జగన్‌ ఉచ్చు.. కుల రొచ్చు!

Published: Sun, 03 Oct 2021 00:28:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జగన్‌ ఉచ్చు.. కుల రొచ్చు!

‘‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు’’ అని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తనను కలిసిన సినీనిర్మాతల వద్ద వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ను కలిసిన నిర్మాతల బృందం అందుకు ఒక్కరోజు ముందే మచిలీపట్నం వెళ్లి మరీ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నానిని కూడా కలిసింది. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని పవన్‌ కల్యాణ్‌ చెప్పిన దాంట్లో నిజం ఉంది కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. ‘రిపబ్లిక్‌’ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఏపీ మంత్రులను సన్నాసులు, వెధవలు అని తిట్టడంతో సినిమాలు రిలీజ్‌ అవకపోయినా ప్రజలకు మాత్రం ఈ వారం రోజులు ఉచితంగా వినోదం లభించింది. అయితే ఈ క్రమంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా మంత్రులు అధమస్థాయి భాషను ఆశ్రయించారు. కులాల కుంపట్లు రాజుకున్నాయి. మొత్తం ఈ పరిణామానికి మూల విరాట్‌ అయిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి యథావిధిగా మౌనాన్ని ఆశ్రయించారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయాల్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద నిర్మాతలు తమ నెత్తిన పిడుగు పడినట్టుగా బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు సినిమాల రిలీజ్‌ రోజు టికెట్ల ధరలను ఇష్టానుసారం పెంచుకోవడానికి వీలు లేదని జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బడా నటులకూ, నిర్మాతలకూ చలిజ్వరం వచ్చింది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగింది. పవన్‌ కల్యాణ్‌ కూడా ఇదే ఉద్దేశంతో తనపై కోపంతో ఇతర నిర్మాతలను ఇబ్బంది పెట్టవద్దని వాపోయారు. వివాదం మాత్రం ముదిరిపోయింది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం కోసం సినిమా పెద్దలు కాళ్లబేరానికి దిగి వచ్చారు. రెండు తెలుగురాష్ర్టాల ప్రభుత్వాలు సినీపరిశ్రమను చల్లగా చూడాలని, ఇకపై కూడా అలాగే ఆశీర్వదించాలని ప్రముఖ నటుడు నాగార్జున విజ్ఞప్తి చేయగా, సినిమా పరిశ్రమను ఆదుకోవాలని వినమ్రంగా వేడుకుంటున్నాను అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. రాజు తలుచుకుంటే వరాలకు కొదవ ఉండదు అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ వ్యాఖ్యానించారు. ఈ వేడుకోళ్ల మధ్య నలుగురైదుగురు బడా నిర్మాతలు మచిలీపట్నం వెళ్లి మరీ మంత్రి పేర్ని నానిని కలిసి ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని కోరారు. ఇప్పటివరకు సింహాలు, పులులుగా చలామణి అవుతూ వచ్చిన సినిమా పెద్దలు ఇప్పుడు ఒక్కసారిగా జగన్‌ ప్రభుత్వం ముందు మోకరిల్లడానికి కారణం ఏమిటి? ప్రభుత్వ నిర్ణయం వల్ల నిజంగా సినిమా పరిశ్రమ దెబ్బతింటుందా? వగైరా ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు అన్వేషిద్దాం. పారదర్శకత కోసం సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని తాము కోరుతున్నామని చెబుతున్న సినీ పెద్దలు కొందరు 2017లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోగా హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అదే పెద్దమనుషులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మాలని కోరామని చెప్పడం వింతగా ఉంది. నిజానికి సినిమా పరిశ్రమలో ఇటీవలి సంవత్సరాలలో వికృత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. కొవిడ్‌ కారణంగా సినిమా హాళ్లు నెలల తరబడి మూతపడ్డాయి. ఇప్పుడు తెరుచుకున్నా ప్రేక్షకుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. అయినా కొంతమంది బడా హీరోలు, దర్శకులు తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోకపోగా పెంచుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితులలో కొవిడ్‌కు ముందు ప్రారంభమై ఇప్పుడు పూర్తయిన బడా చిత్రాలను విడుదల చేస్తే నిర్మాతలు, పంపిణీదారులు భారీగా నష్టపోతారు. ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్లు తీసుకోవడానికి అలవాటు పడిన నటులు, దర్శకులు ప్రభుత్వాలను ఆశ్రయించి తమ చిత్రాల విడుదల సందర్భంగా టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి అనుమతి పొందుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై అలా కుదరదని ముఖ్యమంత్రి జగన్ ‌రెడ్డి తెగేసి చెప్పారు. మిగతా విషయాలలో పేదలను చూపించి నిర్ణయాలు తీసుకున్నట్టుగానే సినిమాల విషయంలో కూడా ఆయన పేదలపై భారం పడకూడదంటూ టికెట్‌ ధరలను తగ్గించారు. దీంతో నిర్మాతలు, నటుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. సినిమా పెద్దల కోరిక మేరకు.. ముఖ్యంగా అప్పుడు జీవించి ఉన్న దాసరి నారాయణరావు చొరవతో 2007లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి టికెట్‌ ధరను 70 శాతం వరకు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోని మరో వర్గం చేసిన తెర వెనుక ప్రయత్నాలతో ఈ ఉత్తర్వులను రాజశేఖర రెడ్డి ఉపసంహరించుకున్నారు. దీంతో నటులు, దర్శకులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులను ఆశ్రయించి అనుమతులు పొందుతూ వచ్చారు. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి రేట్లు పెంచుకోవడానికి అనుమతించిన జగన్‌ ప్రభుత్వం, ఈ మధ్య విడుదలైన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి రేట్లు పెంచుకోవడం కుదరదని చెప్పింది. అప్పటి నుంచి సినీ పెద్దలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. అదలా ఉంచితే సినిమా టికెట్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వివిధ పన్నులు ఎగవేతకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆన్‌లైన్‌ విక్రయాల ద్వారా ఈ ఎగవేతను అడ్డుకోవచ్చు. జగన్మోహన్‌ రెడ్డి ఈ కారణంగానే ప్రభుత్వపరంగా టికెట్లు అమ్మాలని నిర్ణయించుకున్నారో లేక సినీపరిశ్రమ భావిస్తున్నట్టుగా పవన్‌ కల్యాణ్‌ వంటి వారిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారో తెలియదు గానీ పిల్లి మెడలో గంట కట్టేశారు. అయితే ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే ఎంత కమీషన్‌ తీసుకుంటుంది? టికెట్‌ అమ్మకం వల్ల వచ్చే డబ్బును నిర్మాతలు, థియేటర్‌ యజమానులకు ఎప్పటిలోగా అందిస్తుంది? వంటి అంశాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ప్రైవేట్‌ ఏజెన్సీలు పదిహేను శాతం వరకు కమీషన్‌ తీసుకుంటున్నాయి. దీన్నిబట్టి జగన్‌ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇందులో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్న జగన్‌ రెడ్డి సర్కార్‌ భవిష్యత్‌ ఆదాయాన్ని, ఆస్తులను కుదువ పెట్టి అప్పులు తీసుకుంటున్న నేపథ్యంలో టికెట్‌ విక్రయాల వల్ల లభించే ఆదాయాన్ని సకాలంలో నిర్మాతలకు చెల్లిస్తుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఇది పరిష్కరించుకోదగిన సమస్యే. అయినా సినిమా పెద్దలు ఆందోళన చెందడానికి కారణం ఏమిటి? అంటే సమాధానం ఉంది. అదే టికెట్‌ ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించకపోవడమే వారి ప్రధాన సమస్య! ఏ సినిమా రిలీజ్‌ అయినా మొత్తం వసూళ్లలో 65 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచి, 35 శాతం మాత్రమే తెలంగాణ నుంచి వస్తాయి. ఈ కారణంగా టికెట్ల ధరలు పెరగకపోతే ఆంధ్రా నుంచి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. ఫలితంగా నిర్మాతలు, పంపిణీదారులు నష్టపోతారు. దాని ప్రభావం బడా నటుల పారితోషికంపై పడుతుంది. ప్రస్తుత ఏడుపులు, పెడబొబ్బలకు ఇదే కారణం. చిరంజీవి ‘ఆచార్య’, అల్లు అరవింద్‌ కుమారుడు అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. టికెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమతించకపోతే ఆ చిత్రాలతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాల నిర్మాతలు భారీగా నష్టపోతారు. ‘ఆచార్య’ చిత్ర నిర్మాతలలో న్యాయవాది నిరంజన్‌ రెడ్డి ఒకరు. జగన్‌ రెడ్డిపై విచారణకు వస్తున్న అవినీతి కేసులలో ఆయన తరఫున ఇదే నిరంజన్‌ రెడ్డి వాదిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ విమర్శల తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి నిరంజన్‌ రెడ్డికి ఒక సందేశం వచ్చిందట. పవన్‌ విమర్శలతో సినిమా పరిశ్రమ విభేదించని పక్షంలో టికెట్ల ధరలను మరింత తగ్గిస్తామన్నది ఆ సందేశం సారాంశం. దీంతో ప్రభుత్వం కోరిన విధంగా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, అరవింద్‌ వంటివారు వేడుకోళ్లు మొదలు పెట్టారు. మరోవైపు నిరంజన్‌ రెడ్డి చొరవతో దిల్‌ రాజు నాయకత్వంలో కొంతమంది నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలిశారు. క్లుప్తంగా జరిగింది ఇదీ! మొత్తం వ్యవహారానికి కీలకమైన టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలన్న విషయాన్ని మాత్రం ఎవరూ బాహాటంగా ప్రస్తావించడం లేదు. ప్రత్యర్థుల బలహీనతలపై గురిచూసి కొట్టడంలో సిద్ధహస్తుడైన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ఇదే అస్ర్తాన్ని ప్రయోగించి సినీపరిశ్రమ పెద్దలతో గుంజీలు తీయిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇతరులెవరూ సినిమా పరిశ్రమ జోలికి వెళ్లలేదు. జగన్‌ రెడ్డి రూటు సెపరేట్‌ కనుక బడా నిర్మాతలు, నటుల ఆయువుపట్టుపై కొట్టడానికి పూనుకున్నారు. నటులు, దర్శకులు తమ పారితోషికాన్ని తగ్గించుకుంటే ప్రభుత్వాల ముందు సాగిలపడే అవసరం ఉండదు. జగన్‌ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ పరిస్థితులు అనుకూలించే వరకూ ప్రస్తుతం తనకు ఇస్తున్న పారితోషికంలో పది శాతం ఇవ్వండి చాలు అని తన నిర్మాతలకు సూచించారట. మిగతా నటులు కూడా ఇదే బాటలో నడిస్తే ఏ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ఏమీ చేయలేదు. పారితోషికం తగ్గించుకోవడానికి మిగతా నటులు, దర్శకులు ముందుకు రాని పక్షంలో పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే నిజమైన హీరోగా నిలుస్తారు. మిగతా వాళ్లతో జగన్‌ రెడ్డి వంటి ముఖ్యమంత్రులు ఆడుకుంటూనే ఉంటారు. అసలు విషయం చెప్పడానికి కూడా భయపడుతున్న వారిని ‘వాహినీవారి పెద్దమనుషులు’ అని ప్రస్తుతానికి ముద్దుగా పిలుచుకుందాం!


ఉచ్చులోకి లాగేందుకే!

ఈ విషయం అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో మంత్రులు, ఇతరులు వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంది. ప్రశ్నించేవాళ్లు, సమాధానం చెప్పాల్సిన వాళ్లు కూడా బూతుల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే జగన్‌ ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు ఎదురుదాడి చేయడమే కాకుండా పచ్చి బూతులు తిడుతున్నారు. ఎవరు ఏ బూతులు తిట్టాలో కూడా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే ఆదేశాలు వెళ్తాయి. తెలుగునాట మొదటగా భాష విషయంలో లక్ష్మణ రేఖ దాటిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారు. ఉద్యమ సమయంలో ఆయన ఇతరులను సన్నాసులు, వెధవలు అని తిట్టిపోసినా అప్పుడెవరూ పట్టించుకోలేదు. బూతులు కాకపోయినా ఎదురుదాడికి శ్రీకారం చుట్టింది మాత్రం దివంగత రాజశేఖర రెడ్డి. ఇప్పుడు జగన్‌ అండ్‌ కో అన్ని హద్దులనూ చెరిపేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రులను ఉద్దేశించి సన్నాసులు అని పవన్‌ కల్యాణ్‌ దూషించడంతో ఎంపిక కాబడ్డ మంత్రులు బూతులు లంకించుకున్నారు. ఆటలో అరటిపండు వలె నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ప్రజలకు తనదైన హావభావాలు, భాషతో వినోదం పంచారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమాషా ఏమిటంటే ఆయా కులాలకు చెందిన వాళ్లు తమ కులాలనే తిట్టుకునేలా చేయడం. ఏ కులం వాళ్లు విమర్శలు చేస్తే ఆ కులం వాళ్లతోనే సమాధానం చెప్పించడం తెలుగునాట చాలా కాలంగా నడుస్తోంది. ఇప్పుడు అలా కాకుండా సొంత కులాలను కూడా కించపరుచుకొనే