Jagan దృష్టిలో నేను ఉన్నాను: అలీ

ABN , First Publish Date - 2022-05-18T20:43:40+05:30 IST

అనూహ్య పరిణామాల మధ్య నటుడు అలీ (Ali) వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనను రాజమండ్రి

Jagan దృష్టిలో నేను ఉన్నాను: అలీ

అమరావతి: అనూహ్య పరిణామాల మధ్య నటుడు అలీ (Ali) వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనను రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణలో భాగంగా అది కుదరలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ముచ్చట తీరలేదు. తీరా.. అలీని రాజ్యసభ (Rajya Sabha)కు పంపడం ఖాయమని వైసీపీ శిబిరం ప్రచారం చేసింది. అక్కడ కూడా ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఏపీ నుంచి నలుగురిని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే ఈ లిస్టులో అలీ లేరు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. తాను రాజ్యసభ సీటును ఆశించలేదని వెల్లడించారు.


‘‘జగన్ దృష్టిలో నేను ఉన్నాను. భవిష్యత్‌లో ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా. నీకు ఫలానా పదవి ఇస్తామని జగన్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదు, ఏదో ఒక పదవి ఇస్తామని గట్టిగా చెప్పారు. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు వక్ఫ్‌ బోర్డు చైర్మన్ పదవి కూడా నాకు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆ పదవి వేరే వాళ్ళకు కేటాయించారు. ప్రభుత్వం నుంచి ఒకరోజు పిలుపు వస్తుంది. ఆరోజు మీడియా ముందుకు వస్తాను’’ అని అలీ ప్రకటించారు.


రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య (R. Krishnaiah), మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావు, ఏలేటి నిరంజన్‌ రెడ్డిలకు రాజ్యసభ చాన్స్‌ ఇచ్చారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని మరోసారి పెద్దల సభలో కొనసాగించాలని నిర్ణయించారు. నలుగురిలో ఇద్దరు బీసీలు కాగా... మిగిలిన ఇద్దరు జగన్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు. ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు ఇద్దరూ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే కావడం విశేషం. 2014లో ఆర్‌.కృష్ణయ్య ఎల్‌బీనగర్‌ నుంచి తెలంగాణ శాసన సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనను చంద్రబాబు (Chandrababu) ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’గా కూడా ప్రకటించారు. ఇక... బీద మస్తాన్‌ రావు కావలి నుంచి 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. 

Updated Date - 2022-05-18T20:43:40+05:30 IST