పోలవరం ఎత్తు.. అంగుళమైనా తగ్గదు!

ABN , First Publish Date - 2020-12-03T12:22:45+05:30 IST

పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలని ఆకాంక్షించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొడుకుగా చెబుతున్నా.. ఆ ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని సీఎం వైఎస్‌ ...

పోలవరం ఎత్తు.. అంగుళమైనా తగ్గదు!

వైఎస్‌ కొడుకుగా చెబుతున్నా..

2022 ఖరీ‌ఫ్‌కు నీరిస్తాం 

మూడేళ్లలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ

శాసనసభలో పోలవరంపై జగన్‌ ప్రకటన


అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలని ఆకాంక్షించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొడుకుగా చెబుతున్నా.. ఆ ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబరుకు ప్రాజెక్టును పూర్తిచేస్తామని.. 2022 ఖరీ్‌ఫకు నీళ్లిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన తప్పులను తాము ఇప్పుడు సరిచేస్తున్నామన్నారు. శాసనసభలో బుధవారం పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. ‘చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండగా.. ఈ ప్రాజెక్టును మేమే చేస్తామని తీసుకున్నారు. ఆ సందర్భంగా 2014 నాటి ప్రాజెక్టు అంచనా వ్యయం మేరకే పనులు చేస్తామని ఒప్పందం చేసుకుని తీవ్ర తప్పిదం చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం 2017 మార్చి 15న ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటుందని నిర్ణయించి ప్రకటన జారీచేసింది. ఆ తర్వాత సెప్టెంబరు 7వ తేదీ అర్ధరాత్రి నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. సుజనాచౌదరి, వెంకయ్యనాయుడు, సీఎం రమేశ్‌ ఆయన పక్కన నిలబడ్డారు. బాబుకు ఏం అర్థమైందో తెలీదు.. వెళ్లి జైట్లీకి శాలువా కప్పారు. కానీ సెప్టెంబరు 8న 2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టుకు డబ్బులిస్తామని  కేంద్రం ప్రకటన చేసింది.




ఆ రోజు చంద్రబాబు ఎందుకు నిరసన వ్యక్తంచేయలేదు..? 2014 అంచనాల ప్రకారం పోలవరం వ్యయంరూ.16,010 కోట్లు. ఆ తర్వాత 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పెరిగిన ఖర్చు పరిగణలోకి తీసుకుంటే ప్రాజెక్టు వ్యయం రూ.57 వేల కోట్లు అయింది. ఇందులో కేంద్రం ఇచ్చిన రూ.17,655 కోట్లు పోను.. ఇంకా రూ.37,885 కోట్లు ఖర్చవుతుంది. చంద్రబాబు మాత్రం రూ.16,010 కోట్లకే పనులు చేస్తామని ఒప్పుకొన్నారు. ప్రాజెక్టును చేతుల్లోకి తీసుకుని, అవినీతి చేసేందుకు ఏదిపడితే దానికి అంగీకరించేశారు. వాళ్లు చేసిన తప్పు, పొరపాట్లను కేంద్ర మంత్రులకు మా బుగ్గన రాజేంథ్రనాథ్‌రెడ్డి వివరించారు. కేంద్ర అధికారులు కూడా అవును.. ఇది నిజమే కదా! అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసే దిశగా వెళ్తున్నాం. కేంద్రం కూడా దీనికి సహకరిస్తోంది. అందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తామని, నీటి నిల్వను తగ్గిస్తామని బాబు మాట్లాడుతున్నారని.. ఒక్క అంగుళం ఎత్తు కూడా తగ్గదని చెప్పారు. కేంద్ర జలసంఘం ప్రొటోకాల్‌ ఉందని.. దాని ప్రకారం ప్రాజెక్టు కట్టిన తొలి ఏడాదే వందశాతం నీటిని నిల్వచేయలేమని చెప్పారు. ‘అలా చేస్తే డ్యామ్‌లో ఎక్కడన్నా లీకులున్నా, పటిష్ఠంగా లేకున్నా ఇబ్బంది. అందుకే తొలి సంవత్సరం 33 శాతం నీరు, రెండో ఏడాది 50 శాతం నీరు, మూడో ఏడాది గరిష్ఠ సామర్థ్యంలో వందశాతం నిల్వ చేస్తారు. అయితే ప్రొటోకాల్‌ అనుమతిస్తే.. పోలవరంలో మొదటి ఏడాది నిల్వ సామర్ధ్యం 33 శాతం కంటే ఎక్కువగానే.. 190 టీఎంసీల్లో 120 టీఎంసీలు నింపుతాం. రెండో ఏడాది పెంచుతాం. మూడో ఏడాది పూర్తిస్థాయిలో నిల్వ చేస్తాం’ అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..


