‘జగనన్న బాణం’ సంధించిన కలకలం!

ABN , First Publish Date - 2021-01-25T07:39:45+05:30 IST

స్థానిక ఎన్నికలపై ‘హైటెన్షన్‌’ కొనసాగుతున్న సమయంలో... జగనన్నపై షర్మిల రాజకీయ బాణం వదులుతున్నారనే అంశం పెను సంచలనం సృష్టించింది.

‘జగనన్న బాణం’ సంధించిన కలకలం!

  • షర్మిల కొత్త పార్టీ వార్తలతో సంచలనం
  • ‘కొత్త పలుకు’పై సర్వత్రా చర్చ
  • వైసీపీ శిబిరం వ్యూహాత్మక మౌనం
  • ‘ఇంటి పోరు’ నిజమేనని అంగీకారం
  • కొత్త పార్టీ ఖాయమంటున్న విశ్లేషకులు
  • స్వాగతిస్తున్న తెలంగాణలోని వైఎస్‌
  • అభిమానులు.. లాభనష్టాలపై బేరీజు


(అమరావతి/హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి ): స్థానిక ఎన్నికలపై ‘హైటెన్షన్‌’ కొనసాగుతున్న సమయంలో... జగనన్నపై షర్మిల రాజకీయ బాణం వదులుతున్నారనే అంశం పెను సంచలనం సృష్టించింది. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘కొత్త పలుకు’ రాజకీయ వర్గాలతోపాటు సామాన్యుల్లోనూ చర్చనీయాంశమైంది. అన్న జగన్‌పై ఆగ్రహంతో ఉన్న సోదరి షర్మిల... తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి, ‘రాజన్న రాజ్యం’ అంటే ఏమిటో చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇంటి పోరు’లో తల్లి విజయలక్ష్మి కూడా షర్మిల వైపే నిలిచినట్లు సమాచారం! దీంతోపాటు మరిన్ని అంశాలతో ప్రచురితమైన ‘కొత్త పలుకు’పై అధికారపక్ష నేతలు తమలో తాము చర్చించుకున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య చాలా రోజులుగా పొసగడంలేదనే విషయం తెలిసిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే... షర్మిల తెలంగాణలో స్వయంగా రాజకీయ పార్టీ పెట్టి అన్నకు సవాలు విసురుతారనే సమాచారం సంచలనాత్మకమే అని చెబుతున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య, సమన్వయం ఉంటే... ఏపీలో ఉన్న వైసీపీనే తెలంగాణలోనూ రంగప్రవేశం చేయించి, అక్కడి బాధ్యతలు షర్మిలకు అప్పగించేవారని విశ్లేషిస్తున్నారు. అయితే... ‘కొత్త పలుకు’లోని అంశాలపై వైసీపీ కీలకనేతలుకానీ, పార్టీ ప్రతినిధులుకానీ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనిపై వారంతా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న విషయాలకే.. ‘ఆంధ్రజ్యోతి’పై అంతెత్తున లేచే నేతలు సైతం ఈ అంశంపై కిమ్మనలేదు. 


వైసీపీ సోషల్‌ మీడియా సైన్యం కూడా ‘మ్యూట్‌’లోనే ఉండిపోవడం విశేషం. ఈ వార్తలపై షర్మిల వైపు నుంచి కూడా స్పందన రాకపోవడం గమనార్హం. జగన్‌ కుటుంబ వ్యవహారాలు, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే... షర్మిల పార్టీ పెట్టడం ఖాయమనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే...  తన సోదరుడు జగన్‌తో విభేదిస్తూ ఏపీలో కాకుండా, తెలంగాణలో పార్టీ పెట్టడం ఏమిటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టటానికి సిద్ధపడటం వెనుక కారణాలు ఏమిటని ఆరా తీస్తున్నారు. షర్మిల పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, జగన్‌కు అది ఏ విధంగా ఇబ్బందికరం అనే అంశంపైనా జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. బహుశా ఫిబ్రవరి 9వ తేదీనే షర్మిల తన రాజకీయ పార్టీపై అధికార ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. అంటే, 15 రోజుల్లో సస్పెన్స్‌ వీడుతుందని, అసలు విషయమేదో అప్పుడే తేలిపోతుందని పేర్కొంటున్నారు.


తెలంగాణతో షర్మిలకు అనుబంధం

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి తెలంగాణలోనూ పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు.   ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌ జైలులో ఉండగా... షర్మిల చేపట్టిన పాదయాత్ర తెలంగాణలోనూ సాగింది. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానాన్ని గెల్చుకుంది. అనంతరం రాష్ట్ర విభజన జరగటం, జగన్‌ ఏపీ రాజకీయాలకే పరిమితం కావడంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ... టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకొన్నారు. వైఎ్‌సతో సన్నిహితంగా మెలిగిన నేతలు గడిచిన ఆరున్నరేళ్లలో ఇతర పార్టీల్లో కుదురుకున్నప్పటికీ... వైఎస్‌ కుటుంబానికి సన్నిహితులు, విధేయులైన వారు మాత్రం షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆమె పార్టీ ప్రకటించటానికి ముందు, తర్వాత ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలంగాణలోని కొన్ని జిల్లాలకు చెందిన నేతలు యోచిస్తున్నారు.


ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడితే, ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే కోణంలోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. తెలంగాణలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానుల్లో అన్ని కులాలు, మతాల వారు ఉన్నప్పటికీ, అందులో రెడ్డి సామాజిక వర్గం, క్రైస్తవ మతస్తులది సింహభాగమనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో నివసిస్తున్న ఏపీ ప్రజల్లో రాజశేఖరరెడ్డిని అభిమానులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైసీపీ రహస్య ప్రచారంతో సెటిలర్లు టీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేశారని, అందుకే ఆ నియోజకవర్గాల పరిధిలో గులాబీ పార్టీ ఎక్కువ డివిజన్లు గెలిచిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడితే, వైఎ్‌సను అభిమానించే రెడ్లు, క్రైస్తవులు, సెటిలర్లు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


దీంతో రాష్ట్రంలో నానాటికీ తీసికట్టుగా మారుతున్న కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారుతుందని, ఆ తర్వాత దెబ్బ టీఆర్‌ఎ్‌సపైనే పడుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే షర్మిల పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, టీఆర్‌ఎ్‌సకే ప్రయోజనం కలుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్‌ షర్మిల ఇక్కడ పెట్టబోయే పార్టీకి బీజేపీ వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈమధ్య తెలంగాణలో పుంజుకుంటున్నప్పటికీ, బీజేపీకి సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకు లేదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

Updated Date - 2021-01-25T07:39:45+05:30 IST