రాష్ట్రంలో జగన్‌ పీనల్‌ కోడ్‌!

ABN , First Publish Date - 2021-01-22T08:56:29+05:30 IST

‘ఈ రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) అమల్లో ఉందా లేక జగన్‌ పీనల్‌ కోడ్‌ అమలు చేస్తున్నారా? అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ఉందా లేక రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో జగన్‌ పీనల్‌ కోడ్‌!

  • కళా ఏం తప్పు చేశారని అర్ధరాత్రి ఇంటిపై పడ్డారు?
  • ఏ-1, ఏ-2, సజ్జల ఏం చెబితే అది చేస్తారా?
  • అలా చేయడానికేనా పోలీసు శాఖ ఉంది?
  • ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి
  • డీజీపీ ఖాకీ బట్టల గౌరవం నిలుపుకోవాలి
  • పాస్టర్‌ ప్రవీణ్‌కు కడపలో ఖాతా ఎందుకుంది?
  • టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం


అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ‘ఈ రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) అమల్లో ఉందా లేక జగన్‌ పీనల్‌ కోడ్‌ అమలు చేస్తున్నారా? అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ఉందా లేక రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. పోలీసు శాఖ ఉన్నది ప్రతిపక్షాలు, ప్రజల నోరు మూయించడానికి కాదని.. ప్రజలు తిరగబడితే పోలీసులు తోక జాడించాల్సి వస్తుందని అన్నారు. ఏం చేసినా పడి ఉంటామని అనుకోవద్దని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టు ఘటనపై ఆయన మండిపడ్డారు. ‘కళా ఏం తప్పు చేశారని అర్ధరాత్రి ఇంటిపై పడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.  హత్యలు, అత్యాచారాలు చేసిన నేరగాడి మాదిరిగా తోసుకుని తీసుకెళ్లారు. రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం తల నరకడాన్ని నిరసిస్తే పోలీసులను పెట్టి లాక్కెళ్తారా? ఆ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత నేను పోలీసు అనుమతితో అక్కడకు వెళ్లాను. నా కాన్వాయ్‌కు అడుగడుగునా అడ్డుపడ్డారు. నా కార్యక్రమంలో గందరగోళం చూసి భరించలేక విజయసాయిరెడ్డి కారుపై ఎవరో రాయి విసిరితే దానికి కళాపై కేసు, అరెస్టు. విగ్రహాలు ధ్వంసం చేశానని వీడియోలు పెట్టిన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తికి రాచమర్యాదలు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. మీడియాకు చూపించరు.


ఆయన డీజీపీ ఇంట్లో ఉన్నాడో.. తాడేపల్లి ప్యాలె్‌సలో ఉన్నాడో ఎవరికీ తెలియదు. అంతా రహస్యం. వందల గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా మారుస్తున్నానని చెప్పిన అతడికి కడపలో బ్యాంకు ఖాతా ఎందుకు ఉంది? ఆలయాలపై దాడులను నిరసిస్తూ తిరుపతిలో మేం తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న అనుమతి ఇచ్చారు. ఈరోజు రద్దు చేశారు. ఈ యాత్రను ఎలా ఆపుతారో, అది ఎలా జరగదో చూస్తాం. అంతా మీ ఇష్టం కాదు. మాకు యాత్ర చేసే హక్కు లేదా? తమాషాలు చేయకండి. దేవినేని ఉమను స్టేషన్‌ వెంట స్టేషన్‌కు అనేకచోట్లకు తిప్పారు. కళా వెంకట్రావును అరెస్టు చేయాలని చూస్తే తిరుగుబాటు వచ్చింది. వదిలిపెట్టక తప్పలేదు. రేపు రాష్ట్రమంతా ఇదే జరుగుతుంది. ప్రతిచోటా ప్రతిఘటిస్తాం. ఎంతవరకైనా పోరాడతాం. జైల్లో పెడతారా.. పెట్టండి. నన్ను కూడా పెట్టండి. మమ్మల్ని, ప్రజలను అందరినీ జైళ్లలో పెడతారా.. ఎంతమందిని పెడతారో పెట్టండి. మేమూ చూస్తాం’ అని వ్యాఖ్యానించారు.