అనుమతులన్నీ వైఎస్‌ హయాంలోనే

‘1999-2004 మధ్య చంద్రబాబు పోలవరానికి చేసిందేమీ లేదు. 2004లో వైఎస్‌ సీఎం అయ్యాక ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కోసం 10,627 ఎకరాలు.. అంటే 86శాతం భూసేకరణ చేశారు. బాబు 2014-19 కాలంలో చేసింది మిగిలిన 14 శాతం. ఎడమకాలువ భూసేకరణను కూడా వైఎస్‌ 98 శాతం చేశారు. బాబు చేసింది 0.89 శాతమే. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులన్నీ వైఎస్‌ హయాంలోనే వచ్చాయి. 2004లో స్థల అనుమతి, 2005లో పర్యావరణం, ఆ తర్వాత 2007లో పునరావాసం అనుమతి,  2008లో సుప్రీంకోర్టు అనుమతి, అదే సంవత్సరం అటవీ శాఖ అనుమతి, 2009లో సాంకేతిక సలహా కమిటీ అనుమతి.. ఇలా అన్నీ తెచ్చారు. మిగిలిన ఒకే ఒక్క అనుమతి టీఏసీ క్లియరెన్స్‌ 2011లో వచ్చింది. ప్రాజెక్టులో భూసేకరణ కీలకం. తర్వాత హెడ్‌వర్క్స్‌, పునరావాసం వస్తాయి. ఆ లెక్కన చూస్తే వైఎస్‌ హయాంలో పోలవరం  మొత్తం పనుల్లో 20.61శాతం పూర్తయ్యాయి. చంద్రబాబు హయాంలో 70శాతం పూర్తయిందని చెప్పుకోవడమే తప్ప.. ఆయన పూర్తిచేసింది 39.53 శాతమే. మిగిలిన పని ఇప్పుడెవరు పూర్తిచేస్తున్నారు? వైఎస్‌ కొడుకుగా నేను చేస్తున్నా. పోలవరం పనుల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. ఆ ప్రాజెక్టు ఆయనకు ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీయే విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌తో  రూ.1,343 కోట్లు ఆదా చేశాం. 


ప్రాజెక్టు.. విగ్రహం ఒకేసారి

మా ఎమ్మెల్యేల కోరిక మేరకు పోలవరం ప్రాజెక్టు దగ్గర వంద అడుగుల వైఎస్‌ విగ్రహం పెడతాం. మళ్లీ ఇదేదో దుబారా అంటారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు చూసేందుకని బస్సులు పెట్టి, జనాలను తీసుకెళ్లి రూ.83.45 కోట్లు ఖర్చు చేశారు. ఫుడ్‌ బిల్లే రూ.14 కోట్లు అన్నారు. బస్సులు పెట్టకుండా, అంతమంది జనాలను తీసుకెళ్లకుండా లెక్క రాసేశారు. మేం ఈ వృథా ఖర్చులు చేయడం లేదు. ప్రాజెక్టును, వైఎస్‌ విగ్రహాన్ని ఒకేరోజు ఆవిష్కరిస్తాం.

Updated Date - 2020-12-03T12:22:45+05:30 IST