జగన్నాథా.. ఏదీ నాటి వైభవం?

ABN , First Publish Date - 2022-07-01T05:37:03+05:30 IST

విజయనగరం దాసన్నపేటలో జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలకు ఎంతో ప్రాశస్త్యం ఉండేది. రథయాత్ర విశేష క్రతువులు, పూజలతో వైభవంగా జరిగేది. ఇప్పుడూ వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటుంటారు. రథయాత్రలో పాల్గొంటుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటి వైభవంతో నేటి పరిస్థితిని పోల్చుకుని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

జగన్నాథా.. ఏదీ నాటి వైభవం?
శిథిలమైన జగన్నాథ స్వామి రథం


శిథిలావస్థకు చేరుకుంటున్న ఆలయం
స్వామి ఊరేగింపునకు పనిచేయని రథం
నేటి నుంచి 9 రోజులు తొలి రథయాత్ర

(విజయనగరం రూరల్‌)

విజయనగరం దాసన్నపేటలో జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలకు ఎంతో ప్రాశస్త్యం ఉండేది. రథయాత్ర  విశేష క్రతువులు, పూజలతో వైభవంగా జరిగేది. ఇప్పుడూ వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటుంటారు. రథయాత్రలో పాల్గొంటుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటి వైభవంతో నేటి పరిస్థితిని పోల్చుకుని భక్తులు ఆవేదన చెందుతున్నారు. రెండు దశాబ్దాలుగా ఉత్సవాలు మొక్కుబడిగా సాగిపోతున్నాయి. ఆలయం శిథిలావస్థకు చేరుకుంటోంది. రథయాత్రలో స్వామిని ఊరేగించే రథం కూడా మూలకు చేరిపోయింది. 2019 వరకూ స్వామి సేవకు రథాన్ని ఉపయోగించేవారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రథోత్సవం జరగలేదు. దీంతో నిర్వహణ లేక రథం మూలకు చేరింది. చక్రం బయటకు వచ్చేసింది. ఇతర భాగాలు విరిగిపోయాయి.

దేవదాయశాఖ పరిధిలో ఉన్న దాసన్నపేట జగన్నాథ స్వామి ఆలయం పురాతన కాలం నాటిది. రెండు దశాబ్దాల క్రితం వరకూ రథయాత్ర అంటే దాసన్నపేట.. దాసన్నపేట అంటే జగన్నాథుని రథయాత్ర.. అని పేరుండేది. విజయనగరం నుంచే కాక నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రథయాత్ర చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు. తొలి రథయాత్ర నుంచి మారు రథయాత్ర వరకూ ఆలయం భక్తులతో కిక్కిరిసి ఉండేది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్వామికి నిత్య పూజలకు ఇబ్బంది లేకపోయినా ఆలయం కళ తప్పింది. వాస్తవానికి తొలి రథయాత్ర రోజు స్వామికి పూజలు నిర్వహించి ఆలయం నుంచి నవాబుపేట జంక్షన్‌ వరకూ రథయాత్ర జరుగుతుంది. రథాన్ని అక్కడ ఉంచి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. శుక్రవారం ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ రథయాత్రకు ఉపయోగించే రథం మూలకు చేరిందన్న విషయం తెలిసినా దేవదాయశాఖాధికారులు కనీసం పట్టించుకోలేదు. పైగా రథానికి బదులు ఓ వాహనంపై స్వామి ఉత్సవ విగ్రహాలు అధిష్టింపజేసి ఊరేగించేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలిసి భక్తులు మనస్తాపం చెందుతున్నారు. రథానికి మరమ్మతులు చేయకుండా ప్రైవేటు వాహనంపై ఊరేగించాలనుకోవడం సరికాదంటున్నారు. తొలి రఽథయాత్ర నుంచి మారు రథయాత్ర వరకూ వారం రోజులు సమయం ఉంది. కనీసం మారు రథయాత్రనాటికైనా రథాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు.
ఫ జగన్నాథుని తొలి రథయాత్ర శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. నెల్లిమర్ల,  బొబ్బిలి, గంట్యాడ, ఎస్‌.కోట, గజపతినగరం ఇలా చాలా ప్రాంతాల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. విజయనగరం విషయానికి వచ్చేసరికి మన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయం ఉన్న మండపం వీధి, ఖమ్మవీధి జంక్షన్‌, కన్యకాపరమేశ్వరీ ఆలయం రోడ్డులో ఉన్న సంతపేట జగన్నాథ స్వామి ఆలయం, అదే విధంగా కర్రల మార్కెట్‌లో వున్న జగన్నాథ స్వామి ఆలయాలు రథయాత్రకు సిద్ధమయ్యాయి. ముందుగా గురువారం స్వామి వారి నేత్రోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తొలుత అద్దంలో స్వామిని దర్శించుకున్న తరువాత నేరుగా స్వామి దర్శనానికి అవకాశం కల్పించారు. ఉత్సవాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యలు ఎదురుకాకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు.


Updated Date - 2022-07-01T05:37:03+05:30 IST