ఇంటికొచ్చి కొడతామంటే కేసు పెట్టరా?

రాష్ట్రంలో పోలీసు శాఖ అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మ మాదిరిగా మారింది. దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఒక రౌడీ మంత్రి మా పార్టీ నేత దేవినేని ఉమను ఇంటికొచ్చి కొడతానంటాడు. ఆ మంత్రిపై ఎందుకు కేసు పెట్టరు? ప్రజలకు సేవ చేయడానికి మేం వచ్చాం. మీలా పేకాటలు ఆడించడానికి కాదు. తాడిపత్రిలో అధికార పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నాయకుడి ఇంటికి జనాన్ని వేసుకుని వెళ్తాడా? పోలీసులు దగ్గరుండి తలుపులు తీస్తారా? అది ట్రెస్‌పాసింగ్‌ కాదా? తన ఇంటిపైకి వచ్చిన వారిని వదిలి తనపై కేసు పెట్టారని.. బహిరంగంగా జిల్లా ఎస్పీని తిట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు పెట్టారా అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి అడిగితే పోలీసులు కిక్కురుమనడం లేదు. ఒక విగ్రహానికి అపచారం జరిగిందని.. దానిపై చర్య తీసుకోవాలని కోరుతూ పోస్టింగ్‌ పెడితే టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరి పీఏని అరెస్టు చేశారు. విగ్రహాలు ధ్వంసం చేసినా.. అపచారం చేసినా మేం చూస్తూ ఊరుకోవాలా? డీజీపీ సమాధానం చెప్పాలి. మత సామరస్యాన్ని దెబ్బ తీస్తోంది.. మత విద్వేషాలు పెంచుతోంది మీరే. గ్రామ సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త రెండు రోజుల్లో శవంగా మారాడు. అది హత్యో.. ఆత్మహత్యో తెలియదు. మద్యం రే ట్లు ఇష్టానుసారం పెంచడంపై ఒక వీడియో పెట్టిన పుంగనూరు వైసీపీ కార్యకర్త ఓం ప్రకాశ్‌ రెండు రోజుల్లో శవంగా మారాడు. అది కూడా హత్యో ఆత్మహత్యో తెలియదు.


గుడివాడలో మంత్రి పేకాట శిబిరాలపై దాడి చేసిన ఎస్సై విజయ్‌కుమార్‌ రెండు రోజుల్లో శవంగా మారాడు. అది కూడా హత్యో ఆత్మహత్యో తెలియదు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి లేదా?  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో పాత నంది విగ్రహం తీసి కొత్త నంది విగ్రహం పెడితే 20 మందిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? నంది విగ్రహం స్థానంలో వైఎస్‌ విగ్రహం పెట్టుకోవాలన్నది మీ కోరిక. నంది విగ్రహం పెట్టడానికి మంచి రోజు చూసి పెట్టలేదని కేసు. మిమ్మల్ని అడిగి ముహూర్తం పెట్టుకోవాలా? మీ సంప్రదాయాలు మీవి.. మా సంప్రదాయాలు మావి. మీ జోక్యం ఎందుకు?’


సవాంగ్‌ మంచివాడే...

