ltrScrptTheme3

ప్రజల్ని చీల్చేందుకే జగన్‌ పన్నాగం

Oct 26 2021 @ 03:56AM

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక కల్లోలిత ప్రాంతంలా కనిపిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ఒక అరాచక శైలిలో పనిచేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అన్నిచోట్లా స్వైరవిహారం చేస్తూ ప్రజల్లో బీభత్స వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. విమర్శించాలన్నా, ప్రశ్నించాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పోలీసులు అధికార పార్టీకి అనుగుణంగా పనిచేయడమో, ప్రేక్షకులుగా మారడమో జరుగుతుంటే అధికార పార్టీలో ఉన్న వారు ఇష్టారాజ్యంలా దుండగుల్లా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అన్న మాటకు వక్రభాష్యాలు చెప్పి అధికార పార్టీ కార్యకర్తలు ఆ ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడులు చేసి విధ్వంసకాండ సృష్టిస్తూ నానా బూతులు మాట్లాడుతుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకాన్ని సమర్థిస్తూ మాట్లాడారు! తనను తాను రాజ్యాంగ హోదాలో ఉన్నానని చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించేలా మాట్లాడడం, తన సానుభూతి పరులు ఆగ్రహంతో స్పందించారని వ్యాఖ్యానించడం ఆయన ఫ్యాక్షనిస్టు మనస్తత్వాన్ని నిరూపిస్తోంది. దీనితో రాష్ట్రంలో ఎక్కడికక్కడ రాజకీయ, సామాజిక వాతావరణం మరింత కలుషితమైంది. 


ఒక ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి చేసిన వ్యాఖ్యపై ముఖ్యమంత్రి కానీ ఆయన అనుయాయులు కానీ ఎందుకు అంత తీవ్రంగా స్పందించారు? రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న, భ్రమలు కోల్పోయిన ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. తన అరాచక అసమర్థ పాలనను ప్రజలు గుర్తించారని, స్వంత పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జగన్‌కు అర్థమైంది. అందుకే ప్రజలను వర్గాలుగా చీలగొట్టి పబ్బం గడుపుకునేందుకు ఆయన ఉద్దేశ పూర్వకంగా ఉద్వేగ పరిస్థితులు కల్పించారు. రాష్ట్రంలో ఆర్థికవ్యవస్థ ఎంత దారుణంగా మారిందంటే కనీసం జీతాలు, పింఛన్లు కూడా సకాలంలో చెల్లించే పరిస్థితి కనపడడం లేదు. ప్రకటించిన సంక్షేమ పథకాలు కాగితాల్లో ప్రచారం చేస్తున్నారు కానీ ఆచరణలో అవి అంతగా అమలు కావడం లేదు. అప్పులు తెస్తేనే రాష్ట్రం మనుగడ సాధించలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికి రూ. 5 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారు, ఇసుక, ఇటుక, ఉక్కుతో పాటు రాష్ట్రంలో అన్ని వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. అప్పులను సర్దుబాటు చేసుకోవడానికి భూములను తాకట్టు పెడుతున్నారు. మటన్, సినిమా టిక్కెట్లను కూడా వదలలేదు. విద్యుత్ చార్జీలు, చెత్తపన్ను, ఇంటిపన్ను, పెట్రోల్ చార్జీలతో ప్రజలను చావ బాదుతున్నారు. మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నామంటూ అత్యధిక ధరలతో పనికిరాని బ్రాండ్ల అమ్మకాన్ని అనుమతించి భారీ వసూళ్లు చేసుకుంటున్నారు. మద్యం, దొంగసారాయి, గంజాయి వ్యాపారంతో జేబులు నింపుకుంటున్నారు. రైతులకు మద్దతు ధరలు లభించడం లేదు. కాంట్రాక్టర్లకు సంబంధించి భారీఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అమలు చేసిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను నిర్లక్ష్యం చేసి ప్రజలు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పనికిమాలిన సలహాదారులను నియమించుకుని ఖజానాను దుర్వినియోగం చేస్తున్నారు. కబ్జాల సంస్కృతి పరాకాష్ఠకు చేరింది. అదే పనిగా ఆయన అరాచక ముఠా రాష్ట్రంలో ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూములను ఎడాపెడా ఆక్రమించుకుని పట్టాలుగా మార్చి అమ్ముకుంటోంది. ఇటీవల పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి మాట్లాడిన ఒక సభలో మునిసిపల్ చైర్మన్ కొడుకు తన భూమిని ఆక్రమించారని ఆక్రోశిస్తూ ఒక తల్లి తన కొడుకుతో సహా పురుగుల మందు తాగడంతో ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటి ఎన్నో అకృత్యాల వల్ల జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసమ్మతి తీవ్రంగా పెరిగిపోయింది. ఇటీవల అవినీతి, వ్యక్తిత్వం, పరిపాలన, ప్రజలతో సంబంధాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా ‘సీ ఓటర్’ అన్న సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో దేశంలోనే ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని తేలింది. ఈ వ్యతిరేకత గురించి తెలిసినందువల్లే ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లకుండా తన తాడేపల్లి ఇంధ్రభవనానికి పరిమితమయి మాఫియా, ఫ్యాక్షనిస్టు చర్యలకు అక్కడి నుంచి తెరలేపుతున్నారు. నేర చరితులు అధికార పీఠం ఎక్కితే ఏమవుతుందో జగన్ రుజువు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ఒక డిక్షనరీలో గాడ్ అంటే క్రైస్తవులు, ముస్లింలు, యూదులు నమ్మే శక్తి అని ప్రచురించారంటేనే అధికారంలో ఉన్న వారి ప్రోద్బలం ఎవరివైపు ఉన్నదో అర్థమవుతోంది.


