం
  • ఇంగ్లిషు మీడియం, రాజధానులపై గప్పాలు
  • గతంలో ఆంగ్ల మాధ్యమం లేదనేలా వాదన
  • కోర్టు మొట్టికాయల విషయం దాచిన వైనం
  • బడుగుల ప్రత్యేక పథకాలు మాయం
  • వారిని ఉద్ధరించేశామంటూ ఊకదంపుడు 
  • చేయనివి చేసినట్లు మసిపూసి మారేడుకాయ
  • విఫల ప్రయత్నాలనూ పురోగతిగా ప్రచారం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): మాట్లాడేందుకు వేదిక ఉంది! వినేందుకు జనం ఉన్నారు. కొంతమందైనా నమ్మకపోతారా అనే నమ్మకం ఎటూ ఉంది! అందుకే కాబోలు... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనేక అసత్యాలు, అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ‘పంద్రాగస్టు’ ప్రసంగం చేశారు. ఆచరణలో ఏం జరుగుతోందో  చెప్పకుండా, సమస్యలను మాటమాత్రం ప్రస్తావించకుండా, కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా... తాను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేశారు.   మూడేళ్లలో చేసినవి రాష్ట్ర ప్రజలకు నివేదించి.. చేయాల్సినవాటికి సంకల్పం తీసుకునే ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’ సభలోనూ ప్రతిపక్షాలు, మీడియాపై విషం కక్కారు. అన్ని  సమస్యలకు చంద్రబాబు కారణంకాగా... అన్ని అద్భుతాలను తానే చేసినట్లుగా గొప్పలు చెప్పారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జగన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన ప్రస్తావించిన పలు అంశాలు... అసలు వాస్తవాలు ఇవి!

జగన్‌ మాట: భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించే పరిస్థితికి గత మూడేళ్లకాలంలో సమాధానమిచ్చాం.

వాస్తవం: జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ ఇసుక తుఫాను రేపిన కల్లోలం రాష్ట్రమంతా చూసింది. కొత్త ఇసుక విధానం పేరుతో ఇసుక సరఫరాను నిలిపి వేసి కార్మికులకు చుక్కలు చూపించారు. ప్రధానంగా పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు తమకున్న ఆస్తులను అమ్ముకుని బాకీలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభు త్వం పట్టణాల్లో సుమారు ఎనిమిది లక్షల టిడ్కో ఇళ్లను నిర్మించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్ల పాటు పట్టించుకోకపోవడంతో ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటిని పూర్తి చేసి ఇచ్చేందుకే జగన్‌ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. 


కొత్తగా ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇచ్చిన దాఖలాల్లేవు. అలాంటప్పుడు భవన నిర్మాణ కార్మికులు నివసించే గుడిసెల స్థానంలో ఇళ్లు ఎక్కడ ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు?

జగన్‌ మాట: ప్రతి నెల ఒకటో తేదీన సూర్యోదయానికి  ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపుతట్టి చిరునవ్వుతో... ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.7 లక్షల మంది వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ ఏర్పాటు చేశాం! 

వాస్తవం: పింఛనుదారులు ఒక నెలలో ఏదైనా కారణంగా తీసుకోలేకపోతే ఆ నెల పెన్షన్‌ వదులుకోవాల్సిందే! పోర్టబులిటీని కూడా రద్దు చేశారు. సామాజిక పెన్షన్‌ను టీడీపీ ప్రభుత్వం రూ.2 వేలకు పెంచింది. దీనికి మరో వెయ్యి కలిపి.. మొత్తం మూడు వేలు అందజేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి  రాగానే... విడతల వారీగా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అందులోనూ మళ్లీ మోసమే. మొదటి రెండేళ్లు రూ.250 మాత్రమే పెంచారు. ఈ ఏడాది జనవరి నుంచి మరో రూ.250 పెంచారు. ఆరంచెల వడపోత విధానం అమల్లోకి తెచ్చి ప్రతి నెల కొన్ని వందల మంది పెన్షన్లును కోసేస్తున్నారు.

జగన్‌ మాట: ప్రభుత్వ బడికి వెళ్లే పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంలోనే చదవక తప్పని పరిస్థితికి సమాధానం చెప్పాం. 

వాస్తవం: గత ప్రభుత్వం తెలుగుతోపాటు ఇంగ్లీషు మీడియం కూడా ఏర్పాటుచేసింది. ఏ మాధ్యమం చదవాలనే ఆప్షన్‌ను విద్యార్థులకు వదిలేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియం విషయంలో ఏకపక్షంగా ముందుకెళ్లింది. ఇంగ్లీషు మాధ్యమాన్ని బలవంతంగా రుద్దాలని విఫలయత్నం చేసింది. కోర్టులో మొట్టికాయలు వేయించుకుంది. 


జగన్‌ మాట: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కులాలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడలకు సమాధానమిచ్చాం. 

వాస్తవం: గతంలో దళితులు, బడుగులకు న్యా యంగా వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలు అందేవి. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వారికి దక్కాల్సిన ప్రయోజనాలను కూడా ‘నవరత్నా’ల్లో కలిపేసి అందరికీ ఇచ్చినట్టే ఇవ్వడం మొదలుపెట్టారు. కేంద్రప్రభుత్వం నుంచి వారికి వస్తున్న నిధులను మళ్లించి స్వయంఉపాధి లేకుండా నడ్డివిరిచారు. పేద విద్యార్థులకు అవసరమైన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌, విదేశీ విద్యలను అటకెక్కించారు. సంక్షేమ హాస్టళ్లకు బడ్జెట్‌ తగ్గించి పేద పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ప్రస్తుతం అన్నీ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఉద్యమిస్తున్నాయి. 