బాధ్యతను మంత్రులకు అప్పగించినట్టు కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చే బాధ్యత పొందిన వారిలో మంత్రి పేర్ని నాని ఒకరు. ఈయనగారు తానూ, పవన్‌ కల్యాణ్‌ ‘కాపు నా కొడుకులం, కాపు సన్నాసులం’ అని మొత్తం కాపు కులాన్ని తిట్టి పోశారు. తాను రెడ్డి గారి వద్ద పాలేరునేనని కూడా అంగీకరించిన పేర్ని నానికి తన కులస్తులందరినీ కట్టగట్టి విమర్శించే హక్కు ఉంటుందా? పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తికి మంచి పేరుండేది. పేర్ని నాని అని అందరూ పిలిచే పేర్ని వెంకట్రామయ్య కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్నా గతంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. తన యజమాని జగన్‌ రెడ్డిని సంతృప్తిపరచడానికి ఆయన ఇలా దిగజారి ఉంటారు. ఈ పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలకు కాపు సామాజికవర్గం నాయకులు సహజంగానే నొచ్చుకున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని అనే మరో మంత్రి తరచుగా కమ్మ వాళ్లను తిడుతుంటారు. జరుగుతున్న ఈ తంతు వెనుక ప్రధాన సూత్రధారి జగన్మోహన్‌ రెడ్డి అని చెప్పడానికి సందేహపడాల్సింది ఏమీ లేదు. కారణం తెలియదు గానీ ఆయనకు మొదటి నుంచీ కమ్మ, కాపులంటే గిట్టదు. అధికారంలోకి రాగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు రద్దు చేశారు. కమ్మ వారి ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. ఇప్పుడు ఫైనల్‌గా కమ్మ, కాపు సామాజికవర్గ ప్రజలను ఇతర సామాజికవర్గాల ముందు పలుచన చేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు పాలేర్లుగా మారిపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో! చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో ఉన్నంతవరకు కమ్మ, కాపులు తనకు పెద్దగా ఓట్లు వేయరన్న అభిప్రాయానికి వచ్చిన జగన్‌ రెడ్డి, మిగతా సామాజికవర్గాల నుంచి ఈ రెండు కులాలను దూరం చేయడానికి ఎత్తుగడ వేసి ఉంటారు. గత ఎన్నికల్లో ఈ ఎత్తుగడ ఫలించడంతో ఇప్పుడు మరింత విస్తృతంగా అమలుచేస్తున్నారని భావించవచ్చు. ఈ సూక్ష్మాన్ని గ్రహించని జనసైనికులు, కాపు నాయకులు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పన్నిన ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని కమ్మవారి పార్టీగా, జనసేనను కాపుల పార్టీగా చిత్రించగలిగితే జగన్‌ రెడ్డికి రాజకీయంగా మేలు జరుగుతుంది. మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌ కూడా కాపు నాయకుడిగా పేరొందిన వంగవీటి రంగా హత్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి జగన్‌ రెడ్డి వలలో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు. భవిష్యత్తు అంధకారమైనా పర్వాలేదు. కులం రొచ్చులో ఆనందంగా ఈదుతూనే ఉంటారు. జగన్‌ రెడ్డికి ఈ విషయం బాగా తెలుసు కనుకే మిగతా కులాలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా వ్యవహారంతో మొదలై కులాల వివాదం తెర మీదకు రావడంతో జగన్‌ వ్యూహం ఫలించింది. రాష్ట్రంలో యువత మత్తు మందుకు బానిసలవుతున్నారు. రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయింది. అయినా వాటి గురించి ఆలోచించకుండా కులాల కుంపట్ల ముందు కూర్చొని చలి కాచుకుంటున్న జనాలది తప్పు గానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వికృత క్రీడకు తెర తీసిన జగన్‌ రెడ్డిని నిందించి ప్రయోజనం ఏమిటి? గత ఎన్నికల్లో విజయం చేకూర్చిపెట్టిన ప్రశాంత్‌ కిశోర్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మళ్లీ పిలిపించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏ కొత్త కుంపట్లు రాజేస్తారో చూడాలి. తననూ, తన కుటుంబాన్ని దారుణంగా తిట్టించిన జగన్‌ అండ్‌ కో పై పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అవసరమైతే వ్యూహాలను మార్చుకొని జగన్‌ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని జనసేనాని ప్రకటించారు. దీంతో జనసేన పార్టీ, భారతీయ జనతాపార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి సన్నిహితమవుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజానికి జనసేన కార్యకర్తలు తెలుగుదేశంతో జత కట్టాలని పవన్‌ కల్యాణ్‌పై ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం-–జనసేన కలయికకు అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు బోగస్‌ పేర్లతో ఇందులోకి చొరబడి ఈ రెండు పార్టీల పొత్తులకు వ్యతిరేకంగా చర్చలో పాల్గొంటున్నారు. ఈ రెండు పార్టీలూ కలిస్తే రాజకీయంగా తనకు ముప్పని జగన్‌ రెడ్డికీ తెలుసు. అందుకే ముందస్తుగా కమ్మ, కాపు కులాలను ప్రజల్లో పలుచన చేసి మిగతా కులాలను వారి నుంచి దూరం చేయడానికి ఆయన వ్యూహం రచించి అమలు చేస్తున్నారు. ‘పవన్‌ నాయుడు మా కాపు నా కొడుకే, మా కాపు సన్నాసే’ అని మంత్రి పేర్ని నానితో తిట్టించడం వెనుక పరమార్థం ఇదే. పవన్‌ కల్యాణ్‌ను కాపు నాయకుడిగా ముద్ర వేయగలిగితే జగన్‌ అండ్‌ కో ప్రయత్నం ఫలించినట్టే. ఈ ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత కాపు సామాజికవర్గ నాయకులు, బాధ్యులపై ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో కూడా కాపులకు మిగతా సామాజికవర్గాలు దూరంగా ఉంటున్నాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు కూడా ఈ దూరాన్ని వ్యాపింపజేయబోతున్నారు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసినా పవన్‌ కల్యాణ్‌ ఓడిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించిన చిరంజీవి కూడా పాలకొల్లులో ఓడిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తన వ్యూహం ఎలా ఉండాలి? తన అడుగులు ఎలా ముందుకు పడాలి? అనే విషయమై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆచితూచి నిర్ణయించుకోవాలి. జగన్‌ పాలనపై మధ్య తరగతి, ఆ పై వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కిందిస్థాయి ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆలోచన తెలుసుకోవలసి ఉంది. లబ్ధిదారులకు కుడి చేత్తో ఇస్తూ ఎడమ చేత్తో వారి జేబులు ఖాళీ చేయిస్తున్న విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయకుండా పైకి కనిపిస్తున్న వ్యతిరేకతను మాత్రమే నమ్ముకుంటే తెలుగుదేశమైనా, జనసేన అయినా దెబ్బతింటాయి. జగన్‌ రెడ్డిది విలక్షణమైన రాజకీయం. తాము చేసే తప్పులకు కూడా పేద ప్రజలను ఆయన డాలుగా ఉపయోగించుకుంటారు. సినిమా టికెట్లకు సంబంధించిన తాజా వివాదమే ఇందుకు నిదర్శనం. పేద ప్రజలు అమాయకులని, వారిని సులువుగా మభ్యపెట్ట వచ్చునని అనుకుంటారు జగన్‌ రెడ్డి. డబ్బులు పంచితే ఆ మత్తులో పడి మరోవైపు నిలువుదోపిడీ జరిగినా గుర్తించలేరని ఆయనకు బాగా తెలుసు.


అవును.. అవసరమే!

ఇక ప్రభుత్వాలతో అంటకాగుతూ అరాచకంగా ప్రవర్తించే అధికారులపై విచారణ చేయడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో స్టాండింగ్‌ కమిటీ వేసే విషయం పరిశీలనలో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ వ్యక్తంచేసిన అభిప్రాయాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. న్యాయవ్యవస్థ తన పరిధి దాటుతున్నట్టు ఎవరికైనా అనిపించినా ప్రస్తుత పరిస్థితులలో ఇదే సరైన నిర్ణయం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉందో మనం చూస్తున్నాం. ప్రశ్నించడానికని తీసుకెళ్లి ఎంపీ అని కూడా చూడకుండా రఘురామరాజును చితకబాదిన అధికారులను వదిలేస్తే అందరూ ప్రభుత్వాలకు తొత్తులుగా మారరా? ఈ నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులను కట్టడి చేయవలసిందే. గతంలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేవారు కనుక వారిని అదుపు చేసే వ్యవస్థ అవసరం కలగలేదు. అందుకే ఎవరూ ఆ ఆలోచన చేయలేదు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తికి ఆ ఆలోచన వచ్చింది కనుక వెనుకడుగు వేయకుండా అధికారులను జవాబుదారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం!

ఆర్కే

జగన్‌ ఉచ్చు.. కుల రొచ్చు!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.