జగన్‌ మాయలు!

Published: Sun, 30 Jan 2022 00:22:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జగన్‌ మాయలు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కొత్త జిల్లాల ఏర్పాటు సరిపోతుందో లేక మరో కొత్త సమస్యను తెర మీదకు తెస్తారో చూడాలి. ఎందుకంటే ఒక సమస్య నుంచి గట్టెక్కడానికి మరో సమస్యను సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారింది కనుక ఇలా భావించవలసి వస్తోంది. ఈ మధ్యకాలంలో సినిమా టికెట్ల ధరలను అమాంతం తగ్గించడం ద్వారా చిత్ర పరిశ్రమలో అలజడి సృష్టించారు. సమస్య పరిష్కారానికి చిరంజీవి వంటి వారు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన చిరంజీవి విందు ఆరగించి వచ్చారే కానీ, ప్రభుత్వం మాత్రం ఇంతవరకు సానుకూలంగా స్పందించలేదు. ఈ దశలో సంక్రాంతి పండుగ రావడం, గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏకంగా కేసినో నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు, మీడియా గగ్గోలు పెట్టినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. కేసినోకు సంబంధించిన దృశ్యాలు విస్తృతంగా ప్రసారం అయినప్పటికీ పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ స్పందించలేదు. ఇంతలో పీఆర్సీ వివాదం ముదిరి ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. దీంతో కేసినో వ్యవహారం తెర వెనక్కు పోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన ప్రధాన సమస్యగా మారడంతో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ హడావుడిగా నిర్ణయం తీసుకుని గెజిట్‌ జారీ చేశారు. దీంతో జనం దృష్టి అటువైపు మళ్లింది. హేతుబద్ధత లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే కొత్త జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని విమర్శలు వచ్చినా ప్రభుత్వం యథావిధిగా నోరు మెదపడం లేదు. కొత్త జిల్లాల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర రాజధాని అమరావతినే కీళ్లు విరిచి మూలన పడేసినా నోరు మెదపని సమాజం గనుక జగన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఆందోళనలను కూడా పట్టించుకోవడం లేదనుకోవాలి. నిజానికి జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఉండదు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు అంతగా ఉండడం లేదు. అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు పాలన అని చెప్పుకోవడంలో అర్థం లేదు. ఉమ్మడిరాష్ట్రంలో ఎన్‌.టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల అప్పట్లో ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణలో పది జిల్లాలను విడగొట్టి 33 జిల్లాలను చేశారు. దీనివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు. కొన్ని మరీ చిన్న జిల్లాలు కావడంతో వాటి పేర్లు కూడా ప్రాచుర్యంలోకి రాలేదు. అధికారులకు కొరత ఏర్పడటంతో కనీస అనుభవం లేని వారిని కూడా జిల్లా కలెక్టర్లుగా నియమించాల్సి వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్‌ వంటి వెసులుబాటు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో అంతకుముందు క్రమం తప్పకుండా జరిగే సమావేశాలకు ముఖ్యమంత్రులు స్వస్తి చెప్పారు. ఈ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లో హడావుడిగా కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు. అయితే జగన్‌రెడ్డి నిర్ణయాలతో కేసినో వ్యవహారంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రి కొడాలి నానికి మాత్రం ఉపశమనం లభించింది. తాను ఏమి చేసినా పేదప్రజల కోసమే అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, కేసినోల నిర్వహణ కూడా పేదల కోసమే అని చెబుతారేమో తెలియదు. గుడివాడలో మూడురోజుల పాటు నిర్వహించిన కేసినో వల్ల 250 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని వార్తలు వచ్చాయి. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా ప్రజల వద్ద డబ్బు పుష్కలంగా ఉందని స్పష్టమవుతోంది. అదనపు ఆదాయం కోసం ప్రజలపై రకరకాల పన్నులు విధిస్తున్న జగన్‌ సర్కార్‌, ఇకపై ప్రతి నియోజకవర్గంలో కేసినో నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తే ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరే అవకాశం లేకపోలేదు. జగన్‌రెడ్డికి ఈ ఆలోచన ఇంకా ఎందుకు రాలేదో! కేసినోల నిర్వహణకు అనుమతిస్తే సొంత పార్టీ వారు బాగుపడడమే కాకుండా ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తీరతాయన్న వాదనను తెర మీదకు తెచ్చే తెంపరితనం ప్రభుత్వ పెద్దలకు ఉండనే ఉంది. మొత్తానికి కేసినో వ్యవహారం నుంచి మంత్రి కొడాలి నానిని కాపాడడంలో ముఖ్యమంత్రి సక్సెస్‌ అయ్యారు. సమస్య ఎంత తీవ్రమైనది అయినా పెద్దగా పట్టించుకోని సమాజం కనుక కేసినో వ్యవహారం కూడా తాటాకుమంటలా చల్లారిపోయింది. ప్రతిపక్షాలు ఏదైనా సమస్యను అందిపుచ్చుకునే లోపు ప్రభుత్వమే మరో సమస్యను లేదా వివాదాన్ని సృష్టిస్తున్నది. దీంతో ప్రతిపక్షాలకు ఆయాసమే మిగులుతోంది.


