‘కోత’ల రాయుడు జగన్‌

ABN , First Publish Date - 2022-06-28T09:07:54+05:30 IST

ప్రతి సంక్షేమ పథకంలోనూ కోతలు పెడుతూ ముఖ్యమంత్రి జగన్‌ కోతల రాయుడుగా మిగిలిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు.

‘కోత’ల రాయుడు జగన్‌

  • అన్ని పథకాల్లోనూ కోతలే
  • శ్మశానమని చెప్పినచోట ఎకరా పది కోట్లకు
  • అమ్ముతారా?.. భూములమ్మే అధికారం ఎవరిచ్చారు?
  • అమరావతిలో ఒక్క ఇటుకైనా పేర్చారా?
  • ఆత్మకూరులో వైసీపీ ఓట్లు పెరగలేదు
  •  వ్యూహ కమిటీ భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు


అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ప్రతి సంక్షేమ పథకంలోనూ కోతలు పెడుతూ ముఖ్యమంత్రి జగన్‌ కోతల రాయుడుగా మిగిలిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. సోమవారం జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘చెత్త నుంచి అన్నింటిపైనా పన్నులు విపరీతంగా బాదుతున్నారు. మరో పక్క సంక్షేమ పథకాల్లో రోజుకో కొత్త నిబంధన తెచ్చి లబ్ధిదారుల సంఖ్యలో కోతపెడుతున్నారు. 75 శాతం హాజరు నిబంధన పేరుతో ‘అమ్మ ఒడి’ నిధులను 50 వేల మందికి ఎగ్గొట్టారు. ఒంటరి మహిళలకు పింఛను ఇచ్చే వయసును 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించారు. ఇది అమానవీయం. ఒంటరి మహిళలకు ఏ ఆధారం లేదని పింఛను ఇస్తుంటే దానిలో కూడా కోత పెట్టడం దారుణం’’ అని ఆయన విమర్శించారు. అమరావతిని శ్మశానమని ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని ఆయన ప్రశ్నించారు. 


‘‘రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టని జగన్‌ రెడ్డికి అక్కడ భూములు అమ్మే హక్కు లేదు. ప్రభుత్వ అధికారుల కోసం నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా మూడేళ్లుగా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వాలని చూస్తున్నారు. ఒక్కటి కూడా సవ్యమైన ఆలోచనలు లేవు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆత్మకూరు ఉప ఎన్నికలో బయట పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘అక్కడ టీడీపీ పోటీ చేయలేదు. డబ్బులు విపరీతంగా పంచారు. అయినప్పటికీ 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీకి పెద్దగా ఓట్లు పెరగలేదు. అనేక మంది మంత్రులు అక్కడ కూర్చుని, సమస్త వనరులు వినియోగించినా ఉపయోగం లేకుండా పోయింది’’ అని ఆయన చెప్పారు. పది, ఇంటర్‌ ఫలితాల తర్వాత రాష్ట్రంలో 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, ఆ పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. నాణ్యమైన విద్యను అందించడంలో దేశంలో మూడో స్థానంలో ఉన్న ఏపీ.. వైసీపీ పాలనలో 19వ స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 


మద్యంలో విష పదార్థాలు: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే జగన్‌ సొంత బ్రాండ్లలో ప్రజల ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నట్టు తేలడం తీవ్రమైన విషయమని చంద్రబాబు అన్నారు. మద్యం నాణ్యత పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిధులు లేక దుల్హన్‌ పథకాన్ని నిలిపివేశామని కోర్టుకు చెప్పడం పేద మైనారిటీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమని, రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అసలు నిలిపివేయడం మోసపూరిత వైఖరిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. పంటల బీమా సాయంలో అసలైన రైతులకు న్యాయం జరగడం లేదని, వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి నిజంగా నష్టపోయిన రైతులకు మొండి చెయ్యి చూపారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను బాధితులకు పరిహారం పంపిణీలో వైసీపీ నేతలు అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని, అసలైన బాధితులకు పరిహారం అందించకుండా పార్టీ కార్యకర్తలకు పంచుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. నెల్లూరు జిల్లాలో దళితుడైన ఉదయగిరి నారాయణ.. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగానే ప్రాణాలు కోల్పోయారని, అతని మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని సమస్యలపై ప్రశ్నించిన కవితను వైసీపీ నేతలు వేధించడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు. బాధిత మహిళకు అండగా ఉంటామన్నారు.

Updated Date - 2022-06-28T09:07:54+05:30 IST