Kadapa జిల్లా రాయచోటిలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి‌ప్.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి.. అర్హులెవరు..!?

ABN , First Publish Date - 2021-12-19T21:43:42+05:30 IST

ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్ని అంటి మధ్య తరగతి..

Kadapa జిల్లా రాయచోటిలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి‌ప్.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి.. అర్హులెవరు..!?

  • 36 ఎకరాల్లో లేఔట్‌    
  • 3 క్యాటగిరీల్లో ప్లాట్లు
  • ఈనెల 20న ప్రారంభం 
  • ప్లాట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు 
  • రేపు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌

కడప : రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్ని అంటి మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో స్థలాలు ఇచ్చేందుకు గాను జగన్‌  సర్కార్‌ ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎంఐజీ) లేఔట్లను పట్టణాభివృద్ధి సంస్థల నేతృత్వంలో వేస్తున్నారు. జిల్లాలో అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో రాయచోటిలోని దిగవ అబ్బవరంలో 36 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌టౌన్‌షి‌ప్ లేఔట్‌ను వేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 20న వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.


స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో ప్లాట్లు ఇవే..

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి‌ప్‌లో ప్లాట్లను మూడు భాగాలుగా వేస్తున్నారు. 3 సెంట్లు (150 చ.గ.), 4 సెంట్లు (200చ.గ.), 5 సెంట్లు (240 చ.గ.). మూడు సెంట్ల ప్లాట్‌ విలువ రూ.8,39,850, నాలుగు సెంట్ల ప్లాట్‌ విలువ రూ.11,19,800, ఐదు సెంట్లది రూ.13,43,760గా ధర నిర్ణయించారు.


దరఖాస్తు ఇలా..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 20న ఈ స్మార్ట్‌టౌన్‌షి‌ప్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. ఆరోజు నుంచి నెల రోజుల పాటు ప్లాట్లు కావాల్సిన వారు యూనిట్‌ విలువలో 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. మూడు సెంట్ల ప్లాట్ల కోసమైతే లబ్ధిదారుని వాటా రూ.80 వేలు, నాలుగు సెంట్లు అయితే రూ.1.10 లక్షలు, అయిదు సెంట్లు రూ.1.30 లక్షలు చెల్లించాలి. ఒక్కో లేఔట్లో 289 ప్లాట్లు వేస్తారు. ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేసి మిగతా వారికి డిపాజిట్లు వెనక్కు చెల్లిస్తారు. లేఔట్లలో ప్రధాన రోడ్డు 60 అడుగులు, సీసీ రోడ్లు 40 అడుగులు, ఫుట్‌పాత్‌, తాగునీరు, అండర్‌ డ్రైనేజీ, విద్యుత్‌ దీపాలు, ఇతర వసతులు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.


అర్హులు వీరే...

ఒక్క కుటుంబానికి ఒక్క ప్లాటు మాత్రమే. 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తుండాలి. ఆధార్‌కార్డు తప్పనిసరి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18లక్షలలోపు ఉండాలి. ప్లాట్లు పొందిన తరువాత నెలలోపు యూనిట్‌ కాస్టులో 30 శాతం, మరో అరు నెలలకు 30 శాతం సంవత్సరంలోపు 30 శాతం చొప్పున డబ్బు చెల్లించాలి. వాయిదాల చెల్లింపులో ఆలస్యమైతే 0.5 శాతం వడ్డీ చెల్లించాలి. 


లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు

అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (అడా) నేతృత్వంలో మధ్య తరగతి కుటుంబాల కోసం అన్ని వసతులతో కూడుకున్న లేఔట్లను జగనన్న స్మార్ట్‌ టౌన్‌సిటీలో వేస్తు న్నాం. జిల్లాలో తొలివిడతలో రాయచోటిలో వేస్తు న్నాం. ప్లాట్ల కేటాయింపు పారదర్శ కంగా ఉంటుంది. లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తాం. జిల్లాలో మరికొన్ని చోట్ల టౌన్‌షి‌ప్‌లు వేసేందుకు అన్వేషిస్తున్నాం. - సింగసాని గురుమోహన్‌, అడా చైర్మన్‌.

Updated Date - 2021-12-19T21:43:42+05:30 IST