చింతామణిపై నిషేధం వెనుక...

నిజానికి జగన్‌రెడ్డి ఆలోచనలు అనూహ్యంగా ఉంటాయి. వివిధ సమస్యలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో చింతామణి నాటకాన్ని నిషేధిస్తున్నట్టు ఆయన ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరానికి చింతామణి నాటకం గురించే తెలియదు. అలాంటిది ఎవరూ కోరకుండానే ఈ నాటకాన్ని నిషేధించారు. నాటకాలు ఆదరణ కోల్పోయి, వాటినే నమ్ముకున్న కళాకారులు అనేక కష్టాలు పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ విషయం మాత్రం పట్టించుకోదు. చింతామణి నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర వల్ల వైశ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎవరో చెప్పారని ఈ నాటకాన్ని నిషేధించారు. నాటక ప్రదర్శనే జరగనప్పుడు ఎవరివో మనోభావాలు దెబ్బతినడం ఏమిటో అర్థం కాని విషయం. ఒంగోలులో సుబ్బారావు గుప్తాను సొంతపార్టీ వాళ్లే కొట్టడంపై వైశ్యులు ఆగ్రహంగా ఉన్నారు. వైశ్యులకు పెద్ద దిక్కు అయిన కొణిజేటి రోశయ్య ఇటీవల కాలం చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆయన భౌతికకాయాన్ని దర్శించి నివాళులు అర్పించడానికి కూడా వెళ్లలేదు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా సేవలందించిన రోశయ్య రాజకీయాలలోని నిన్నటి తరానికి, నేటి తరానికి మధ్య వారధిగా ఉండేవారు. వైశ్యులకు మాత్రమే కాకుండా ఈతరం రాజకీయ నాయకులకు కూడా ఆయన పెద్ద దిక్కుగా ఉండేవారు. ఈ కారణంగానే పార్టీలతో నిమిత్తం లేకుండా పలువురు నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. తండ్రి రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత తనకు దక్కవలసిన ముఖ్యమంత్రి పదవిని రోశయ్య తన్నుకుపోయారన్న కోపం జగన్‌రెడ్డిలో ఉండిందని చెబుతారు. అందుకే కాబోలు రోశయ్య మరణించినా ఆయన పట్టించుకుని ఉండకపోవచ్చు. రోశయ్యను గౌరవించని జగన్‌పై వైశ్యులు ఆగ్రహంగా ఉన్నారు. వారిని చల్లబరచడం కోసం చింతామణిని నిషేధించాలన్న నాటకానికి ముఖ్యమంత్రి తెర తీశారు. ప్రజలు ఎవరూ కోరకపోయినా కొన్ని విషయాలలో హడావుడిగా నిర్ణయాలు తీసుకునే జగన్‌రెడ్డి, ప్రజలు అడిగితే మాత్రం చెయ్యరు. ఎవరూ అడగకుండానే సినిమా టికెట్‌ ధరలు తగ్గించారు. ఇటీవల కాలంలో వైశ్యులు పెద్దగా కోరకుండానే చింతామణి నాటకాన్ని నిషేధించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఇంతే. ప్రజలు నెత్తీనోరూ బాదుకుంటున్నప్పటికీ ఓటీఎస్‌, చెత్తపన్ను వంటి వాటిని మాత్రం రద్దు చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయం కూడా ఈ కోవలోకే