అమూల్‌.. ఢమాల్‌ !

ABN , First Publish Date - 2021-09-15T05:46:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా..

అమూల్‌.. ఢమాల్‌ !

‘జగనన్న పాలవెల్లువ’కు స్పందన కరువు

రోజువారీ సగటు పాల ఉత్పత్తి 12.04 లక్షల లీటర్లు

అమూల్‌ సేకరిస్తున్నది 5,876 లీటర్లే

ఇప్పటికే 16 సేకరణ కేంద్రాలు మూత

కలెక్టర్‌ సహా పది శాఖలు కసరత్తు


ఏలూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ జగనన్న అమూల్‌ పాల వెల్లువ’ కార్యక్రమానికి జిల్లాలో స్పందన కరువైంది. వ్యవసాయ, పాడి పరిశ్రమ ప్రధానంగా ఉన్న జిల్లా కావడంతో ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కలెక్టర్‌ సహా అనేక శాఖలను ఇందులో భాగస్వాములను చేసింది. అయితే ఫలితం మాత్రం సాధించలేకపోయింది. జిల్లాలో ఉత్పత్తి అయ్యే పాలలో కనీసం 0.5 శాతం పాలు కూడా అమూల్‌ పాల సేకరణ కేంద్రాలు సేకరించలేకపోతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 


ఇప్పటికే 16 సేకరణ కేంద్రాల మూత 

జిల్లాలో అమూల్‌ పాల వెల్లువ పథకాన్ని అమలు చేయడం కోసం జిల్లా యంత్రాంగం 128 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే 16 కేంద్రాలు మూత పడ్డాయి. మిగిలిన 112 కేంద్రాల్లో పాల సేకరణ జరుగుతున్నా అంతంతమాత్రంగానే ఉంది. కాగా మరో 4 సేకరణ కేంద్రాలు మూసివేత దిశలో ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న పాలు రోజుకు కేవలం 5,876 లీటర్లే. కిందటి నెల 4,407 లీటర్లు మాత్రమే సేకరించాయి. జిల్లా నుంచి మండల స్థాయి వరకూ ఉన్న అధికారులంతా పూనుకోవడంతో ఈ నెల పాల సేకరణ కాస్తంత పెరిగింది.  కాగా అమూల్‌ కోసం మూసేసిన ఏపీ డెయిరీలో మూసివేత సమయంలో కూడా రోజుకు 10 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుండేదని పాడి రైతులు చెబుతున్నారు. కాగా ప్రైవేటు పాలకేంద్రాలు 10 శాతం వెన్న ఉన్న పాలకు లీటరుకి రూ.73 ఇస్తుండగా అమూల్‌ రూ.68లే ఇస్తోంది. మరోవైపు పాల సేకరణ సొసైటీ నిర్వాహకులు వేతనాలు డిమాండ్‌ చేస్తుండగా కమీషన్‌తో సరిపుచ్చుకోమని అమూల్‌ చెపుతుండడంతో వారు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా పాలసేకరణ ఏమాత్రం పుంజుకోవడం లేదు.


అమూల్‌కు 0.5 శాతం పాలు

పశు గణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 5,01,840 పాడి గేదెలు ఉన్నాయి. వీటిలో 3,01,104 పాలు ఇచ్చేవి ఉండగా వీటి ద్వారా ప్రతి రోజూ 12 లక్షల 4 వేల 416 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో గృహ, పాక్షిక విక్రయాలకు 5 లక్షల 11 వేల 816 లీటర్లు వినియోగిస్తున్నారు. మిగిలిన 6 లక్షల 92 వేల 600 లీటర్ల పాలను పాడి రైతులు ప్రైవేటుగా విక్రయిస్తున్నారు. వీటిలో ప్రైవేటు డెయిరీలకు 2 లక్షల 42 వేల 717 లీటర్లు, సైకిల్‌ వ్యాపారులు, ప్రైవేటు పాల కేంద్రాలకు 4 లక్షల 50 వేల 893 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. ప్రైవేటు పాలకేంద్రాలు, వ్యాపారులకు అమ్ముతున్న పాలను అమూల్‌కు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కసరత్తు మొదలు పెట్టింది. అయితే ఆశించినంతగా స్పందన మాత్రం రాలేదు.ప్రస్తుతం 0.5 శాతం అంటే 5,876 లీటర్ల పాలు మాత్రమే అమూల్‌కు వస్తున్నాయి. 


కలెక్టర్‌ సహా వందల మంది కృషి

అమూల్‌ను గాడిలో పెట్టేందుకు  ప్రభుత్వం మొత్తం జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. కలెక్టర్‌ సహా, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు (రెవెన్యూ, అభివృద్ధి), పది శాఖలకు బాధ్యతలు అప్పగించింది. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కోర్‌ కమిటీలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, వెటర్నరీ, సహకార, గ్రామీ ణాభివృద్ధి, డ్వామా, పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల జిల్లా అధికారులను నియమించింది. వీరితోపాటు మండల స్థాయి అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకుంది. వెలుగు సిబ్బందికి క్షేత్ర పరిశీలన బాధ్యతలు అప్పగించింది. పైనుంచి కింది స్థాయి వరకూ ఇంత మంది అధికార గణం పూను కున్నా అమూల్‌ పరిస్థితి జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో కలెక్టర్‌ ఈ పథకంపై దృష్టి సారించారు. ఈ నెల 7న నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల సేకరణలో వేగం పెంచాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 17వ తేదీ నాటికి పాల సేకరణ రోజుకు 7,200 లీటర్లకు పెరగాలని ఆదేశాలిచ్చారు.  

Updated Date - 2021-09-15T05:46:06+05:30 IST