జగనన్నా ఇదేంది?

ABN , First Publish Date - 2021-10-01T07:59:25+05:30 IST

ఏడాదికంతా 8000 ఇళ్లతో కళకళలాడుతుందని చెప్పిన జె సిటీ.. ఇప్పుడు ఈసురోమంటూ ఉంది.

జగనన్నా ఇదేంది?
గతేడాది డిసెంబరు 28వ తేది ఇలా.. ఇప్పుడు మారిందిలా..

ఆగమేఘాలపై ఇళ్లపట్టాలు ఇచ్చారు

పేదలు కోరుకుంటే మేమే కట్టించి ఇస్తాం అని చెప్పి మడమ తిప్పారు

ఇళ్లు నిర్మించుకుందామంటే వసతుల్లేవు 

చెప్పుకుందామంటే అధికారులు ఆవైపు రారు

జంతర్‌ మంతర్‌ జగనన్న కాలనీ



పేదలకు వాడలను కాదు, మేం ఊళ్లనే నిర్మిస్తున్నాం. ఇక్కడ త్వరలో ఒక నగరం వెలుస్తుంది. జె సిటీ... ఒక అద్భుతం ఆవిష్కారం కాబోతోంది. పేద ప్రజలు నగరవాసులు కాబోతున్నారు. అంతా మీ కళ్ల ముందే జరుగుతుంది. 

ఈ లేఅవుట్‌లో అక్కచెల్లెమ్మలకు అన్ని వసతులూ కల్పిస్తున్నాం.. ఇక్కడే ఆర్బీకే సెంటర్స్‌.. ఇక్కడే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌.. ఇక్కడే  వార్డు సెక్రటేరియట్‌.. ఇక్కడే కళ్యాణమండపం,  ఫంక్షన్‌ హాల్‌.. ఇక్కడే పార్కులొస్తున్నాయ్‌.. గవర్నమెంట్‌ హైస్కూలు వస్తుంది..ప్రైమరీ స్కూళ్లు వస్తున్నాయి.. ఆటోస్టాండ్‌..వైయస్సార్‌ జనతాబజార్‌ వస్తుంది..

- సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, 28 డిసెంబర్‌ 2020


శ్రీకాళహస్తి, సెప్టెంబరు30: శ్రీకాళహస్తి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఊరందూరు సమీపంలో పారిశ్రామికవాడకు కేటాయించిన స్థలంలో 163ఎకరాల్లో ఆగమేఘాలమీద రూపుదిద్దుకున్న జగనన్న కాలనీలో 8000 మందికి స్థలాలు ఇచ్చారు. రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల ప్రజలకు ఇక్కడ ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఏడాదికంతా 8000 ఇళ్లతో కళకళలాడుతుందని చెప్పిన ఈ ప్రాంతం ఇప్పుడు ఈసురోమంటూ ఉంది.  వానలకు బురదమయం అయిపోయిన రోడ్లు, నిలిచిన నీళ్లు, అక్కడొకటీ అక్కడొకటీ లేచిన పునాదులు.. ‘జె సిటీ’ ఇదేనా అని ఆశ్చర్యపోతారు చూసినవాళ్లు.  8000 ఇళ్లలో శ్లాబ్‌ మట్టానికి గోడలు లేసిన ఇళ్లు ఎన్నో తెలుసా? కేవలం ఆరు మాత్రమే. ఆ ఆరు కూడా శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాళెం, చల్లపాళేనికి చెందిన లబ్ధిదారులవి. ఇంకో 60 మంది లబ్ధిదారులు ఇప్పుడిప్పుడు పిల్లర్ల కోసం పనులు మొదలు పెడుతున్నారు. 10 నుంచి 20మంది లబ్ధిదారులు కలిసి ఒకే కాంట్రాక్టరుకు నిర్మాణ పనులు అప్పగించే ప్రయత్నాలు తాజాగా కొందరు చేస్తున్నారు. ఈ పద్ధతిలో మరో వంద మంది ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధపడ్డారు. 