వస్తుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇదే ఉద్యోగులు జగన్‌రెడ్డిని నెత్తికెత్తుకున్నారు. తొలిసారి సచివాలయానికి వచ్చినప్పుడు పూలవర్షం కురిపించి, పోటీ పడి మరీ స్వీట్లు తినిపించారు. కోరకపోయినా 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించి సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి తరలిరావడానికి సకల సౌకర్యాలు కల్పించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మొహం మొత్తి జగన్‌రెడ్డికి జై కొట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 27 శాతం తాత్కాలిక భృతి ప్రకటించిన జగన్‌రెడ్డి, పీఆర్సీ విషయానికి వచ్చినప్పుడు 23 శాతానికి మించి ఇచ్చేది లేదని భీష్మించుకోవడం, హెచ్‌ఆర్‌ఏను కూడా తగ్గించడం ఉద్యోగులకు సహజంగానే మింగుడుపడటం లేదు. పాత డీఏ బకాయిలను కూడా కలుపుకుని 23 శాతం ఇస్తామని చెప్పడం ఉద్యోగులకు పుండు మీద కారం రాసినట్టయింది. ఉద్యోగసంఘాల నాయకులు మొదట్లో కొంత మెత్తబడినా కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో స్వరం పెంచాల్సి వచ్చింది. పీఆర్సీ అంటే వేతన సవరణ. ఐదేళ్లకు ఒకసారి నియమించే పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు జగన్‌రెడ్డి పాలనలో మొట్టమొదటిసారిగా అమలులో ఉన్న 27 శాతం తాత్కాలిక భృతి కంటే తక్కువ వేతనాలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే కొత్త పీఆర్సీ ప్రకారం తమకు జీతాలు చెల్లించవద్దని, పాత జీతాలనే చెల్లించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గొంతెత్తాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. వేతనాలు పెరగకపోగా తగ్గడం ఏమిటని ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు. ఉద్యోగసంఘాల నాయకులతో చర్చలు జరపడానికి నియమించిన మంత్రుల కమిటీ హెచ్చరికలు చేయడం మొదలుపెట్టింది. దీంతో ఉద్యోగసంఘాల నాయకులు కూడా స్వరం పెంచారు. చూసుకుందామంటే చూసుకుందామని ఇరువైపులా సవాళ్లు విసురుకునే పరిస్థితి. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, నిలదీసిన ప్రతిపక్షాల పైకి, ఇతరుల పైకి ప్రజలను ఉసిగొల్పిన విధంగానే ఇప్పుడు ఉద్యోగుల పైకి కూడా ప్రజలను ఉసిగొల్పే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రజలకు విస్తృతంగా కరపత్రాలను పంచిపెట్టారు. ఉద్యోగులు అడిగినవి అన్నీ ఇస్తే అమలులో ఉన్న ఏదో ఒక పథకాన్ని నిలిపివేయవలసి ఉంటుందని చెప్పడం ద్వారా లబ్ధిదారులను ఉద్యోగుల పైకి ఉసిగొల్పే ప్రయత్నం ముఖ్యమంత్రి మాటల్లో కనిపిస్తున్నది.


ఉద్యోగులతో పెట్టుకుని...

