Congress‌లోనే కంటిన్యూ అవుతారా? లేక కటీఫ్ చెప్పి కారెక్కుతారా..?

ABN , First Publish Date - 2022-01-17T17:51:59+05:30 IST

టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సెపరేటు. ఆయన తీరుతో ఎప్పుడూ చర్చల్లో ఉంటారు. చేసే ఆలోచనలు, వేసే అడుగు...

Congress‌లోనే కంటిన్యూ అవుతారా? లేక కటీఫ్ చెప్పి కారెక్కుతారా..?

టి.కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేపిన కాక చల్లారినట్లేనా? పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన జగ్గారెడ్డి... కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతారా? లేక కటీఫ్ చెప్పి కారెక్కుతారా? ఆయన పొలిటికల్ జర్నీ ఏ టర్న్ తీసుకుంటుంది? హస్తం పార్టీ రాజకీయాల్ని హీటెక్కిస్తున్న ఫైర్ బ్రాండ్ జగ్గన్న వ్యవహారంపై గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోన్న చర్చేమిటి? ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


సంతోషం వచ్చినా ఆపుకోలేరు... ఆవేశం వచ్చినా అదుపులో ఉంచుకోలేరు..

 టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సెపరేటు. ఆయన తీరుతో ఎప్పుడూ చర్చల్లో ఉంటారు. చేసే ఆలోచనలు, వేసే అడుగులు, మాట్లాడే మాటలు అన్నీ అనూహ్యంగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లు చెప్పడం, మనసుకు నచ్చిందే మాట్లాడటం ఆయన నైజం. సంతోషం వచ్చినా ఆపుకోలేరు... ఆవేశం వచ్చినా అదుపులో ఉంచుకోలేరని జగ్గన్నకు పేరుంది. ప్రత్యర్థి అయినా నచ్చితే ఓ రేంజ్ లో ప్రశంసిస్తారు. సొంత పార్టీ అయినా నచ్చకపోతే అదే స్థాయిలో విమర్శల దాడికి దిగుతారు. లాభనష్టాల లెక్కలు వేసుకుని ఆయన వ్యవహరించరనే టాక్ కూడా ఉంది.


అందరూ జైతెలంగాణ అని నినదిస్తే.. జగ్గారెడ్డి సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించారు

ఉద్యమకాలంలో అందరూ జైతెలంగాణ అని నినదిస్తే.. జగ్గారెడ్డి మాత్రం ఇదే గడ్డమీద నుంచి సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించారు. ఎన్ని విమర్శలొచ్చినా ఆయన నినాదాన్ని మాత్రం మార్చుకోని మొండి మనిషి. అలాంటి జగ్గారెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో న్యూస్ సెంటర్‌గా మారారు. పార్టీలో అంతా సైలెంట్‌గా ఉంటే ఆయన మాత్రం పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై ఎదురుదాడితో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నారు. ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసి టి.కాంగ్రెస్‌లో కలకలం సృష్టించారు. పార్టీ తాఖీదులు ఇస్తే ఇన్‌ఛార్జ్‌ ఠాగూర్‌కే రాజీనామా చేస్తానని వార్నింగ్‌తో షాకిచ్చారు. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జగ్గారెడ్డి ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ జర్నీపై అనుమానాలకు తెరలేపింది.


 జగ్గారెడ్డి టీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నారా?

ఇటీవల జగ్గారెడ్డి టీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నారా? అనే అనుమానం బలపడేలా వ్యవహరిస్తున్నారు. అందుకు తాజాగా జగ్గన్న వ్యవహరిస్తున్న తీరే అందుకు తావిస్తోంది. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌తో  సన్నిహితంగా మెలిగారు. పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ సైతం "మా ఎమ్మెల్యేలు, ఎంపీలను జాగ్రత్తగా చూసుకోవాలి" అని జగ్గారెడ్డిని కోరారు. ఇక మెడికల్ కాలేజ్ సహా అభివృద్ధి పనులు జగ్గారెడ్డి కోరినందునే సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారని ప్రకటించారు. ఈ సందర్భంలో మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరూ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఇక హరీశ్‌రావు పేరు చెబితేనే విరుచుకుపడే జగ్గారెడ్డి... ఇటీవల జడ్పీ సమావేశంలో ఆయన్ను కలిసి అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం ఇవ్వడం కూడా చర్చకు దారితీసింది. 


