జగనన్న లో‘పాలు’

ABN , First Publish Date - 2022-10-04T06:36:06+05:30 IST

జగనన్న పాలవెల్లువ జిల్లాలో కనిపించడం లేదు. ప్రయోగం ఫెయిలైంది. రోజురోజుకూ పాలు పోసేవారు కరువై కేంద్రాలు మూతపడుతున్నాయి.

జగనన్న లో‘పాలు’
తాళ్లూరు మండలం మాధవరంలో మూతపడిన అమూల్‌ కేంద్రం

రోజుకు 10వేల లీటర్లు మించి రాని దుస్థితి

జిల్లా పాల ఉత్పత్తిలో అది 2 నుంచి 3 శాతమే

రుణాలు పొందిన వారు పోయని పరిస్థితి

వృథా ప్రయాసగానే ప్రభుత్వ ఉద్యోగుల శ్రమ

సగం మండలాల్లో కూడా సేకరణ లేదు

జిల్లావ్యాప్తంగా పలు కేంద్రాలు మూత

పాలు అధికంగా ఉత్పత్తయ్యే తాళ్లూరు మండలంలో 21 పాలవెల్లువ కేంద్రాలను మొదట్లో ఏర్పాటు చేశారు. వాటిలో 14 మూతపడ్డాయి.   7 కేంద్రాలు మాత్రమే నడుస్తున్నాయి. శివరాంపురంలో 80, విఠలాపురంలో 50, తాళ్లూరులో 12, బెల్లంకొండవారిపాలెంలో 7, బొద్దికూరపాడులో 4, దారంవారిపాలెంలో 5, లక్కవరంలో 10 లీటర్ల వంతున మొత్తం  168 లీటర్ల పాలు పడుతున్నారు.

ముండ్లమూరు మండలంలో మొత్తం 22 పాలవెల్లువ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. వాటిలో 10 కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన 12 కేంద్రాలన్నింటిలో కలిపి కేవలం 1,700 లీటర్ల పాలు వస్తున్నాయి. మొత్తం మండలంలో పాల ఉత్పత్తి 30వేల లీటర్లకుపైగానే ఉంటోంది.

రాష్ట్రప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన జగనన్న పాలవెల్లువ పథకం జిల్లాలో వెలవెలబోతోంది. పాడి రైతులు ఆవైపు కన్నెత్తిచూడక చతికిలపడింది. రోజుకు పట్టుమని పది వేల లీటర్ల పాలసేకరణ చేయడం కూడా గగనంగా మారింది. ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి, వందలాది మంది వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులను భాగస్వాములను చేయడంతో పాటు మహిళా రైతులకు రుణాలు ఇప్పిస్తున్నా స్పందన కరువైంది.

ఒంగోలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జగనన్న పాలవెల్లువ జిల్లాలో కనిపించడం లేదు. ప్రయోగం ఫెయిలైంది. రోజురోజుకూ పాలు పోసేవారు కరువై కేంద్రాలు మూతపడుతున్నాయి. వేల లీటర్ల నుంచి వందల లీటర్లకు పడిపోయింది. సహకార డెయిరీలను నిర్వీర్యం చేస్తూ 2020 నవంబరులో గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థ భాగస్వామ్యంతో వైసీపీ ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని చేపట్టింది. అందులో తొలివిడతగానే జిల్లాలో దానిని చేపట్టారు. అలా 2020 నవంబరు 20న అమూల్‌ ప్రాజెక్టు జగనన్న పాలవెల్లువ పేరుతో ప్రారంభం కాగా అప్పటివరకు ఏదో ఒకస్థాయిలో పనిచేస్తున్న సహకార రంగంలోని ఒంగోలు డెయిరీని మూసేసి దాన్ని అమూల్‌కు అప్పగించారు. ఏపీడెయిరీ డెవలప్‌మెంట్‌ సమాఖ్య ద్వారా ఈ ఒప్పందం జరగ్గా అప్పట్లోనే 151 గ్రామాల్లో కోట్లు వెచ్చించి పాల సేకరణ, వెన్న పరిశీలన ఇతర సామగ్రిని ప్రభుత్వం సమకూర్చింది. అలా ఈ పథకాన్ని  జిల్లాలో ప్రారంభించి దాదాపు 20మాసాలు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం పరిస్థితిని చూస్తే జిల్లాలో రోజువారీ పదివేల లీటర్ల పాలసేకరణ చేయడమే గగనంగా మారింది.


వస్తోంది అరకొరగానే.. 

జిల్లాలో రోజువారీ ఉత్పత్తిలో పాలవెల్లువ కేంద్రాలకు వచ్చే పాలు రెండు నుంచి మూడు శాతంగానే కనిపిస్తోంది. పాడి పరిశ్రమ ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున గ్రామీణ ప్రజలకు ఆసరాగా ఉంటుండగా రోజువారీ గృహ అవసరాలకు పోను మంచి సీజన్‌లో ఆరు లక్షల లీటర్లకుపైగా పోస్తారు. దాదాపు 60కి పైగా ప్రైవేటు డెయిరీలు జిల్లాలో పాలసేకరణ చేస్తున్నాయి. జిల్లా విభజన జరిగాక కూడా రోజువారీ ప్రస్తుత సమయంలో నాలుగు నుంచి ఐదు లక్షల లీటర్లు డెయిరీలకు పోస్తుంటారు. అలాంటిది పాలవెల్లువకు పదివేల లీటర్లకు మించి రావడం లేదు. అసలు జిల్లాలోని సగం మండలాల్లో కూడా సేకరణ లేదు. మొత్తం 38 మండలాలు జిల్లాలో ఉండగా కేవలం 14 మండలాల నుంచి మాత్రమే పాలు వస్తుండగా చాలాచోట్ల గతంలో ఉన్న కేంద్రాలు కూడా మూతపడిపోయాయి. వాస్తవానికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం పాలవెల్లువ పథకానికి భారీగానే వెచ్చించింది. పాడి రైతులకు భారీగా ప్రయోజనం అంటూ పెద్దఎత్తున ప్రచారం కూడా నిర్వహించింది. 


ఎంతో హడావుడి చేసినా..

జిల్లాలో పథకం ప్రారంభం, అనంతరం కొనసాగింపు కోసం కోట్లాది రూపాయల నిధులు, వందలాది మంది ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం వెచ్చించింది. గ్రామాల్లో పాలకేంద్రాలు ఏర్పాటు, అందుకోసం మహిళా రైతులను సభ్యులుగా చేర్చటం, సంఘాల ఏర్పాటు, పాడిగేదెల కోసం రుణాల కల్పన, పాలసేకరణ కేంద్రాల్లో సామగ్రి ఏర్పాటు వంటి వాటిని ప్రభుత్వమే సమకూర్చింది. డీఆర్‌డీఏ, పశుసంవర్థక శాఖ, సహకార సంఘాలు అధికారులు, సిబ్బంది ప్రధానంగా, అలాగే కలెక్టర్‌ నుంచి సచివాలయ సిబ్బంది వరకు ఈ పథకంలో పనిచేస్తున్నారు. జిల్లాలో అధికారిక సమాచారం ప్రకారం 14 మండలాల్లోని 147 ఆర్బీకేల పరిధిలో 229 గ్రామస్థాయి పాలకేంద్రాలు ఏర్పాటు చేయగా జిల్లాస్థాయిలో కలెక్టర్‌ పర్యవేక్షణలో ఏడుగురు కీలక శాఖల అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షణలో సాగుతోంది. ఇక ఆయా కేంద్రాలను 27 గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపునకు ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ మెంటార్‌గా, మండలానికి ఒక ఏపీఎంను ఆడిట్‌ అధికారిగా, మరో 24మంది సహకారశాఖ ఉద్యోగులను సహాయకులుగా నియమించారు. అదేసమయంలో మండలస్థాయిలో ఐదుగురు ముఖ్యమైన అధికారుల పర్యవేక్షణలో గ్రామస్థాయిలో సంబంధిత ఐదుగురు సచివాలయ సిబ్బందిని భాగస్వాములను చేశారు. 


అయినా స్పందన కరువు

వందలాదిమంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని భాగస్వామ్యం చేసినా జిల్లాలో పాలవెల్లువ పథకానికి పాడిరైతుల నుంచి స్పందన కనిపించడం లేదు. జిల్లాలో సగటున రోజుకు 4 లక్షల నుంచి 4.50 లక్షల లీటర్ల వంతున చూసినా ఈ 20 నెలల్లో దాదాపు 25 నుంచి 30 కోట్ల లీటర్లు డెయిరీలకు పాడిరైతులు పాలుపోసినట్లు అంచనా. అయితే అందులో కేవలం రూ.36.37 కోట్ల విలువైన 66.46లక్షల లీటర్లు మాత్రమే పాలవెల్లువ కేంద్రాలకు వచ్చాయి. ఇక తాజా పరిస్థితిని పరిశీలిస్తే జిల్లాలోని 14 మండలాల్లోని 147 ఆర్బీకేల పరిధిలో 229 కేంద్రాలను ఏర్పాటుచేయగా అందులో 21 కేంద్రాలు అసలు ప్రారంభమే కాలేదు. 67 కేంద్రాలు కొన్ని రోజులు పనిచేసి మూతపడ్డాయి. పాలు అధికంగా వచ్చిన తాళ్లూరు మండలంలోనే పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలో ప్రస్తుతం 141 కేంద్రాల్లో పాల సేకరణ జరుగుతుండగా కనిష్ఠంగా ఒక్కో కేంద్రంలో 35 లీటర్లు, గరిష్ఠంగా 150 లీటర్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సగటున 70 నుంచి 80 లీటర్లలోపు ఉంటూ పదివేల లీటర్లకు అటుఇటుగా మాత్రమే వస్తున్నాయి. ఇవి రోజువారీ జిల్లా ఉత్పత్తిలో 2 నుంచి 3 శాతంలోపుగానే అని తెలుస్తోంది. 


Updated Date - 2022-10-04T06:36:06+05:30 IST