బీజేపీ ప్రభుత్వం యువకులను చంపుతుంటే.. టీఆర్‌ఎస్‌ శవ రాజకీయం చేస్తోంది

ABN , First Publish Date - 2022-06-20T08:58:48+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువకులను చంపుతుంటే.. టీఆర్‌ఎస్‌ శవ రాజకీయాలు చేస్తోందంటూ టీపీసీసీ

బీజేపీ ప్రభుత్వం యువకులను చంపుతుంటే.. టీఆర్‌ఎస్‌ శవ రాజకీయం చేస్తోంది

రాకేశ్‌ మరణానికి బాధ్యులు మోదీనా.. కేసీఆరా? 

నిరుద్యోగులారా.. ప్రాణాలు తీసుకోవద్దు 

సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది

మోదీ వల్లనే ఆందోళనలు

గాంధీభవన్‌లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో జగ్గారెడ్డి


హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువకులను చంపుతుంటే.. టీఆర్‌ఎస్‌ శవ రాజకీయాలు చేస్తోందంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్మీ ఉద్యోగ అభ్యర్థి రాకేశ్‌ మరణానికి బాధ్యులు ప్రధాని మోదీనా.. సీఎం కేసీఆరా అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని, వారికి కాంగ్రెస్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష జరిగింది. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఈ దీక్షలో జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాకేశ్‌పై బీజేపీ కంట్రోల్‌లో ఉన్న పోలీసులు కాల్పులు జరిపితే.. టీఆర్‌ఎస్‌ నేతలేమో ఆయన మృతదేహంపైన టీఆర్‌ఎస్‌ కండువా కప్పి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.


బీజేపీ, టీఆర్‌ఎ్‌సల మధ్య ఇలాంటి రాజకీయం నడుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీలో చేరి దేశసేవ చేద్దామనుకునే యువతకు ఉద్యోగాలు లేకుండా చేసే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు.. కేంద్రం ఇవ్వాల్సిన ఉద్యోగాల సంగతి ఏంటన్నది చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మూడు వేల మందితో బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘‘సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ఆందోళన చేసిన యువకులు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కార్యకర్తలంటూ బండి సంజయ్‌ మాట్లాడుతున్నడు. ఆయనకు బుర్ర ఉందా? టీవీల ముందు మాట్లాడటం కాదు. సికింద్రాబాద్‌కు పోయి మాట్లాడు. లేదంటే కలిసి వరంగల్‌కు వెళదాం.


కిషన్‌రెడ్డీ సెక్యూరిటీతో రావచ్చు. వరంగల్‌ జిల్లాలోని రాకేశ్‌ ఇంటికి వెళ్లి మాట్లాడుదాం’’ అని సవాల్‌ విసిరారు. రైల్వేస్టేషన్లో కాంగ్రెస్‌ గూండాలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలకుగాను బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ప్రశ్నించేందుకు సోమవారం రాహుల్‌ను ఈడీ కార్యాలయానికి పిలిచిన నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ దీక్ష నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈడీ కార్యాలయం నుంచి రాహుల్‌ బయటికి వచ్చే వరకూ దీక్ష కొనసాగుతుందని చెప్పారు.

Updated Date - 2022-06-20T08:58:48+05:30 IST