జగన్మోహనమా, జనకంటకమా?

ABN , First Publish Date - 2021-05-30T07:20:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను...

జగన్మోహనమా, జనకంటకమా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, రాజకీయంగా మరింత బలపడాలనే దృక్పథంతో తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తున్నవారు ఉన్నట్టుగానే, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే బాధ కలుగుతున్నదని జగన్‌ తరచూ అంటూ ఉండేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం విన్నవారు ఇన్నాళ్లకు రాజకీయాలను సంస్కరించడానికి ఒకరు వచ్చారు అని మురిసిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది అని భావించారు. రమణ దీక్షితులుకు అనిపించినట్లుగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దివి నుంచి భువికి దిగి వచ్చాడన్న అనుభూతి కలిగించారు. అయితే, ఈ భావన తొలగిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. కుబుసం జారిపోగానే అసలు రూపం బయటపడింది. రాజకీయ ప్రత్యర్థులను వేటాడి వేధించడమే ఆయన ప్రధాన ఎజెండా అయింది. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పంచిపెడుతూ బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకుంటూ, అదే సమయంలో కక్ష సాధింపులకు తెర తీశారు. ఈ క్రమంలో జేసీబీ, ఏసీబీ, పీసీబీలను ఆయన అస్ర్తాలుగా మలచుకున్నారు. వీటితోపాటు సీఐడీ  విభాగాన్ని ప్రత్యర్థుల పైకి ఉసికొల్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞాపకాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ముందుగా జేసీబీలను పంపి ప్రజావేదికను కూల్చివేయించారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అప్పట్లో చాలామంది సమర్థించారు. ప్రజావేదికను ఆగమేఘాలపై కూల్చివేసిన అధికారులు రాష్ట్రంలోని ఇతర అక్రమ నిర్మాణాల గురించి మరిచిపోయి కేవలం ప్రతిపక్షమైన తెలుగుదేశం నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చడానికే పరిమితమయ్యారు. అదే సమయంలో అవినీతి నిరోధక శాఖ.. ఏసీబీని కూడా జగన్‌ రెడ్డి ప్రయోగించారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై ఏసీబీ ద్వారా కేసులు నమోదు చేయించి చివరకు ఆయన ఆత్మహత్య చేసుకునే వరకు వేటను కొనసాగించారు. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి.. పీసీబీకి పని కల్పించారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో పీసీబీ అధికారులు జువారీ సిమెంట్స్‌, అమర్‌ రాజా బ్యాటరీస్‌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలను మూసివేయించడానికి పూనుకున్నారు. యాభై శాతం ఓట్లతో ప్రజలు తనకు అసాధారణ అధికారం అప్పగించినందున చట్టాలు, రాజ్యాంగం తనకు అడ్డు రాకూడదని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే ఆయన తరచుగా న్యాయవ్యవస్థతో ఘర్షణ పడుతున్నారు. పాలన న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని సూచించిన న్యాయమూర్తులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేయడానికి వెనుకాడలేదు. నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అధికారులు సైతం ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసి న్యాయస్థానాలతో పలుమార్లు చివాట్లు తిన్నారు. న్యాయస్థానాలు కొట్టివేసిన ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన నోట్‌ ఫైల్స్‌ చూస్తే అధికారుల బండారం బయటపడుతుంది. న్యాయస్థానాలు అడ్డుపడిన ప్రతి సందర్భంలోనూ తప్పులను సరిదిద్దుకోకపోగా జగన్‌ అండ్‌ కో ఎదురుదాడికి పూనుకున్నారు. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాలకు బ్రేకులు వేసినప్పుడు, పేదలకు మేలు చేయాలనుకుంటే దుష్టశక్తులు అన్నీ ఏకమై అడ్డుకుంటున్నాయని నిందిస్తున్నారు. 


నిన్నటి కంటే నేడు బాగుందా?