జగన్‌ మాట: వైద్యం ఖర్చు భరించలేక, అప్పులపాలై అమ్ముకునేందుకు ఏమీ లేక నిస్సహాయంగా చనిపోయే పరిస్థితికి సమాధానం చెప్పాం. 

వాస్తవం: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు తెచ్చి ప్రజల్లో కీర్తిని మూటగట్టుకున్నారు. చంద్రబాబు వాటిని కొనసాగించారు. జగన్‌ కూడా వాటిని ఇంకా మెరుగ్గా కొనసాగిస్తారని మొదట్లో అందరూ భావించారు. కానీ, ఆయన తీరు వేరుగా ఉన్నట్టు త్వరలోనే గ్రహించేశారు. రెండు వేల జబ్బులను ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చామని గొప్పగా చెప్పారు. కానీ, అందులో ఉన్న జబ్బులకు ‘సీఎంఆర్‌ఎఫ్‌’ ఇవ్వకుండా నిలిపేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు ఏళ్ల తరబడి నిలిపేయడంతో రోగులను ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలోకి కూడా రానీయడం లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం రాష్ట్రంలో దుర్లభంగా మారింది. 


జగన్‌ మాట: చదువులకు అయ్యే ఖర్చు భరించలేక పిల్లల్ని చదువులు మాన్పించి పనిలో పెట్టాల్సివస్తే తల్లి హృదయం తల్లడిల్లే, ఎస్సీల్లో 36 శాతం, ఎస్టీల్లో 51 శాతం నేటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోయే పరిస్థితికి సమాధానం చెప్పాం. 


వాస్తవం: టీచర్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న దూకుడు నిర్ణయాలతో విద్యావ్యవస్థ కుంటుపడింది. రేషనలైజేషన్‌ పేరుతో ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో స్కూళ్లను పిల్లలకు దూరం చేశారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ హాస్ట ళ్లు రెసిడెన్షియళ్లుగా మారడం, అవి గ్రామాలకు దూరంగా ఉండటంతో ఆ సామాజికవర్గాల పిల్లల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సరైన ప్రణాళికలు లేకుండా నాడు-నేడు పేరుతో మరమ్మతులు చేసిన ప్రాథమిక స్కూలు భవనాలు.. సర్కారు పిచ్చి విలీన విధానాలతో పిల్లలు లేక నిరుపయోపంగా పడిఉన్నాయి. 

 

జగన్‌ మాట: మనలో సగం జనాభాగా ఉన్న అక్కచెల్లెమ్మలకు అదే దామాషాలో ఉద్యోగాలు, పదవులు, చట్ట సభ స్థానాలు కేటాయించని పరిస్థితికి సమాధానమిచ్చాం. 


వాస్తవం: కార్పొరేషన్లలోను, స్థానిక ఉద్యోగాల్లో  మహిళలకు రిజర్వేషన్‌ అమలుచేస్తామని చెప్పడమేగానీ.. చేసిందేమీ లేదు. నామినేషన్‌ పనుల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని చట్టం చేశారు. కానీ, రాష్ట్ర వ్యా ప్తంగా ఒక్క మహిళకైనా పని ఇచ్చినట్టు చెప్పగలరా? స్థానికులకు పరిశ్రమల్లో  రిజర్వేషన్లు కల్పించాలన్న వైసీపీ ప్రభుత్వం చేసిన చట్టం అడవిగాచిన వెన్నెలే అయింది. ఎక్కడా స్థానికులకు, మహిళలకు పరిశ్రమలు రిజర్వేషన్లు అమలు చేసిన సందర్భాలే లేవు. చట్టం ఉల్లంఘించిన పరిశ్రమలపై చర్యలూ లేవు.


జగన్‌ మాట: రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉంటే, కొత్తగా మరో 16 నిర్మిస్తున్మాం. 

వాస్తవం: 16 బోధనాస్పత్రులకు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కానీ... నిధులు అందుబాటులో లేక కాలేజీల నిర్మాణం పడకేసింది. అవి ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి.


జగన్‌ మాట: ప్రతి రెండు వేలమందికి పౌరసేవలు అందించే గ్రామ/వార్డు సచివాలయం, అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్నివిధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ గ్రంథాలయాలు... ఇవన్నీ మూడేళ్లలో మనం తీసుకొచ్చిన మార్పులు!  

వాస్తవం: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభంలో అందరూ స్వాగతించారు. గ్రామాలకు ఈ వ్యవస్థ మేలు చేస్తుందని భావించారు. అయితే జరుగుతున్నది వేరు. సచివాలయాల వ్యవ స్థ తీసుకురావడం ద్వారా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గ్రామ, వార్డ్‌ సచివాలయ ఉద్యోగులను నియమించి ఊరుకున్నారు. వారికి అందించాల్సిన మౌలిక వసతులు, సంక్షేమం విషయం పట్టించుకోలేదు. ప్రభుత్వ తొందరపాటు, అనాలోచిత విధానాల వల్ల వాళ్లందిస్తామన్న 500కుపైగా సేవలు అందడం లేదు.  నిధులు మంజూరు కాకపోవడంతో  సచివాలయ భవనాల, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల పని పునాది దగ్గరే ఆగిపోయింది.

Updated Date - 2022-08-16T09:53:30+05:30 IST