ఆ.. కట్టుకుందాంలే

ABN , First Publish Date - 2022-09-17T05:30:00+05:30 IST

నెలలు గడుస్తున్నాయి.. గడువు సమీపిస్తోంది.. అయినా జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి అంతగా కానరావడంలేదు.

ఆ.. కట్టుకుందాంలే
నరసరావుపేట: ఉప్పలపాడు జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణం

జగనన్న ఇళ్ల పనుల్లో జాప్యం

కాలనీల్లో నిర్మాణాలు నత్తనడకన

ఇప్పటికి 26 శాతం పనులే ప్రారంభం

42,899 ఇళ్లకు నిర్మాణం పూర్తైనవి 3973



నరసరావుపేట, సెప్టెంబరు 17: నెలలు గడుస్తున్నాయి.. గడువు సమీపిస్తోంది.. అయినా  జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి అంతగా కానరావడంలేదు. ఇళ్లను నిర్మించుకోవడంలో ఆ చూద్దాం.. తొందరేముంది కట్టుకుందాంలే.. అన్న ధోరణిలో లబ్ధిదారులు ఉన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల లక్ష్యంలో ఇప్పటికి 26 శాతం మాత్రమే ప్రారంభమయ్యాయి. వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటికి కూడా ప్రారంభమే కాలేదు. జిల్లా స్థాయి నుంచి సచివాలయ స్థాయి వరకు అధికారులు ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నా లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదు.  ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 198 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసింది. ఈ కాలనీల్లో లబ్ధిదారులకు స్థలాలను పంపిణీ చేసింది. ఈ కాలనీల్లో 42,899 గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. 2023 డిసెంబరు కల్లా అన్ని లేఅవుట్లలో నూరు శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికి కేవలం ఇళ్ల నిర్మాణ పనులు 26 శాతం మాత్రమే ప్రారంభమయ్యాయి. 42,899 గృహాలకు 3,973 గృహాల నిర్మాణం పూర్తయినట్లు సదరు శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. మౌలిక వసతుల లేమి కారణంగా పూర్తి అయిన ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. 11,115 గృహాలు ఫౌండేషన్‌ స్థాయిలోనే ఉన్నాయి. పనుల పురోగతి పరిశీలిస్తే ప్రభుత్వం ప్రకటించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే పరిస్థితులు కానరావడంలేదు. ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నది. ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటి నిర్మాణానికి నరసరావుపేటలో రూ.2.15 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించే విధంగా ఒప్పందాలు జరుగుతున్నాయి. అయితే బిల్లులు లబ్ధిదారుడి పేరుపై బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయి. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు పలువురు లబ్ధిదారులు సకాలంలో డబ్బు చెల్లించడంలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌ ఖాతాకు డబ్బు జమ అయ్యేలా గృహనిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 


వెంటాడుతున్న ఇసుక కొరత

జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత నెలకొంది. ఇసుక సరఫరా చేసే సంస్థను ప్రభుత్వం ఇటీవల మార్చేసింది. కొత్త సంస్థ వచ్చే వరకు ఇసుక సరఫరా అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఇసుక లేక ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. గృహాల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేయాలి. ఒక్కొక్క ఇంటికి సిమెంట్‌ వంద బస్తాలు అందజేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటిని నిర్మించుకుంటేనే సిమెంట్‌ సరిపోతుంది. లేకుంటే అదనంగా ఇసుకను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుక కొరత సమస్యను వెనువెంటనే పరిష్కరించకుంటే ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగే పరిస్థితి లేదు.


మౌలిక వసతులు కరవు

లేఅవుట్లలో మౌలిక వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నరసరావుపేట ఉప్పలపాడు లేఅవుట్‌కు ఉన్న ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీంతో ఇంటి నిర్మాణ సామగ్రి తరలించేందుకు నిర్మాణదారులు ఇక్కట్లు పడుతున్నారు. వర్షం కురిస్తే కాలనీకి వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఇదే దుస్థితి జిల్లాలోని అనేక లేఅవుట్లలో ఉంది. అంతర్గత రోడ్లు, మురుగుకాలువలు, విద్యుత్‌ సౌకర్యం లేక నిర్మాణదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 3,973 గృహాల నిర్మాణం పూర్తయినా వాటిలో నివాసం ఉండలేని పరిస్థితి ఉంది. 198 లేఅవుట్లకు 75 లేఅవుట్లలో విద్యుత్‌ పనులు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులను విద్యుత్‌ శాఖ నిర్వహించాల్సి ఉంది. అయితే నిధుల కొరత వల్ల విద్యుత్‌ పనుల్లో జాప్యం జరుగుతుందని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.  

Updated Date - 2022-09-17T05:30:00+05:30 IST