పదేపదే పీసీసీపై ఆయన చేస్తున్న ప్రకటనలు

ఇక ఇదే సమయంలో సొంత పార్టీ ముఖ్య నేతల మీద జగ్గారెడ్డి విరుచుకుపడుతున్నారు. ఎర్రవెల్లిలో రచ్చబండను ప్రకటిస్తే రచ్చరచ్చ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వరా? అని ప్రశ్నించడమే కాకుండా.. దాన్ని బహిష్కరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించి కాక పుట్టించారు. టీపీసీసీ చీఫ్‌ పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాసి కలకలం సృష్టించారు. పదేపదే పీసీసీపై ఆయన చేస్తున్న ప్రకటనలు పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీంతో జగ్గారెడ్డిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేసిన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కే ఆయన రివర్స్ షాకిచ్చారు. తానే పార్టీకి ఇబ్బంది అయితే రాజీనామా చేస్తానంటూ పీఏసీ సమావేశంలో ఇన్‌ఛార్జికి జగ్గారెడ్డి తేల్చిచెప్పడం పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వరుస పరిణామాలతో జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 


పార్టీ శ్రేయస్సు కోసమే తాను పీసీసీ పద్ధతి మార్చుకోవాలి

కారెక్కే వ్యూహంతోనే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ క్యాడర్‌ను కన్ఫ్యూజ్‌ చేసి పార్టీకి నష్టంచేసే పనులు చేస్తున్నారని ఓ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే జగ్గారెడ్డి మాత్రం ఆ వాదనలు కొట్టిపారేస్తున్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను పీసీసీ పద్ధతి మార్చుకోవాలని కోరుతున్నానని వివరిస్తున్నారు. ఓ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనుల కోసం మంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరే సమస్యే లేదని అంటున్నారు. మరే పార్టీలో చేరేది కూడా లేదని తేల్చిచెబుతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితే వస్తే ఇండిపెండెంట్‌గా కొనసాగుతానంటున్నారు. పార్టీలో ఎన్నో బాధలు ఉన్నాయని, వాటన్నింటిని చెప్పుకునేందుకు సంక్రాంతి తర్వాత ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలుస్తానన్నారు. కాగా, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ బహిరంగ ప్రకటన చేయడం వల్లే జగ్గారెడ్డి అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన వర్గం చెబుతోంది. 


కేసీఆర్ సైతం బీజేపీని పైకిలేపే ప్రయత్నం..

అయితే జగ్గారెడ్డి తీరుపై పొలిటికల్ సర్కిల్స్‌లో మరో చర్చ కూడా జరుగుతోంది. నిజానికి రాష్ట్రంలో బీజేపీ దూకుడుతో కాంగ్రెస్ కొంత వెనుక పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు క్యాడర్‌ బేస్‌గా ఉన్న కాంగ్రెస్‌కు వెళ్లొద్దన్న ఎత్తుగడతో కేసీఆర్ సైతం బీజేపీని పైకిలేపే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది కేసీఆర్‌కు ఏకు మేకయ్యేలా ఎదిగితే... వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి రావొచ్చు. జాతీయ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్‌తో పొత్తుకు మొగ్గు చూపొచ్చు. ఆ పరిస్థితే వస్తే ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిర్చి... దాన్ని సక్సెస్ చేసే బాధ్యతను తాను తీసుకునే దూరదృష్టితోనే జగ్గారెడ్డి టీఆర్ఎస్‌తో శత్రుత్వం పెరగకుండా వ్యవహరిస్తూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా జగ్గారెడ్డి ఆలోచన ఏమిటో తెలియాలంటే.. కొద్దిరోజులు వేచిచూడాల్సిందే! 

Updated Date - 2022-01-17T17:51:59+05:30 IST