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంచివాడే. గతంలో ఇలా లేరు. కానీ పదవి కోసం లొంగిపోయారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యం శాశ్వతం. అధికారులు ఆలోచించుకోవాలి. పోస్టులు వస్తుంటాయి.. పోతుంటాయి. వాటి కోసం కక్కుర్తిపడి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. రాష్ట్రంలో ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు, ప్రతిపక్షాలు, ప్రజలకు వేధింపులు ఎదురవుతుంటే డీజీపీ ఆలోచన చేసుకోవద్దా? మీకు విశ్వసనీయత అవసరం లేదా? ఐపీఎస్‌లో నేర్చుకున్నది ఇదేనా..? ఇన్నేళ్ల సర్వీసు మీకు నేర్పింది ఇదేనా? మీరు నిర్వీర్యమై పోయి మీ కింద వారిని కూ డా నిర్వీర్యం చేస్తారా? ఖాకీ బట్టల గౌరవం కాపాడం డి. కాపాడలేకపోతే అదే చెప్పి నమస్కారం పెట్టి వెళ్లిపొండి. ప్రజలు శభాష్‌ అని అభినందిస్తారు. ఏ-1, ఏ-2, సజ్జల ఏది చెబితే అది చేయడానికేనా పోలీసు శాఖ ఉంది? వాళ్లు చెప్పారని నాకు నోటీసులిస్తారా? చట్టాలు నేను మీ దగ్గర నేర్చుకోవాలా? పోలీసు శాఖలో చట్టంపై గౌరవం ఉన్న అధికారులు కొందరు ఉన్నారు. మనసు చంపుకొని పని చేస్తున్నారు. వారికి హ్యాట్సాఫ్‌.


ఉద్యోగులకు రాజకీయాలతో ఏం పని?

కొందరు ఉద్యోగులు తమ సహ ఉద్యోగుల సమస్యలు వదిలిపెట్టి మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి రాజకీయాలతో ఏం పని? నేను చట్టాన్ని గౌరవిస్తా. అదే సమయంలో దానిని దుర్వినియోగం చేస్తే సహించను. వారి గుండెల్లో నిద్రపోతా.


అమరావతి రైతులతో ఎందుకు మాట్లాడరు?

వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులతో కేంద్రం చర్చిస్తున్న మాదిరిగా జగన్‌ ప్రభుత్వం అమరావతి రైతులతో ఎందుకు చర్చలు జరపదు? వారు 400 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఒక్కసారైనా వారితో మాట్లాడారా? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని అర్థం లేని ఆరోపణలు చేశారు. రైతుల కోరికను మన్నించి అమరావతిలో భూములు అమ్ముకోడానికి అనుమతి ఇచ్చాం. దానికి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని పేరుపెట్టి కేసులు పెడతారా? అది ఏ చట్టంలో ఉంది? ఏ సెక్షన్ల కింద అది నేరం?


క్రైస్తవ మతాన్ని రోడ్డున పడేసింది జగన్‌ కాదా?

క్రైస్తవ మతాన్ని రోడ్డున పడేసింది జగన్‌ కాదా? ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ముగ్గురూ క్రైస్తవులు. దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇతర మతాల వారి ఆలయాలపై దాడులు జరిగినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పని లేదా? నా పక్కన ఎవరైనా కూర్చున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఎవరెవరు కూర్చున్నారో చూసుకుంటాను. ఆ జాగ్రత్త మీకు ఎందుకు లేదు? జగన్‌ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రంలో బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నాడు. ఇంకా ఎంత మంది ప్రవీణ్‌లు ఉన్నారో బయటకు రావాలి. ప్రజలందరికీ మనోభావాలు ఉంటాయి. వాటిని అధికారంలో ఉన్నవారు కాపాడాలి. క్రైస్తవ సంఘాల్లో కొందరిని ముందు పెట్టి నన్ను తిట్టిస్తున్నారు. ఆ సంఘాలకు రాజకీయాలతో ఏం పని? తెలుగుదేశం లౌకిక పార్టీ. అన్ని మతాలు మాకు సమానం. మీరు ఎందరితో తిట్టించినా నా మనోబలం చెక్కు చెదరదు.


16 నెలలు జైల్లో ఉండివచ్చిన ఒక కరుడుగట్టిన అవినీతిపరుడు నా పర్యటనకు అడ్డుపడి రభస చేస్తే ఆయన్ను ఏమీ అనరు. అనుమతి తీసుకుని వెళ్లిన నాపైనా, కళావెంకట్రావు, అచ్చెన్నాయుడిపై కేసులు పెడతారు.డీజీపీ సవాంగ్‌ మంచివాడే. గతంలో ఇలా లేరు. పదవి కోసం లొంగిపోయారు.                                                                                                                                                                                                                  - చంద్రబాబు

Updated Date - 2021-01-22T08:56:29+05:30 IST