‘తప్పు’కొన్నారు..

ABN , First Publish Date - 2022-08-14T06:10:15+05:30 IST

‘తప్పు’కొన్నారు..

‘తప్పు’కొన్నారు..
ఫోర్జరీ పొసెషన్‌ పట్టాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంగల వినాయకరావు (సర్కిల్‌లో)తో ఎమ్మెల్యే రక్షణనిధి (ఫైల్‌)

చివరికి రెవెన్యూపై నెట్టేశారు..!   

ఫోర్జరీ పొసెషన్‌ పట్టాల స్కామ్‌లో వైసీపీ వింత ధోరణి

సూత్రధారితో పాటు ఫిర్యాదుదారుడిపైనా వేటు

తమకేం తెలియదు.. పాపమంతా రెవెన్యూదేనట..!

దమ్మున్న ఎమ్మెల్యేనంటూ రక్షణనిధి ప్రశంసలు

ఆంధ్రజ్యోతిపైనా అక్కసు


తప్పును ఒప్పుకుంటే సరే.. తప్పును తప్పదన్నట్టుగా తప్పించుకునే ధోరణిలో ఒప్పుకుంటే.. గంపలగూడెం మండలం తోటమూల జగనన్న లే అవుట్‌లో మిగులు స్థలాల అక్రమ విక్రయాలపై వైసీపీ తీసుకున్న చర్యలు ఇలాగే ఉన్నాయి. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే అనుచరుడితో పాటు ఫిర్యాదుచేసిన వారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం విమర్శలకు తావిస్తోంది. తాను దమ్మున్న ఎమ్మెల్యేనని తనకు తాను రక్షణనిధి చెప్పేసుకోవడం, ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు వెళ్లగక్కడం కూడా తప్పించుకునే ధోరణిని సూచిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం తోటమూల జగనన్న లే అవుట్‌ మిగులు భూముల విక్రయంలో ప్రధాన పాత్రధారి, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కొంగల వినాయకరావును శనివారం వైసీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. అలాగే, ఎమ్మెల్యే అనుచరుడిపై కలెక్టరుకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత జి.నాగరాజును కూడా సస్పెండ్‌ చేశారు. ‘అధికార పార్టీ నేతల ధనకార్యాలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి స్పందించి ఎమ్మెల్యే రక్షణనిధి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కప్పిపుచ్చుకునే యత్నం..

తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ పొసెషన్‌ సర్టిఫికెట్‌ సృష్టించడం, ఈ విషయాన్ని వైసీపీ నాయకులే జిల్లా యంత్రాంగానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవటానికి, తమ తప్పేమీ లేదని కప్పి పుచ్చుకోడానికి అధికార పార్టీ నేతలు రెవెన్యూపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే దగ్గర ఉండే నేతలెవరూ జోక్యం చేసుకోలేదని, ఫలానా వారికి ప్లాట్‌ ఇవ్వాలని తామేమీ చెప్పలేదన్న వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఎంత కప్పి పుచ్చుతున్నా ఎమ్మెల్యే బంధువు లారెన్‌, అనుచరుడు కొంగల వినాయకరావు సాగిస్తున్న వ్యవహారాలపై గంపలగూడెం, తిరువూరు మండలాలకు చెందిన అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాగా, ఈ అక్రమ వ్యవహారాలపై స్పందనలో కలెక్టర్‌ దిల్లీరావుకు ఫిర్యాదు అందడంతో ఆయన విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కొంగల వినాయకరావును సస్పెండ్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కొంగల వినాయకరావు అక్రమాలను వైసీపీ గంపలగూడెం మండల నేత జి.నాగరాజుతో పాటు మరికొంతమంది వెలుగులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. దీంతో నాగరాజును కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తద్వారా మిగిలిన నాయకులెవరూ నోరెత్తకుండా ఉండాలనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

అధికారుల్లో కంగారు

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసి దొంగ పట్టాలు సృష్టించడంతో రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ వివాదంలో చిక్కుకుంది. నాయకులు తప్పంతా రెవెన్యూపై నెట్టడంతో అధికారులు కంగారు పడుతున్నారు. సంతకం ఫోర్జరీ అయిన సంగతి తెలిసిన మరుక్షణమే యంత్రాంగం దృష్టికి తీసుకురావాల్సింది. అధికార పార్టీ అనుచరుడన్న ఉద్దేశంతో మిన్నకుండిపోవడంతో తప్పిదం రెవెన్యూకు కూడా చుట్టుకుంది. ఇప్పుడు అధికార పార్టీ నేతలు కూడా నెపాన్ని నెట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. 

‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు 

జగనన్న లే అవుట్‌లో స్థలాల అక్రమ అమ్మకాలపై కథనాన్ని వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’పై ఎమ్మెల్యే రక్షణనిధి ఆగ్రహంతో ఊగిపోయారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం కార్యకర్తలతో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిపై అక్కసు వెళ్లగక్కారు. తాజా వివాదం నేపథ్యంలో పెదకొమెరలో ఇచ్చిన పట్టాలను రద్దు చేయమన్నానన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపులకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అవన్నీ రెవెన్యూ అధికారులే చూసుకున్నారని, తాను నీతి, నిజాయితీ కలిగిన దమ్మున్న ఎమ్మెల్యేనంటూ వ్యాఖ్యానించారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై అసహనం వ్యక్తం చేశారు. స్పందనలో ఫిర్యాదు చేసిన వారిపై మండిపడ్డారు. పోరంబోకు స్థలాలు ఆక్రమణలో ఉన్నాయని, అలాంటి వారిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. 


Updated Date - 2022-08-14T06:10:15+05:30 IST