అల్లరి చేసే చిన్నపిల్లలను వారించినా వినకుండా దెబ్బలు తగిలించుకుంటారు. అయినా తమకు ఏమీ జరగనట్టుగానే దులుపుకెళ్లిపోతుంటారు. జగన్‌ అండ్‌ కో కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా అమాయక ప్రజలను కవచంగా వాడుకుంటూ, ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ దులిపేసుకొని తిరుగుతున్నారు. చంద్రబాబుపై కోపంతో గానీ లేదా ఆయన జ్ఞాపకాలు ఉండకూడదన్న ఉద్దేశంతో గానీ రాజధాని అమరావతి ఉసురుతీయడానికి పూనుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనను గుర్తించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇష్టపడటం లేదంటే ఆ రైతులపై ఆయనకు ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమరావతిని అంతమొందించడం కోసం మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు రెండేళ్లు గడిచిపోయాయి. మూడు రాజధానుల సంగతి దేవుడెరుగు, పురుడు పోసుకున్న రాజధాని అమరావతిని కూడా పురిట్లోనే గొంతు నులిమారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత కూడ రాష్ర్టానికి రాజధాని లేని పరిస్థితి కల్పించారు. ఏడేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండిందో ఇప్పుడూ అలాగే ఉంది. ఈ దుస్థితికి తానే కారణమన్న వాస్తవాన్ని విస్మరించి మనకు బెంగళూరు, చెన్నయ్‌, హైదరాబాద్‌ వంటి మహానగరాలు లేవు అని జగన్‌రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. ‘రాజకీయ ప్రత్యర్థులపై వేధింపుల విషయం మనకెందుకులే! సర్దుకుపోదాం’ అనుకునే వారికి రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకు కూడా కానరావడం లేదు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకానికి కూడా పునాది రాయి వేయలేదు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊదరగొట్టిన జగన్‌రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఎదురుచూసే వారికి అది అత్యాశగా కనిపిస్తోంది. అదేమంటే నాలుగు భవనాలు వచ్చినంత మాత్రాన అభివృద్ధి చేసినట్టు కాదని జగన్‌ అండ్‌ కో అంటూ ఉంటారు. ‘నిన్నటి కంటే ఇవాళ బాగుండాలి. నేటి కంటే రేపు మరింత బాగుండాలి. అదే అభివృద్ధి’ అని జగన్‌రెడ్డి ఈ మధ్య సెలవిచ్చారు. నిజమే, నిన్నటి కంటే ఇవాళ, రేపు బాగుండాలనే అందరూ కోరుకుంటారు. కూలో నాలో చేసుకునేవారు సైతం తమ పిల్లలు తమలాగా బతకకూడదని, చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకోవాలనే కోరుకుంటారు. ఉద్యోగాలు లభించాలంటే పరిశ్రమలు ఏర్పాటు కావాలి, కంపెనీలు రావాలి కదా! అప్పులు చేసి సంక్షేమం పేరిట పంచిపెట్టడమే అభివృద్ధి అని ఏ సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్త కూడా చెప్పలేదు. ఈ వాస్తవాలను గ్రహించిన అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. అడపా దడపా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి వచ్చే తెలంగాణ మంత్రులు, ఇతర నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూసి జాలిపడుతున్నారు. అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యం దెబ్బతింటే పాలకులు రాజకీయంగా కూడా దెబ్బతింటారని పాత అనుభవాలు చెబుతున్నాయి.


నాటి గొంతులు నేడు ఏమయ్యాయో!

జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది నాయకులు గొంతు చించుకున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ, తిరుపతి పరిసరాలలో సెల్‌ఫోన్ల కంపెనీలు ఏర్పాటయ్యాయి. కర్నూలు జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇప్పుడు జగన్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన కూడా కనీసం కాగితాల మీద కూడా లేకుండా పోయింది. అయినా అప్పుడు రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడినవారు, ఉద్యమించినవారు తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ రాయలసీమకు అన్యాయం జరుగుతోందని అలజడి సృష్టించడం గమనార్హం. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన బాట పట్టి కంచాలు మోగించిన వాళ్లు ఇప్పుడు గత ప్రభుత్వం అమలుచేసిన ఐదు శాతం రిజర్వేషన్లను తొలగించినా కూడా నోరు మెదపడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందంటే భయం వల్ల కావచ్చు లేదా జగన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటమే ఆ ఆందోళనల వెనుక పరమార్థమై ఉండవచ్చు. మేధావులు, తటస్థులుగా చెప్పుకొన్న పలువురు అప్పట్లో ఊరూవాడా తిరిగి గత ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఇప్పుడా గొంతుల్లో కొన్నింటికి పదవులు లభించాయి. బహుశా అందుకే కాబోలు రాష్ట్రం గతి తప్పుతున్నప్పటికీ ఒక్క గొంతు కూడా పెగలడం లేదు. జగన్‌ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న సంక్షేమం విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంత్రులు సైతం ఆంతరంగిక సంభాషణల్లో ‘ఇలా పంచుకుంటూ పోతే రాష్ట్రం ఏం కావాలి? భవిష్యత్తు అంధకారం అవుతుంది’ అని ఆందోళన చెందుతున్నారు. తమ జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సహకరించవలసిందిగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే స్వయంగా సినీ నటుడు సోనూ సూద్‌ను అర్థించారంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో అర్థం కావడం లేదా? ప్రత్యర్థుల పైకి ఉసిగొల్పడానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎంపిక చేసుకున్న కొద్దిమంది మంత్రులు మినహా మిగతా మంత్రులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైనవారు ఎక్కడ ఉన్నారో వెదకాల్సిన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలకు సహజంగానే తావుండదు. అయితే జగన్‌రెడ్డి దగ్గర అధికారమంతా కేంద్రీకృతం అవడంతో మిగతా వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఎవరెవర్ని తిట్టాలో వారిని తిట్టడానికే మంత్రులు, ఎమ్మెల్యేలు పరిమితమయ్యారు. అధికారులు సైతం పై నుంచి వస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నామా లేదా అనే ఆలోచిస్తున్నారు గానీ ఉచితానుచితాల గురించి ఆలోచించడం లేదు. ఈ కారణంగానే రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలుకు నోచుకోవడం లేదు. అదేమని ప్రశ్నించే వారిపై, వారు న్యాయమూర్తులైనా సరే నీలిమూక ఉన్మాదంతో విరుచుకుపడుతున్నది. పాలనలో అరాచక ధోరణులు చొరబడినప్పుడు ఎవరికీ రక్షణ ఉండదు.


ఒక్క చాన్స్‌ అంటూ...