వైసీపీ ప్రభుత్వం పట్ల భ్రమలు తొలగిపోతున్నందునే ఇవాళ పులివెందుల, జమ్మల మడుగులో కూడా ఆ పార్టీ నేతలు బిజెపిలో చేరుతున్నారు. వారిని కూడా భయాందోళనలకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ ఓటర్లను భయకంపితులు చేయడమే కాకుండా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. గతంలో తిరుపతి లోక్‌సభా నియోజక వర్గ ఉపఎన్నికల్లో ఇతర ప్రాంతాలనుంచి రెండు లక్షల మందికి పైగా బోగస్ ఓటర్లను రప్పించి ఓట్లు వేయించారన్న విషయం ప్రత్యక్షంగా రుజువైంది. ఈ నెల 30 వ తేదీన ఉపఎన్నిక జరగనున్న బద్వేల్ శాసనసభా నియోజకవర్గంలో కూడా అదే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా ఓటర్ల వివరాలు సేకరించి తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని, మనుగడ లేకుండా చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఊళ్లలో లేని ఓటర్ల స్థానంలో బోగస్ ఓటర్లను తయారు చేస్తున్నారు. వారి పేర్లపై బోగస్ ఓటింగ్ గుర్తింపు కార్డులను కూడా ప్రింట్ చేస్తున్నారు. మొత్తం అధికారగణం, పోలీసులు వారి మనుషులు కావడంతో వారు ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. అందుకే కేంద్ర సాయుధ బలగాలను, ప్రత్యేక పరిశీలకులను నియమించి ఎన్నికలను జరిపించాలని, 221 పోలింగ్ కేంద్రాలలో సిసిటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్‌కు వినతిపత్రం సమర్పించాము. ఎన్నికల కమిషన్ ఇందుకు అంగీకరించి 15 కంపెనీల కేంద్ర బలగాలను నియమించడమే కాక ప్రత్యేక పరిశీలకులను పంపించనున్నది. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీటీవి కెమేరాలను ఏర్పాటు చేయనున్నది. ఇది మేము సాధించిన విజయం.

వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.