జనం లేకుండా జగన్‌ పర్యటన ఎందుకిలా?

ABN , First Publish Date - 2022-06-23T07:52:38+05:30 IST

రూ.700ల కోట్ల పెట్టుబడితో పదివేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడానికి నేడు తిరుపతి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనలో బహిరంగ సభగానీ, ప్రజలను కలిసే కార్యక్రమమం కానీ లేకపోవడం చర్చగా మారింది.

జనం లేకుండా జగన్‌ పర్యటన  ఎందుకిలా?

- బహిరంగ సభకు జనం రారనే భయంతోనే వెనుకంజ?

- జనాన్ని కలవకుండా హెలికాప్టర్‌లోనే సీఎం యాత్ర


తిరుపతి (ఆంధ్రజ్యోతి): రూ.700ల కోట్ల పెట్టుబడితో పదివేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడానికి నేడు తిరుపతి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనలో బహిరంగ సభగానీ, ప్రజలను కలిసే కార్యక్రమమం కానీ లేకపోవడం చర్చగా మారింది. వకుళమాత ఆలయం  మహాసంప్రోక్షణ కార్యక్రమం సహా ప్రారంభోత్సవాలూ, శంకుస్థాపనల్లో నాలుగు గంటల పాటూ బిజీబిజీగా సాగనున్న సీఎం పర్యటన జనసమీకరణకు దూరంగా ఎందుకు ముగియనున్నదనే అంశమే రాజకీయ వర్గాల్లో విస్తృత సంభాషణగా మారింది. 


  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ మూడేళ్ళలో సీఎం జగన్‌ తిరుపతి జిల్లాలో  ఓ భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనుండడం ఇదే ప్రధమం. టీసీఎల్‌ పరిశ్రమకు ప్రారంభోత్సవం కూడా చేయనున్న సీఎం, ఈ ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పుకునే అవకాశం ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదన్నదే ప్రశ్నగా వినిపిస్తోంది. జిల్లాలో వైసీపీకి మంచి మైలేజీ ఇచ్చే కార్యక్రమంగా భావిస్తున్నా సభలేకుండానే సీఎం పర్యటన ముగియనుండడమే విశేషం. 2020 డిసెంబరు 28న శ్రీకాళహస్తి మండలం ఊరందూరు పేదలందరికీ పక్కా ఇళ్ళు పథకానికి జగన్‌ శంకుస్థాపన చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భారీ హంగు ఆర్భాటాలతో బహిరంగ సభ నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి ఏర్పాట్లలో తన ప్రత్యేకత, సత్తా చూపారు. దాని తర్వాత ఇప్పటి దాకా సీఎం పాల్గొన్న భారీ కార్యక్రమాలేవీ జిల్లాలో జరగలేదు. మధుసూదనరెడ్డి నియోజకవర్గం పరిధిలోనే ప్రస్తుతం కార్యక్రమాలు జరుగుతున్నా బహిరంగ సభ జోలికి వెళ్లడం లేదు.  కొంతకాలం కిందట తిరుపతిలో సీఎం కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినా అవి టీటీడీకి సంబంధించినవి. పైగా గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన గరుడ వారధి వంటి పనులు. బహిరంగ సభ గానీ, ప్రజలను కలుసుకునే కార్యక్రమం గానీ లేకుండానే సాగుతున్న ఈ కార్యక్రమాల కవరేజికి మీడియాను కూడా అనుమతించడం లేదు. 


జనం గేట్లు దూకి పారిపోతున్నారనేనా?

ఎందుకిలా చేస్తున్నారనే దానిపై  రాజకీయ వర్గాల్లోనూ, జనంలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల కొంతకాలంగా వైసీపీ పార్టీ తరపున గానీ, ప్రభుత్వం తరపున గానీ నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్న బహిరంగసభలే జనం లేక వెలవెలబోతున్నాయి. మే 2న తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో జరిగిన జగనన్న విద్యాదీవెన ప్రారంభోత్సవ సభను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సీఎం ప్రసంగం మొదలు కాగానే ప్రజలు గేట్టు ఎక్కి, గోడలు దూకి వెళ్లిపోవడం వంటివి జరిగాయి. ఎంత కష్టపడి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను, అంగన్‌వాడీ వర్కర్లను బలవంతంగా సమీకరిస్తున్నా వారు నిలవడం లేదు. ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మంత్రులతో బస్సు యాత్ర కూడా జనం లేక ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఇక గడపగడపకూ ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలు, మంత్రులు జరుపుతున్న పర్యటనలు కూడా ప్రజల నుంచీ తీవ్ర వ్యతిరేకతను చవి చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీకాళహస్తిలో సీఎం బహిరంగసభ నిర్వహిస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అనే ఆందోళన వైసీపీ వర్గాలను కలవరపెట్టినట్టుగా ప్రచారం అవుతోంది. మీడియా కవేజీకి రాకుండా ఎంత నియంత్రించినా, సోషల్‌మీడియా వల్ల ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం లేక విఫలమయ్యామనే ముద్ర పడకుండా వుండడానికే బహిరంగ సభ వద్దనుకున్నారని అంటున్నారు. 


విమానంలో వచ్చి, హెలికాప్టర్‌లో తిరిగి..

 సీఎం వచ్చారంటే, ఆయనకు తమ గోడు చెప్పుకోవడానికి జనం ఎగబడుతారు. సీఎం ప్రయాణించే రోడ్డు మార్గాన ఎదురు చూస్తారు. ఈ సమయంలో ప్రజల్లో ఎక్కడైనా నిరసన ధోరణి కనిపిస్తే మీడియా దృష్టి పడుతుందనే భయంతోనే మొత్తం పర్యటన అంతా కూడా హెలికాప్టర్‌కే పరిమితం చేశారని ప్రత్యర్ధులు చెబుతున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకునే ముఖ్యమంత్రి పాతిక కిలోమీటర్లు దూరం కూడా లేని ప్రదేశాలకు హెలీకాప్టర్‌ను వినియోగించుకోవడం విచిత్రం. ఇందువల్ల ప్రజాధనం భారీఎత్తున వ్యయం అవుతుందని అంటున్నారు.



Updated Date - 2022-06-23T07:52:38+05:30 IST