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడిని ఏయే అంశాలపై విమర్శించారో ఇప్పుడు అవే పనులను కనీస వెరపు కూడా లేకుండా జగన్‌రెడ్డి అమలుచేస్తున్నారు. కడుపు మండినవాడు తన బాధను సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా వ్యక్తం చేస్తే కేసులు పెట్టడం ఏమిటని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు రాష్ట్రంలో భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేశారు. నోరెత్తితే చాలు కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. మీడియాను కట్టుబానిసగా మార్చుకున్నారు. కుదరదన్న మీడియాపై కేసులు పెట్టడం మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్‌రెడ్డి తన మీడియాను ముఖ్యమంత్రి అనుమతించడం లేదని ప్రెస్‌కౌన్సిల్‌కు సైతం ఫిర్యాదులు చేయించారు. ఇప్పుడు అదే జగన్‌రెడ్డి చేస్తున్నదేమిటి? కొన్ని న్యూస్‌ చానళ్లను ఏకంగా శాసనసభ సమావేశాలకు సైతం అనుమతించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! అభివృద్ధి గురించి ఎంత ఆలోచిస్తున్నారో తెలియదు గానీ ప్రత్యర్థులను ఏయే కేసుల్లో ఇరికించాలనే దానిపై తాడేపల్లి ప్యాలెస్‌ తన దృష్టి అంతా కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఐదేళ్ల పదవీకాలంలో రెండేళ్లు గడచిపోయాయి. చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం కనుక ఇక నికరంగా మరో రెండేళ్ల వ్యవధి మాత్రమే ముఖ్యమంత్రికి మిగిలి ఉంది. వచ్చే రెండేళ్లలో ఆయన ఏమేం చేయబోతున్నారన్న దానిపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇలాగే అభివృద్ధి గురించి ఆలోచించకుండా అప్పులు చేసి పంచిపెట్టడానికే పరిమితమైతే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు గురించి మర్చిపోవచ్చు. 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది జగన్‌ అభీష్టం. అయితే కేవలం పంచుకుంటూ పోవడం వల్ల 30 ఏళ్లు అధికారంలో కొనసాగవచ్చునని ఆయన అనుకోవడం భ్రమ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇకపై అప్పులు కూడా పుట్టవు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కంపెనీలు, కార్పొరేషన్లు చేసిన అప్పులకు వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జెన్‌కో, ట్రాన్స్‌కో వంటి సంస్థలు కూడా నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) ప్రకటితమవడం తథ్యం. అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. దీంతో ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇది గమనించిన కేసీఆర్‌ ఇప్పుడు ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని గుర్తించడం అత్యవసరం. అయితే ఆయన ఆలోచనా ధోరణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రజా ధనాన్ని పేదలకు పంచుతూ పోతే చాలు– అభివృద్ధి గురించి వారికి ఏమీ పట్టదని ఆయన నమ్ముతున్నట్టు అనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావడంతో పాటు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కూడా మంచి మెజారిటీ లభించింది. కనుక తన ఫార్ములాపై జగన్‌లో మరింత నమ్మకం ఏర్పడి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే తనను విమర్శించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు పైకి సీఐడీని ఉసిగొల్పారు. సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు రఘురాజు అరికాళ్లకు గాయాలు అయ్యాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది కనుక, ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఎవరు కారకులన్నది విచారణ జరిగితే గానీ తేలదు. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తులనే టార్గెట్‌ చేస్తూ వచ్చిన నీలిమూక ఇప్పుడు సుప్రీంకోర్టును సైతం టార్గెట్‌ చేస్తోంది. దేశద్రోహం కేసుల్లో ఇతరులకు బెయిల్‌ ఇవ్వకుండా రఘురాజుకు మాత్రమే బెయిల్‌ ఇవ్వడం ఏమిటి? అని కూనిరాగాలు తీయడంతో పాటు, కస్టడీలో తాను గాయపడిన సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రఘురాజు దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదుల జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ విభాగాన్ని తొలగించడాన్ని కూడా తప్పుబట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. తెలియని వారికి తెలియజెప్పవచ్చు. తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నిందలు వేసే వారిని ఎవరూ ఏమీ చేయలేరు. రఘురాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ విభాగమే కదా! అలాంటప్పుడు నీపై విచారణకు అంగీకరిస్తావా? అని ఏ న్యాయస్థానమైనా అడుగుతుందా? రాష్ట్ర  ప్రభుత్వాన్ని, సీఐడీని ప్రతివాదులుగా కొనసాగిస్తే వారు సహజంగానే సీబీఐ విచారణను వ్యతిరేకిస్తారు. ఒక ప్రైవేటు వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై సంబంధిత శాఖ చర్య తీసుకోవడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కేసు నమోదు చేసి విచారణ జరపవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తారు కదా! ఇలాంటప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లేదా వ్యవస్థకు నోటీసులు జారీ చేసి అనుమతి కోరరు కదా? విచారణ అధికారి సైతం నిందితుల అనుమతితో విచారణ చేపట్టరు కదా? అలాంటప్పుడు సుప్రీంకోర్టు చర్య అసాధారణంగా ఉందని నిందించడం అజ్ఞానం కాదా? 


