జహంగీర్‌పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్ర : బీజేపీ ఎంపీ

ABN , First Publish Date - 2022-04-17T23:36:20+05:30 IST

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జహంగిర్‌పుర్ ఘర్షణ అంతర్జాతీయ కుట్రలో భాగమని బీజేపీ నేత, వాయువ్య ఢిల్లీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ వ్యాఖ్యానించారు.

జహంగీర్‌పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్ర : బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జహంగీర్‌పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్రలో భాగమని బీజేపీ నేత, వాయువ్య ఢిల్లీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ వ్యాఖ్యానించారు. భారత్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే విదేశీ శక్తుల లక్ష్యమని అన్నారు. దేశంలో నివసిస్తున్న కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తులకు సాయమందిస్తున్నాయని ఆరోపించారు. ‘ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర. భారత్‌ను అపకీర్తిపాలుచేయడమే వారి లక్ష్యం. ఈ ఘటన విషయంలో ఏ మతాన్నీ నిందించలేం. ఈ ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి’ అని పేర్కొన్నారు. కాగా ఎంపీ హన్స్ రాజ్ వాయువ్య ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ఘటన ప్రాంతాన్ని ఢిల్లీ బీజేపీ లీడర్లు అదేష్ గుప్తా, రామ్‌వీర్ సింగ్ బిధురి సందర్శించారు.


జహంగీర్‌పురి ఘర్షణపై ఢిల్లీ పోలీసులు మరో ప్రకటన విడుదల చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందన్నారు. తగిన స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్టు చెప్పారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఎలాంటి ఢోకా ఉండదని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ ఘటనపై సవ్యమైన దిశలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా శనివారం రాత్రి హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. మొత్తం 14 మంది గాయాలపాలయ్యారు. బాధితుల్లో పోలీసుల సంఖ్యే అధికంగా  ఉన్నారు. 

Updated Date - 2022-04-17T23:36:20+05:30 IST