సినీ పరిశ్రమపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-01T22:01:54+05:30 IST

సినీ పరిశ్రమపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలపై పరోక్ష విమర్శలకు దిగారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ‘వైఎస్సార్‌ పెన్షన్‌’ కానుక పెంపును

సినీ పరిశ్రమపై జగన్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: సినీ పరిశ్రమపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దలపై పరోక్ష విమర్శలకు దిగారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ‘వైఎస్సార్‌ పెన్షన్‌’ కానుక పెంపును జగన్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాడికి అందుబాటు రేటులో వినోదాన్ని అందించాలని, సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తే.. ఆ నిర్ణయంపై రకరకాలుగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఇలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తే విమర్శిస్తున్నారని, ఇలాంటి విమర్శలు చేసే వారందరూ పేదలకు శత్రువులేనని జగన్ అన్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయంపై టాలీవుడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పలువురు సినిమా పెద్దలు ఇప్పటికే అభ్యంతరాలు తెలిపారు. అంతేకాదు సినిమా టికెట్ల ధరలను గతంలోలాగే ఉంచాలని కోరారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోలేదు.


ఈ తరుణంలో జగన్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ పెద్దలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు సినిమా థియేటర్లను మూసేశారు. ఎప్పటిలాగే ధరలను ఉంచాలని డిమాండ్ చేస్తూ పలు సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దలను కలిసిన కొందరు విజ్ఞప్తులు చేస్తున్నారు. సినిమా పరిశ్రమ సమస్యపై ఇప్పటికే మంత్రి పేర్నినానితో కొందరు చర్చలు జరిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. కమిటీ భేటీ కూడా ముగిసింది. అయితే ఇంతవరకు ఎలాంటి పురోగతి కూడా లేదు. ప్రభుత్వం కనికరిస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నవారికి ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు షాకిచ్చాయి. 

Updated Date - 2022-01-01T22:01:54+05:30 IST