పాపం... పుణ్యం... 

మొత్తంమీద ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారా, అప్రతిష్ఠ మూటగట్టుకున్నారా అంటే ఏం చెప్పగలం? ప్రస్తుతానికి జగన్‌రెడ్డి రాజకీయం బలంగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఆ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్థితి. రావణాసురుణ్ణి ఉద్దేశించి, ‘రావణా నీవు చేసిన పుణ్యాలన్నీ ఇప్పుడు నీవు చేసిన పాపం వల్ల నిరర్థకమయ్యాయి. ఇకపై నిన్ను ఏ పుణ్యమూ కాపాడలేదు’ అని హనుమంతుడు అంటాడు. జగన్‌రెడ్డికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఆయన లేదా ఆయన తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమో కాదో తెలియదు గానీ జగన్‌రెడ్డికి అపూర్వ అవకాశం లభించింది. 50 శాతానికి పైగా ప్రజలు ఓట్లేసి 151 సీట్లలో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన పుణ్యం చేస్తున్నారా? పాపం చేస్తున్నారా? రాష్ర్టానికి మంచి చేస్తున్నారా? చెడు చేస్తున్నారా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం పుణ్యం అనే ఆయన ఖాతా నిల్వ క్రమంగా కరిగిపోతోంది. గతంలో న్యాయస్థానం తనకు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలని రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ వేయడాన్ని జగన్‌రెడ్డి సహించలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే సీఐడీని ప్రయోగించి రఘురాజును అరెస్టు చేయించారని అంటున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్‌ లభించడంతో మరో కేసులో రఘురాజును అరెస్టు చేయించడానికి తాడేపల్లి ప్యాలెస్‌లో వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఈ తరహా కక్ష సాధింపులను కొనసాగించినంత కాలం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. తన బెయిల్‌ రద్దు కావడానికి జగన్‌ చర్యలు దోహదపడుతున్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతు న్నారు. పిటిషన్‌ వేసిన రఘురాజును వేధిస్తూ పోతే బెయిల్‌ రద్దవడానికి అదే ప్రధాన ప్రాతిపదిక అవుతుందని వారు భావిస్తున్నారు. అయితే, బెయిలు రద్దయినా ముఖ్యమంత్రిగా జగన్‌ కొనసాగుతారు. కాకపోతే చంచల్‌గూడ జైలు నుంచో లేక మరో జైలు నుంచో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను పాలించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిణామం జగన్‌కే కాదు రాష్ర్టానికి కూడా అవమానకరం. అయితే దీన్ని కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోగల తెంపరితనం జగన్‌ అండ్‌ కో సొంతం. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్‌ను పెత్తందారీ దుష్టశక్తులు అన్నీ కలసి జైలుకు పంపాయని ప్రచారం చేయడానికి నీలిమూక ఎలాగూ సిద్ధంగా ఉంటుంది కదా! ఇంకేముందీ మళ్లీ జగన్‌రెడ్డికి బోలెడంత సానుభూతి లభిస్తుందని ఆయన అనుయాయుల అంచనాగా చెబుతున్నారు. ఈ తరహా ఆలోచనల నుంచి జగన్‌ అండ్‌ కో బయటపడనంత వరకు ఆంధ్రప్రదేశ్‌లో కక్షలు, కార్పణ్యాలు కొనసాగుతూనే ఉంటాయి. గుణం కంటే కులం ముఖ్యమనుకునే సమాజం కనుకే ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అన్న జగన్‌ విజ్ఞప్తికి స్పందించిన జనం ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ ముఖచిత్రానికి ప్రజలు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ‘యథా ప్రజా తథా రాజా’!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-05-30T07:20:54+05:30 IST