సీఎం జగన్‌లో ఎట్టకేలకు మార్పు!

ABN , First Publish Date - 2021-07-19T21:08:22+05:30 IST

మాస్క్..మనుషుల జీవితాల్లో కరోనా తెచ్చిన ప్రాథమిక మార్పులో ఇదీ ఒకటి. మాస్క్ ధరంచకపోతే కరోనా వైరస్‌ను ఆహ్వానించినట్టేనని వైద్యులు చెబుతున్నారు.

సీఎం జగన్‌లో ఎట్టకేలకు మార్పు!

అమరావతి: మాస్క్..మనుషుల జీవితాల్లో కరోనా తెచ్చిన ప్రాథమిక మార్పులో ఇదీ ఒకటి. మాస్క్ ధరంచకపోతే కరోనా వైరస్‌ను ఆహ్వానించినట్టేనని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన ఎక్కువే. అయితే.. ఏదో నిర్లక్ష్యం! ఇప్పటికీ ఎంతో మంది మాస్కులు లేకుండానే కనిపిస్తుంటారు. రాజకీయనాయకుల్లోనూ ఇదే తంతు కనిపిస్తుంటుంది. సాధారణ రాజకీయ నాయకులు సరే.. మార్గదర్శకులుగా నిలవాల్సిన ఉన్నతస్థాయి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మాస్కులు లేకుండా కనిపిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుంటారు.


ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా పలు మార్లు మాస్కు లేకుండానే కనిపించి విమర్శల పాలయ్యారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కూడా ఆయన మాస్క్ ధరించలేదు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర అభివృద్ధిపై అధికారులతో సమీక్షలు, పత్రికాసమావేశాలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నప్పుడు మాస్క్ ధరించలేదు. నీతులు, నియమాలు, పద్ధతులు, ప్రకటనలు, పథకాలు అబ్బొబ్బో ఒకటా, రెండా జగన్ అంటేనే వరాల జల్లు అనుకోవాలి జనం. అలా ఉంటారు ఆయన. మహా..మహా దేశాధినేతలే మాస్కులు పెట్టుకు తిరుగుతున్నా కరోనా రోజుల్లో కూడా జగన్ మాస్క్ పెట్టుకోలేదు.


ఏ మీటింగ్ పెట్టినా అధికారులంతా మాస్క్ పెట్టాలే గానీ జగన్ మాత్రం మాస్క్ పెట్టుకోరు. పైగా కరోనాపై సమీక్షల సందర్భంలోనూ మాస్క్ పెట్టరు. ‘‘నేను పటిష్టమైన భద్రత మధ్య ఉన్నాను.. నాకు కరోనా రాదు’’ అనుకున్నారో ఏమో.. ఈ రెండేళ్లలో ఆయన మాస్క్ పెట్టుకుని కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఏమయిందో ఏమోగాని ఆయన సోమవారం పోలవరం పర్యటనలో మాత్రం మాస్క్ పెట్టుకుని అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. సీఎం జగన్‌లో వచ్చిన ఈ సడెన్ మార్పు మంచిదే అంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-07-19T21:08:22+05:30 IST