తడిసి మోపెడవుతున్న ఖర్చు

పేదలు కోరుకుంటే ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని ఇచ్చిన హామీ తొలిలోనే భగ్నం అయ్యింది. లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకుంటే దశలవారీగా బిల్లులు ఇస్తామని చెప్పినా,  బిల్లులు సకాలంలో వస్తాయన్న నమ్మకం లేదు. అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టాలి. వడ్డీల్లో కూరుకుపోతామన్న భయం లబ్ధిదారుల్లో ఉంది. ఇక విసిరేసినట్లున్న ఈ ప్రాంతంలో నిర్మాణపనులు ఖర్చుతో కూడుకున్నవి. సరైన నీటి సౌకర్యం కల్పించలేదు.  10 బోర్లు వేసినా, వాటికి కరెంటు కనెక్షన్‌ లేదు.  ట్యాంకర్‌తో నీళ్లు తోలించుకోవాలంటే ఒకసారికి 700 చెల్లించాలి. నెల రోజుల పాటూ పని జరుగుతుంటే ట్యాంకర్‌ అక్కడే పెట్టుకోవాలి. ఇందుకు నెలకి 9000 బాడుగ చెల్లించాలి. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సొంత ఊళ్ల నుంచి రోజూ అక్కడికి మోసుకు వెళ్లాలి. నిర్మాణస్థలంలో దాచుకునే వసతి లేదు గనుక సాయంత్రం తిరిగి వెంట తెచ్చుకోవాలి. బస్సులు, ప్యాసింజర్‌ ఆటోలు సరిగా తిరిగే మార్గం కాదు. ఉదయం తమను, సామగ్రిని వదిలేసి.. సాయంత్రం వచ్చి తీసుకెళ్లాలంటే రోజుకి 1000 రూపాయలు చెల్లించాలి. సీఎం ప్రారంభిస్తారని హడావుడిగా వేసిన గ్రావెల్‌ రోడ్లు చిన్న పాటి వర్షాలకే చిత్తడిగా మారుతున్నాయి. నిర్మాణ సరుకులతో వచ్చే ట్రాక్టర్ల్లు దిగబడిపోతూ చుక్కలు చూపిస్తున్నాయి. ఇక కూలి పనులు మానుకుని అక్కడికి వెళ్లి పనులు చేసుకోవడం, లేదా పర్యవేక్షించడం లబ్దిదారులకు భారంగా మారుతోంది. నిలువ నీడ కూడా లేని ఆ ప్రాంతంలో పని చేయడానికి భవననిర్మాణ కార్మికులు కూడా రావడం లేదు. ఇన్నింటినీ భరించి ఇళ్లు నిర్మించుకుంటున్న కొద్ది మందికీ మూడో దశ దాటుతున్నా బిల్లులు చేతికి రాలేదు. దీంతో జెసిటీకి ఆదిలోనే హంసపాదు పడినట్లయింది. 


ఇదీ ఊరందూరు జగనన్న కాలనీ ప్రగతి...

ఇచ్చింది : 8000 

పిల్లర్ల పనుల్లో : 60

శ్లాబ్‌ మట్టానికి గోడలు లేచినవి : 6


ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ తావు గురించి సరిగ్గా తొమ్మిది నెలల కిందట వైసీపీ నాయకులు చెప్పిన మాటలు ఇవి. జనం నమ్మారు. ఆశ పడ్డారు. పొలోమంటూ పరుగులు తీశారు. పట్టాలు అందుకుని సంబరపడ్డారు. ప్రయివేటు రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌కి దీటుగా కనిపించిన ఈ లేఅవుట్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  గత డిసెంబర్‌ 28న ప్రారంభించారు. డ్రోన్‌ కెమెరాలతో తీసిన వీడియోను బాహుబలి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ప్రదర్శించారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు దగ్గర ఒక ఉత్సవంలా సాగిన కార్యక్రమం కళ్లముందే కరిగిపోయింది. రాజమౌళిని మించిన గ్రాఫిక్స్‌ మాయాజాలంగా మిగిలిపోయింది.  సెప్టెంబర్‌ 15 నాటికి పునాది స్థాయికి నిర్మాణాలు జరగాల్సి ఉంటే, 8వేలలో కనీసం 60 కూడా ఆ స్థాయికి నిర్మాణాలు పూర్తి కాలేదు. ఈ లెక్కన అక్టోబరు నెలాఖరుకు శ్లాబ్‌ లెవల్‌కు గోడలు లేవడం సాధ్యమయ్యేలా లేదు. 


వానొస్తే కష్టమే!

 మాది ఏర్పేడు. 17 కిలోమీటర్ల దూరంలో స్థలం ఇచ్చారు. ఇంటి పనుల కోసం ఇక్కడికి , చేరుకోవాలంటే రాను, పోను ఆటోలకు  రోజుకు రూ.1000 అవుతోంది. నీటి ట్యాంకర్ల కోసం వేలకు వేలు ఖర్చవుతోంది. వాన కురిస్తే మోసుకుపోయిన సిమెంటు తడిచి పనికిరాకుండా పోతోంది.  ఇప్పటికి మూడు సార్లు సిమెంటు బస్తాలు తడిచిపోయి నష్టపోయాం.ఇట్లా ఉంటే ఇల్లెట్లా కట్టుకోవాలో అర్థమే కావడం లేదు.


ఎవరికి చెప్పుకోవాలి?

ఇల్లు కట్టుకుందాం కదా అని ఆశపడితే అవస్థలు ఎదురవుతున్నాయి. కూలి పనులు మానుకుని వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. దీంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి.  మా బాధలు చెప్పుకుందామన్నా ఎవరూ ఈ పక్కకే రావడం లేదు. 

Updated Date - 2021-10-01T07:59:25+05:30 IST