అబద్ధాలు, మోసాలకు జగన్‌రెడ్డికే ఆస్కార్‌ అవార్డు

Published: Tue, 17 May 2022 03:58:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అబద్ధాలు, మోసాలకు జగన్‌రెడ్డికే ఆస్కార్‌ అవార్డు

లక్షన్నర కోట్లు ఎవరికి, ఎక్కడ ఖర్చు చేశారు?

వ్యవసాయానికి ఉరేశారు

వైసీపీ ప్రభుత్వం పాలనలో మూడేళ్లలో వెయ్యి మంది రైతుల ఆత్మహత్య


అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘అబద్ధాలకు, మోసాలకు ఆస్కార్‌ అవార్డు ఇస్తే అది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికే వస్తుంది. గణపవరం సభలో ఆయన పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. రైతులను ఘోరంగా నష్టపర్చి కూడా మాయ మాటలు చెప్పడం ఆయనకే చెల్లింది’’ అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. సోమవారం ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయానికి ఏటా బడ్జెట్లో పెట్టిందే రూ.10 వేల కోట్లు. మూడేళ్లలో రూ.30 వేల కోట్లు పెట్టారు. రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేశానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన దానిలోనే సగం ఖర్చు చేయలేదు. ఇక లక్షన్నర కోట్లు ఎక్కడ..! ఎవరికి ఖర్చు చేశారు?’’ అని నిలదీశారు. రైతు భరోసాపై ఇచ్చిన హామీని, అమలు అవుతున్న తీరును, అర్హులైన రైతుల సంఖ్యకు, లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్యకు పొంతన లేకపోవడాన్ని ఎత్తి చూపించారు.


కౌలు రైతుల భరోసాలోనూ మోసమేనంటూ వివరించారు. ఈ మోసాలపై జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధర లేకపోవడంతో వరి రైతు, తెగుళ్లతో మిర్చి రైతు భారీగా నష్టపోయినా ఆదుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ‘‘జగన్‌రెడ్డి వచ్చి వ్యవసాయానికి ఉరి వేశాడు. రైతులు సాగు చేయడానికి భయపడే పరిస్థితి తెచ్చాడు. పంటలు చేతికందే సమయంలో కరెంటు కోతలు పెట్టారు. ఏనాడో 40 ఏళ్ల కిందట వ్యవసాయ మోటార్లకు పెట్టిన మీటర్లను ఎన్టీఆర్‌ తీసివేస్తే ఇప్పుడు ఈయన పెట్టిస్తున్నారు. పోలీసులను, కేసులను చూపించి భయపెట్టి మీటర్లు పెడుతున్నారు. భవిష్యత్తులో ఉచిత విద్యుత్‌ ఎత్తివేయడానికే ఈ మీటర్లు పెడుతున్నారు’’ అని ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సుమారు 1,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని, జగన్‌ ప్రభుత్వ పాపపు పాలన ఫలితమే ఇదని వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పరిహారం ఇచ్చే మానవత్వం కూడా ఈ ప్రభుత్వం చూపడం లేదని ధూళిపాళ్ల విమర్శించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.