Saudi Arabia: అక్కడ ఉండలేక.. ఇక్కడికి రాలేక.. 14ఏళ్లుగా తెలుగోడి గోస

ABN , First Publish Date - 2022-07-25T18:33:23+05:30 IST

అతడికి ప్రస్తుతం 50ఏళ్లు. కొన్నేళ్లపాటు ఇక్కడే స్థానికంగా దొరికే కూలి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. కూలీ డబ్బులతో కుటుంబ సభ్యుల కడుపు నింపాడు కానీ.. ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయా

Saudi Arabia: అక్కడ ఉండలేక.. ఇక్కడికి రాలేక.. 14ఏళ్లుగా తెలుగోడి గోస

ఎన్నారై డెస్క్: అతడికి ప్రస్తుతం 50ఏళ్లు. కొన్నేళ్లపాటు ఇక్కడే స్థానికంగా దొరికే కూలి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. కూలీ డబ్బులతో కుటుంబ సభ్యుల కడుపు నింపాడు కానీ.. ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ చేసే కూలి పనేదో గల్ఫ్ దేశాల్లో చేస్తే.. కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని భావించాడు. ఫలితంగా రూపాయి వెనకేసుకోవచ్చనకున్నాడు. ఈ క్రమంలోనే అప్పు చేసి, ట్రావెల్ ఏజెంట్‌(Travel Agent)ను సంప్రదించాడు. సౌదీ వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో.. 14ఏళ్లుగా కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్న అతడి పేరు ఓర్పుల కొమురయ్యా.


జగిత్యాల‌(Jagtial)లోని రాములపల్లికి చెందిన ఓర్పుల కొమురయ్యా.. 2008లో ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించి.. అతడి ద్వారా సౌదీ అరేబియా (Saudi Arabia)‌కు చేరుకున్నాడు. అనంతరం ఆ దేశ రాజధాని రియాద్‌(Riyadh)లోని ఓ కంపెనీలో పనికి కుదిరాడు. ‘హమ్మయ్య.. ఇక తన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది’ అని అనుకునేలోపే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్ ఏజెంట్‌తో కమిషన్ విషయంలో తేడా వచ్చింది. ఆ తర్వాత తాను పని చేస్తున్న కంపెనీ నుంచి అతడికి ఊహించని షాక్ ఎదురైంది. కొమురయ్య కంపెనీకి డబ్బులు కట్టలేదని ఆరోపిస్తూ సంస్థ ప్రతినిధులు అక్కడి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు అతడిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఈ క్రమంలో గత 14ఏళ్లుగా స్వస్థలానికి తిరిగి రాలేక.. అక్కడే ఉండలేక నరకం అనుభవిస్తున్నాడు. 



కొమురయ్య పరిస్థితిపై అతడి భార్య మల్లవ్వ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన భర్తను ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్త చేస్తుంది. తన భర్తకు సహాయం చేయాల్సిందిగా తెలంగాణ ఎన్నారై సెల్, ఇండియన్ ఎంబసీని సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కొమురయ్య వంటి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ షేక్ చాంద్ పాషా అనే సోషల్ యాక్టివిస్ట్ తాజాగా ట్యాంక్‌ బండ్‌ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వందలాది మంది బాధితులు గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని.. భారత ప్రభుత్వం వారిని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-25T18:33:23+05:30 IST