ఇల్లు కట్టేది ఎలా?

ABN , First Publish Date - 2022-07-25T04:19:59+05:30 IST

ఇల్లు కట్టేది ఎలా?

ఇల్లు కట్టేది ఎలా?
లేఅవుట్లలో రహదారి

- జగనన్న కాలనీ లేవుట్లలో కానరాని వసతులు

- అధ్వానంగా రహదారులు

- చెరువులను తలపిస్తున్న పరిసరాలు

- విద్యుత్‌, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు

- విముఖత చూపుతున్న లబ్ధిదారులు

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

పేదల సొంతింటి కల సాకారం చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇళ్ల నిర్మాణం ఉద్యమంలా చేపడుతున్నాం. గత రెండేళ్లుగా అధికారులు పదేపదే చెబుతున్న మాట ఇది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.  జిల్లాలో  జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండడం... లేవుట్లలో వసతులు కల్పించకపోవడం.. కనీసం నిర్మాణ సామగ్రి తరలించేందుకు రహదారి సదుపాయం లేకపోవడం.. తదితర కారణాలతో పనులు ప్రారంభించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రారంభించిన చోట కూడా పనుల్లో పురోగతి కానరావడం లేదు. మరోవైపు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం చాలక.. బయట అప్పులు చేస్తున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.  చేతిలో డబ్బులు లేక.. రుణాలు మంజూరు కాక.. ఎలా ఇళ్లు నిర్మించాలో తెలియక సతమతమవుతున్నారు. 

- జిల్లాలో గృహ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 11,983 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకూ పూర్తయినవి కేవలం 249 మాత్రమే. అధికారులు మాత్రం అంతా సవ్యంగా సాగుతున్నట్టు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితిని దాచేస్తున్నారు. అటు పట్టణాలు, ఇటు గ్రామాల్లో పరిస్థితి ఒకేలా ఉంది. ఒకవైపు ఇళ్లు కట్టేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. మరోవైపు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకుంటే పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. లేఅవుట్‌ల పరిస్థితి చూస్తే దారుణంగా తయారయ్యాయి. సరైన రహదారులు లేవు. విద్యుత్‌ సదుపాయం లేదు. బోర్లు ఏర్పాటుచేశామని చెబుతున్నా.. ఎక్కడా కానరావడం లేదు. దీంతో నిర్మాణదారులు వ్యయప్రయాసలకోర్చుతున్నారు. ముఖ్యంగా మెటీరియల్‌ తరలించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పట్టాలు రద్దయితే రద్దు చేయండి కానీ.. మేము మాత్రం ఇళ్లు కట్టలేమని తెగేసి చెబుతున్నారు. ఊరికి దూరంగా, నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో పట్టాలిచ్చి ఇళ్లు కట్టుకోవాలని ఆదేశాలు జారీచేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తన్నారు. లేఅవుట్లలో అన్నిరకాల వసతులు కల్పించిన తరువాత మాత్రమే ఇళ్లు కట్టుకోగలమని.. ఇప్పుడు మాత్రం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. 

- పార్వతీపురం పట్టణ లబ్ధిదారులకు నర్సిపురం పంచాయతీలో కొండమెట్ట వద్ద లేఅవుట్‌ ఏర్పాటుచేశారు. మొత్తం 728 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. కానీ అవి నివాసయోగ్యంగా లేవంటూ లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు వారు వెనుకడుగు వేస్తున్నారు.  పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేస్తే నేటికీ ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులు నిర్మాణం చేపట్టలేదు. అధికారులు నిర్లక్ష్యమే ఆ పరిస్థితికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై అప్పటి గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రత్యామ్నాయంగా లేఅవుట్‌ను గుర్తించాలని ఆదేశించారు. అయితే నెలలు గడుస్తున్నా కార్యాచరణ లేదు. సాలూరు మునిసిపాల్టీ, పాలకొండ నగర పంచాయతీలో కూడా సేమ్‌ సీన్‌. అక్కడ కూడా ఇళ్ల నిర్మాణంలో ఆశించిన పురోగతి లేదు.

- కొమరాడ మండలంలో 325 ఇళ్లు మంజూరు చేస్తే కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. పార్వతీపురం మండలంలో 1158 ఇళ్లకుగాను 42 మాత్రమే. సీతానగరం మండలంలో 985 ఇళ్లనుగాను 75 ఇళ్లు, మక్కువ మండలంలో 1152 ఇళ్లకుగాను 34 ఇళ్లు, పాచిపెంట మండలం 451 ఇళ్లకుగాను 30 ఇళ్లు, సాలూరు మండలంలో 380 ఇళ్లకు 16 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 


- ప్రారంభం నుంచే లోపాలు

లేఅవుట్‌ ఎంపికలోనే చాలా పొరపాట్లు జరిగాయి. స్థల సేకరణలో కూడా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఊరికి దూరంగా, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో స్థలాలను సేకరించారు. ఈ విషయంలో కొందరు అధికార పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. కొండలు గుట్టల్లో స్థలాలను కేటాయించడంతో లబ్ధిదారులు విముఖత చూపారు. స్థలాలు తీసుకుంటాం కానీ.. ఇళ్లు కట్టేది లేదంటూ తేల్చిచెప్పారు. అయితే అధికారులు ఒత్తిళ్ల మేరకు చాలామంది అయిష్టతగానే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కానీ లేఅవుట్లలో కనీస వసతులు సమకూర్చలేదు. రహదారులు వేయలేదు. విద్యుత్‌ సౌకర్యం కల్పించలేదు. కొన్నిచోట్ల మంచినీటి సదుపాయం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులు వ్యయప్రయాసలకోర్చుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో లేఅవుట్‌ ప్రాంగణాలు బురదమయంగా మారుతున్నాయి. చిత్తడిగా తయారవుతుండడంతో గృహ నిర్మాణ సామగ్రి తరలించేందుకు వీలులేకుండా పోతోంది. చాలాచోట్ల నిర్మాణ పనులను వాయిదా వేసుకుంటున్నారు. 


 పెరిగిన గృహనిర్మాణ సామగ్రి ధరలు

గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా సిమెంట్‌ ధర ఎగబాకుతోంది. బస్తా ధర రూ.380కు చేరుకుంది. ఇనుమ ధర కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. టన్ను ఇనుము ధర రూ.70 వేలకు చేరుకుంది. వర్షాలు పడుతున్న దృష్ట్యా ఆశించిన స్థాయిలో ఇసుక లభ్యత లేదు. దీంతో అవసరాలను ఆసరాగా చేసుకొని రెట్టింపు ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. లారీ ఇసుక రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పలుకుతోంది. దీంతో గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణ పనులు తగ్గినా ధరలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. జూన్‌ వరకూ గృహ నిర్మాణ సామగ్రి విక్రయాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో ఇటీవల తగ్గుముఖం పట్టాయి. కొద్దినెలల కిందట సిమెంట్‌ రూ.320 వరకూ ఉండేది. పెరిగిన డిమాండ్‌తో ప్రస్తుతం రూ.380కు చేరుకుంది. 


దృష్టిసారించాం

లేవుట్లలో మౌలిక వసతులపై దృష్టిసారించాం. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే పరిష్కారమార్గం చూపిస్తాం. లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి. పూర్తిస్థాయిలో బిల్లులు కూడా మంజూరు చేస్తాం. లేఅవుట్లలో రహదారి నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 

-రఘురాం, జిల్లా గృహ నిర్మాణ శాఖ మేనేజర్‌

Updated Date - 2022-07-25T04:19:59+05:30 IST