నిజానికి ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారిని ఉద్యోగులు వేధించడం పరిపాటే. ఈ కారణంగా వారిపై ప్రజల్లో సదభిప్రాయం ఉండదు. అంతమాత్రాన వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టవచ్చు అనుకుంటే పొరపాటే. వారు కూడా ప్రజల్లో భాగమే. ఉద్యోగులు వ్యతిరేకమైనంత మాత్రాన ఎన్నికల్లో జయాపజయాలను తారుమారు చేయలేరన్న ప్రచారానికి ప్రభుత్వానికి వత్తాసు పలికేవారు తెర తీశారు. ఇది వాస్తవం కాదు. ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఆ తర్వాత తగిన మూల్యం చెల్లించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1983లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పంచ్‌ కొట్టాలన్న నిబంధనను అప్పట్లో ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు. క్రమశిక్షణను కఠినంగా పాటింపజేయడం దగ్గరనుంచి వయోపరిమితిని 55 ఏళ్లకు తగ్గించడం దాకా వివిధ చర్యల వల్ల ఉద్యోగులు ఆగ్రహించారు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పైనే దాడి చేసినంత పనిచేశారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంగరక్షకులు అడ్డుపడి ఉండకపోతే ఎన్టీఆర్‌పై భౌతికంగా దాడి చేసేవారే. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఎన్టీఆర్‌ అర్ధంతరంగా అధికారం కోల్పోవలసి రావడం, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికి ఉద్యమంగా మారడంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయనే మళ్లీ విజయం సాధించడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీల పేరిట ఉద్యోగులలో భయాందోళనలు కలిగించారు. తనిఖీల సమయంలో కొంతమంది ఉద్యోగులను అక్కడికక్కడే సస్పెండ్‌ చేసేవారు. దీంతో ఉద్యోగుల్లో చంద్రబాబుపై కసి ఏర్పడింది. 2004లో జరిగిన ఎన్నికల్లో ఉద్యోగులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌లో కనీసం యాభై ఓట్లను చంద్రబాబుకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా వేశారు. దీనికితోడు పెన్షనర్లకు డీఏలు ఇవ్వడానికి అప్పట్లో చంద్రబాబు నిరాకరించారు. వారంతా ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. దీంతో 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఉద్యోగులను మంచి చేసుకోవడం కోసం అవసరానికి మించి మెతకవైఖరి ప్రదర్శించారు. అడిగినవీ, అడగనివీ కూడా ఇచ్చారు. అయినా 2019 ఎన్నికల్లో ఉద్యోగుల్లో అత్యధికులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. బహుశా ఈ కారణంగానే కావచ్చు ఉద్యోగుల విషయంలో మరీ మెతకగా ఉండాల్సిన అవసరం లేదని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి భావిస్తున్నట్టు ఉన్నారు. ఉద్యోగులకు ఎంత చేసినా సంతృప్తి చెందరని చంద్రబాబు విషయంలో రుజువైనందున తగ్గాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్టు అనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ వర్గాలను భయపెట్టి పాలించడానికి అలవాటుపడిన జగన్‌రెడ్డి ఉద్యోగుల విషయంలో కూడా అదే ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఉభయపక్షాల మధ్య పంతాలు, పట్టింపులు పెరిగిపోతున్నందున సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో చేతులు కలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగులు కూడా సమ్మెకు సమాయత్తమవుతున్నారు. దీన్నిబట్టి సమ్మె అంటూ జరిగితే అది ఉధృతంగానే ఉంటుంది. ప్రభుత్వం స్తంభించిపోతుంది. 


సమ్మెకు ఉసిగొల్పుతూ..

వాస్తవానికి పీఆర్సీతో సంబంధం లేకుండానే ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా జీతాలు సకాలంలో పడటం లేదు. పెన్షనర్లకు కూడా దశలవారీగా చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమలులో ఉన్న మధ్యంతర భృతిని కూడా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సగటు ఉద్యోగి భగ్గుమంటున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఉద్యోగులు మొండిగా వ్యవహరించడం ఏమిటని ప్రభుత్వం మండిపడుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ప్రభుత్వ పెద్దలే కారణమని, ఓట్ల కోసం తెచ్చిన పథకాల కోసం అప్పులు చేసి పంచిపెడుతున్నవారు తమకు వస్తున్న దాంట్లో కోత విధించడం ఏమిటని ఉద్యోగులు భావిస్తున్నారు. నిజానికి మధ్యంతర భృతి కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్‌ ఉండాలని ఉద్యోగులు కోరుకుంటారు. ప్రస్తుతం మాత్రం ఉద్యోగులు అది కూడా కోరుకోవడం లేదు. ఇప్పటిదాకా ఇస్తున్న 27 శాతం భృతినే ఫిట్‌మెంట్‌గా నిర్ణయించాలని కోరుతున్నారు. ఇందులో న్యాయం ఉంది. అయితే ప్రభుత్వ వాదనే వింతగా ఉంది. చట్టపరంగా రావాల్సిన డీఏ బకాయిలు అన్నింటినీ కలిపేసి మీకు జీతం తగ్గదు కదా అని వాదించడం వింతగా ఉంది. అధికారంలోకి వచ్చినప్పుడే మధ్యంతర భృతిని 27 శాతం కాకుండా 23 శాతమే అని చెప్పి ఉంటే ప్రస్తుత సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. ఇచ్చి వెనక్కి తీసుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఈ వాస్తవాలను మరుగున పరచి, ఉద్యోగుల డిమాండ్లను అంగీకరిస్తే అంత భారం పడుతుంది, ఇంత భారం పడుతుంది అని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నందున సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నట్టుగానే కనిపిస్తోంది. సమ్మె కాలానికి జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు కనుక ఆ మేరకు వెసులుబాటు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుండవచ్చు. జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి ప్రతి నెలా డబ్బు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఉద్యోగులు సమ్మెకు వెళితే ప్రభుత్వానికి ఈ బాధ తప్పుతుంది. జీతాల చెల్లింపులకు ప్రతి నెలా ఐదువేల కోట్ల రూపాయలు అవసరం. నెల రోజుల పాటు సమ్మె జరిగినా ప్రభుత్వానికి ఐదు వేలకోట్లూ మిగిలిపోతాయి. గతంలో సమ్మెలు జరిగినప్పుడు సమ్మె కాలాన్ని సెలవుగా ఆయా ప్రభుత్వాలు పరిగణించేవి. జగన్‌రెడ్డి ప్రభుత్వం అంత ఉదారంగా వ్యవహరిస్తుందా అన్నది అనుమానమే! సమ్మెకు సిద్ధపడుతున్న ఉద్యోగులు ఈ కోణంలో ఆలోచిస్తున్నారో లేదో తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులలో లంచాలు వచ్చే అవకాశం కొందరికే ఉంటుంది. అత్యధిక శాతం ఉద్యోగులు జీతాల మీద ఆధారపడి మాత్రమే జీవిస్తారు. గతంలో రెండునెలల వరకు సమ్మె జరిగిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడు ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత సమ్మె కాలానికి కూడా జీతాలు చెల్లించడానికి ప్రభుత్వాలు అంగీకరించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఉద్యోగులు సమ్మెకు వెళితేనే మంచిది అన్నట్టుగా జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఖరి ఉన్నందున ఉద్యోగ సంఘాల నాయకులే ఆచితూచి వ్యవహరించడం మంచిది. 27 శాతం మధ్యంతర భృతిని ఇప్పటికే చెల్లిస్తున్న ప్రభుత్వం, దాన్ని ఫిట్‌మెంట్‌గా నిర్ణయిస్తే అదనపు భారం పడదు. పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇవాళ కాకపోయినా రేపయినా చెల్లించాల్సిందే. అయినా ప్రభుత్వం 27 శాతాన్ని 23 శాతానికి కుదించడం అనే మెలిక పెట్టడం ద్వారా ఉద్యోగులు సమ్మెకు దిగేలా రెచ్చగొడుతోందా? అన్న అనుమానం కలుగక మానదు. జగన్‌రెడ్డికి ఇటువంటి తెలివితేటలకు కొరతేమీ లేదు. ఉద్యోగులు సమ్మెకు వెళితే జీతాలు మిగుల్చుకోవాలన్న దుర్బుద్ధితో ప్రభుత్వం ఉంటే మాత్రం ఉద్యోగులు సంయమనం పాటించడం మేలు. సమ్మె ప్రారంభించే ముందు ఆయా సంఘాల నాయకులు ప్రభుత్వ ఆలోచనను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది!

ఆర్కే

జగన్‌ మాయలు!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.